Facebook Twitter
అదృష్టవంతుడు (చందమామ కథ)

ఒక ఊళ్ళో శివనాధుడనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా అల్లరివాడు. అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ పడేదికాదు. వాడికి చదువు అంటలేదు. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి, ఊరి మధ్యన గల మర్రిచెట్టు కింద మకాం పెట్టాడు. తన భవిష్యత్తు ఎలా ఉండేదీ తెలుసుకుందామని శివనాధుడు కూడా వచ్చి జ్యోతిష్కుడికి తన చెయ్యి చూపించాడు. జ్యోతిష్కుడు శివనాధుడి చెయ్యి చూసి తటాలున వదిలేసి నా జీవితంలో ఇంత అదృష్టవంతుడి చెయ్యి చూడలేదు. త్వరలోనే నువ్వు మట్టి పట్టుకుంటే బంగారమవుతుంది. చాలా గొప్పవాడివవుతావు  అన్నాడు.

ఈ మాటలు శివనాధుడే నమ్మలేక పోయాడు. ఊళ్ళో వాళ్ళు నవ్వేశారు. అది చూసి జ్యోతిష్కుడు శాస్ర్తం అబద్ధం చెప్పదు. అదృష్టం తన్నుకువస్తే, చేసిన నేరమే వరం కావచ్చు అన్నాడు. ఊళ్ళో వాళ్ళు తనను పరిహాసం చేసినందుకు శివనాధుడు ఎలాగైనా గొప్పవాడు కావటానికి తీర్మానించుకున్నాడు. కాని గొప్పవాడు అయ్యే మార్గం వాడికి తెలీదు. ముందు కాస్త డబ్బు సంపాదిస్తే గొప్పతనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఎరిగినవాడు ఒకడు అన్నాడు. కాని డబ్బు సంపాదించే మార్గం కూడా శివనాధుడికి తెలీదు. అతడికి పనిపాటలు రావు, చదువు లేదు. ఉన్న ఊళ్ళో తనపై ఎవరికీ సదభిప్రాయంలేదు గనక ముందు ఊరు విడిచి పెట్టటం వాడికి అవసరం అనిపించింది.

వాడు ఊరు దాటి అడవిలో ప్రవేశించి చాలా దూరం నడిచాడు. ఒక చోట ఒక చెట్టు కింద ఒక మనిషి పడుకుని నిద్రపోతూ వాడికి కనిపించాడు. ఆ నిద్రపోయే మనిషి పక్కన ఒక పెద్ద కత్తీ, ఒక మూటా ఉన్నాయి. శివనాధుడు ఆ మూట విప్పి చూశాడు. దాని నిండా బంగారు నాణాలు కనబడ్డాయి. శివనాధుడికి జ్యోతిష్కుడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. వాడు సందేహించకుండా, ఆ మూటనూ  కత్తినీ తీసుకుని, కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. ఇంతలోనే చెట్టు కింద నిద్రపోతున్న వాడు లేచి, జరిగిన సంగతి గ్రహించి పెద్దగా అరుస్తూ శివనాధుణ్ణి తరుముకుంటూ వచ్చాడు. శివనాధుడు వెనక్కు తిరిగి చూసి ఇక ఆ మనిషికి అందకుండా పారిపోలేమని గ్రహించి నిలబడ్డాడు. ఇంతలో ఆ మనిషి దగ్గిరికి రానే వచ్చాడు. శివనాధుడు తన వద్ద ఉన్న కత్తితో అతణ్ణి ఒక్క పోటు పొడిచాడు. ఆ మనిషి పెద్ద కేక పెట్టి కూలిపోయాడు. ఆ మనిషి కొద్దిసేపు కాళ్ళూ  చేతులూ కొట్టుకుని ప్రాణం వదలటం శివనాధుడు చూసి, కొయ్యబారి పోయాడు. తాను దొంగతనమే గాక హత్య కూడా చేశాడు. ఏమైనా వాడు తనకు చిక్కిన బంగారాన్ని మాత్రం వదలదలుచుకోలేదు. ఆ శవం దగ్గిర నుంచి సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగిపోయి మరొక గంటకల్లా అడవిదాటి ఒక ఊరు చేరాడు.

ఆ ఊళ్ళో వాడికి ఎదురైన మొట్టమొదటి మనిషి నీ అంగీనిండా ఆ రక్తం ఏమిటి?'' అని అడిగాడు. అంత దాకా తన అంగీ మీద రక్తం మరకలున్నట్టు ఎరగని శివనాధుడు తడువుకోకుండా వడో దొంగ నా సొమ్ము కాజెయ్యాలని చూశాడు. కత్తితో పొడిచాను అని బొంకాడు. క్షణంలో ఈ వార్త ఊరంతా పొక్కింది. పదిమంది చేరి శివనాధుడు చెప్పిన చోటికి వెళ్ళారు. చచ్చిపోయిన వాడు   కాలయముడు అని పేరు మోసిన గజదొంగ! వాణ్ణి చంపిన వారికి పదివేల వరహాలు బహుమానం ఇస్తానని కూడా రాజు ప్రకటించి ఉన్నాడు. ఈ సంగతి ప్రజలు శివనాధుడికి చెప్పి జయ జయ ధ్వానాలతో తమ గ్రామానికి తీసుకు వచ్చారు. అతనికి ఒక ఊరంటూ లేదని తెలుసుకుని, వాళ్ళు అతన్ని తమ గ్రామంలోనే ఉండి పొమ్మన్నారు. అనేక ఇళ్ళుగల సంపన్నుడు ఒకాయన శివనాధుడికి ఒక చిన్న ఇంటిని ఉచితంగా ఇచ్చేశాడు. త్వరలోనే అతనికి రాజుగారి బహుమతి కూడా అందింది.

ఇప్పుడు శివనాధుడి దగ్గిర మూలధనం చాలా ఉన్నది. కాని గొప్పవాడు కావటానికి అది చాలదు. ఇంకా ధనం సంపాదించటానికి అతను వ్యాపారం చేయదలచుకుని, కొన్ని గేదెలను కొని పాలవ్యాపారం ప్రారంభించాడు. అధిక లాభాల కోసం అతను పాలలో నీళ్ళు కలిపి అమ్మసాగాడు. అయితే ఈ వ్యాపారానికి ఒక చిన్న అంతరాయం వచ్చింది. అదేమంటే శివనాధుడు ఉండే ఊరికి నీటి సౌకర్యం లేదు. గ్రామస్థులకు దూరాన ఉండే ఏరే ఆధారం. చాలా మంది ఏటికి వెళ్ళి నీరు తెచ్చుకుంటారు. తెచ్చుకోలేని వాళ్ళు హెచ్చుకూలీ ఇచ్చి నీరు తెప్పించుకుంటారు. శివనాధుడి పాలవ్యాపారం పెరిగిన కొద్దీ నీరు హెచ్చుగా కావలసి వచ్చింది. హెచ్చుకూలీ ఇచ్చి నీరు కొని పాలలో కలిపితే లాభం తరిగిపోతుంది. అందుచేత శివనాధుడు తన దొడ్లోనే ఒక బావి తవ్వించాలనుకున్నాడు. ఈ పని రహస్యంగా జరగాలి గనక  అతను పొరుగూరి నుంచి కూలీలను రప్పించి, బావి తవ్వించాడు. అతని అదృష్టం ఇందులో కూడా బయట పడింది. ఆ ఊరిలో ఎవరు బావి తవ్వించినా ఎన్నడూ నీరు పడలేదు, కాని శివనాధుడికి పది అడుగుల లోతునే తియ్యని నీరు పడింది. బావి తవ్వకం పూర్తికాగానే అతను కూలీలను రహస్యంగా పంపేశాడు. అయినా శివనాధుడు అమ్మే పాలను గురించి గ్రామస్థులకు అనుమానం కలిగింది. అది బర్రెల తీరు అని అతను అంటే వాళ్ళు నిజమే కాబోలు ననుకున్నారు. కాని అతని పాలు ఏమాత్రమూ బాగుండటం లేదు. శివనాధుడి పోటీకి తట్టుకోలేక  లోగడ ఆ గ్రామంలో పాలవ్యాపారం చేసినవారంతా ఊరు విడిచి వెళ్ళిపోయారు. అందుచేత ఇప్పుడు ఊరి వాళ్ళకు శివనాధుడు తప్ప మరోగతిలేదు. ఈ పరిస్థితిలో  ఊళ్ళో ఉండే రాముడు అనే ఒక యువకుడు రాజుగారి దగ్గిరికి వెళ్ళి, శివనాధుడి మీద ఫిర్యాదు చేస్తూ, శివనాధుడు చాలా పలుకుబడి గలవాడనీ, దర్యాప్తు వీలయినంత రహస్యంగా జరపమనీ వేడుకున్నాడు. రాజుగారి గూఢచారి ఒకడు శివనాధుడి మోసం కనిపెట్టాడు. శివనాధుణ్ణి పట్టి తెప్పించి, న్యాయస్థానంలో నిలబెట్టి  నువ్వు పాలవ్యాపారంలో దారుణమైన కల్తీ చేస్తున్నట్టు రుజువయింది. దీనికి నీ సంజాయిషీ ఏమిటి? అని రాజు అడిగాడు.  నేను చేసిన కల్తీ ఏమిటో సెలవియ్యండి అన్నాడు శివనాధుడు. నువ్వు పాలలో నీళ్ళు కలిపావు అన్నాడు రాజు. నేను పాలలో నీళ్ళు కలపలేదు, నీళ్ళలోనే పాలుకలిపాను. కావలిస్తే తెప్పించి చూడండి. నేను అమ్మే నీళ్ళలో పాల కన్న నీళ్ళే ఎక్కువ  అన్నాడు శివనాధుడు. న్యాయస్థానంలో అందరూ గొల్లుమన్నారు. అది మరింత అక్రమం అన్నాడు రాజు కోపంగా.

నేను నీళ్ళవ్యాపారినే గాని, పాలవ్యాపారిని కాను. మా ఊరిప్రజల ప్రధాన అవసరం నీరు. దాని కోసం ఎంతో డబ్బుఖర్చు పెడుతున్నారు అన్నాడు శివనాధుడు. అతను ఇలా అనగానే ఆ వూరి గ్రామపెద్ద రాజుతో ఆ మాట నిజమే, మహారాజా  శివనాధుడు సామాన్యుడు కాడు. కాలయముడి బారి నుంచి మమ్మల్ని కాపాడిన మహానుభావుడు! అటువంటి వాడు కల్తీ వ్యాపారానికి దిగుతాడంటే నమ్మశక్యం కాదు. మా ఊరి నీటి ఎద్దడి గురించి మీకు తెలిసి రాగలందులకు ఇలాచేశాడని తోస్తుంది అన్నాడు. ఈ మాట విని రాజు మండిపడి, ‘అయితే, ఇంత కాలమూ మీరు ఏం చేస్తున్నారు? నాకు విజ్ఞప్తి ఎందుకు చేసుకోలేదు  అని అడిగాడు. చాలా విజ్ఞాపనలు చేసుకున్నాం. మహారాజా, కాని మీ అధికారులకు ప్రజల నేరాలను విచారించటంలో ఉన్న ఆసక్తి, ప్రజల విన్నపాలను పరిశీలించటంలో లేదు అన్నాడు గ్రామాధికారి. రాజు శివనాధుణ్ణి వెంటనే విడుదల చేసి, అతనికి అభినందనలూ, బహుమతులూ ఇచ్చాడు. తరవాత నది నుంచి, శివనాధుడు ఉండే ఊరి మీదుగా ఒక కాలువ తవ్వించాడు. శివనాధుడి దయవల్లనే తమకు ఆ కాలువ వచ్చిందని ఊరి వాళ్ళంతా అనుకున్నారు. శివనాధుడు కీర్తి ప్రతిష్ఠలతో బాటు కోట్లకొద్దీ ధనం ఆర్జించి, పెళ్ళి చేసుకుని, వక్రమార్గాలు వదిలిపెట్టి, సుఖంగా జీవించాడు.