Facebook Twitter
కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు

కార్తీకమాసం రాగానే సందడే సందడి.  ఒక వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు వనభోజనాల పేరుతో సమారాధనలు. ఇంతకీ వనభోజనాలు కార్తీకమాసంలోనే ఎందుకు చేయాలి. అదికూడా ఉసిరి చెట్టుకిందే అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతారు. ఉసిరి చెట్టును ధాత్రి చెట్టు అంటారు.  క్షమాగుణానికి ప్రతీక అయిన ఉసిరిచెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాం. కార్తీక పౌర్ణమినాడు నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది.

కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం , ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయి. దేశ సంస్కృతి , సంప్రదాయాలను , హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తీక వన భోజనాలుగా పేర్కొంటారు.  భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత. భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి , వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది.

ప్రత్యేకించి ఆదివారాలు , ఇతర సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యాన వనాలలో , తోటల్లో , నదీ ప్రాంతాలు , సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆటలు , పాటలు కబుర్లకు ఇది చక్కటి వేదిక. పిల్లలు , పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు , నృత్యాలు , సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది. ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు , ఇతర స్నేహితులతో - ఓరేయ్ , రేపు మనమందరం వనభోజనానికి వెళుతున్నాం రా ! అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్లకు కొత్తగా వన భోజనం ఎందుకు? ఎందుకంటే వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురకి ఉండే లక్షణం ఏమిటంటే , వాళ్ళు ఉదయం స్నానం చేయరు. సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింటారు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీలలు ఒకటా రెండా..!

అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి.. బ్రహ్మాన్ని అరిగించడం.  అంటే కృష్ణభగవానుడి లీలల్ని ఆస్వాదించటమే వన భోజనం. ఆ వన భోజనంలో ఏ అర మరికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదామ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద , తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని , పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి , అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని , ఆ ప్రకృతి అన్రుగహాన్ని , పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.

ముక్తికే కాదు సమైక్యతకు , చక్కని ఆరోగ్యానికిఇలా చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు , ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం , ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వృక్షాల నీడన అరటి ఆకుల్లో కానీ , పనస ఆకుల్లో కానీ పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద , పురాణాల వచనం.

 ఇక వనభోజనాలు ఉసిరి చెట్టుకిందే ఎందుకు చేయాలన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. సమయం దాటాక తినడం, అతిథికి, బ్రహ్మచారికి పెట్టాకుండా తినడం, బయటనుంచి తీసుకొచ్చి తినడం, నైవేద్యం  పెట్టకుండానే తినడం..ఇలా భోజనాన్ని 9 రకాలుగా విభజిస్తారు. రెగ్యులర్ గా తీసుకనే భోజనాల్లో రెండే రెండు ఆమోదయోగ్యం.. వాటిలో ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా  నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చుని తినడంతో ఆ ఆహారంతో పాటూ శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అందుకే కార్తీకమాసంలో  శ్రీమహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపంగా భావించే  ఉసిరిచెట్టుకింద భోజనం చేయడం వల్ల  ఈ దోషం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం.