Facebook Twitter
ప్రేమ పుస్తకం అమ్మ

అమ్మ కనిపించే దేవతే కాదు. కని, పెంచే దేవత కూడా. అమ్మంటే అంతులేని అనురాగం. మాసిపోని మమకారం. 'గర్భాన్ని ధరించింది మొదలు, తన బిడ్డలు సంపూర్ణ విద్యలతో శోభిల్లేవరకు వారికి సౌశీల్యాన్ని, సంస్కారాన్ని, సుగుణాల్ని బోధించే తల్లి ఎంతో ధన్యురాలు. సృష్టికారకత్వానికి ఆమె చేవ్రాలు!' అని వేదం అమ్మ ఔన్నత్యాన్ని కీర్తించింది. సకల జగత్తూ పురోగమించడానికి, జ్ఞానయుతంగా వర్ధిల్లడానికి మూలకారక శక్తి మాతృమూర్తి.  అందుకే అమ్మను మించిన ధర్మం లేదని ఆదిశంకరులు స్పష్టం చేశారు. 'జనని' అనే మాటే మంత్రపునీతం. జ్ఞానరాత్రి, దివ్య జనయిత్రి, మధుర హృదయనేత్రిగా అమ్మ స్థానం నిరుపమానం.

మాతృమూర్తులు సంతాన నిర్మాతలు. బిడ్డల భాగ్య నిర్ణేతలు, వారి తలరాతల్ని నిర్దేశించే విధాతలు. అన్నిచోట్లా తానే ఉండలేక, దైవం తన బదులు అమ్మలను సృష్టించాడన్నది లోకోక్తి!  అయితే పరమాత్మకన్నా మిన్న అమ్మ.  జీవకోటికి మాతృస్థానమే అసలైన ఆలంబన మోక్ష సాధనా మార్గంలో ఎన్నో సోపానాలున్నాయి. స్వర్గారోహణం చేయాలంటే ఇహంలో ఎంతో పుణ్యకర్మ ఆచరించాలి. ఆ మోక్షం, ఆ స్వర్గం రెండూ అమ్మ పాదాల చెంతనే ఉంటాయి. అమ్మ పాదాల్ని భక్తిశ్రద్ధలతో సేవిస్తూ, బిడ్డలుగా ఆమె మనసు గెలుచుకుంటే చాలు. మనసు స్వర్గమే ఇలపైన వాలు/ నేపథ్యంలోనే "మాతృదేవోభవ" అని వేదం అమ్మకే.. అగ్రతాంబూలం ఇచ్చింది.

అమ్మఒడి బిడ్డలకు ప్రథమ బడి. ఎవరి జీవితాన్నికైనా అమ్మ మార్గదర్శి అమ్మే దారిదీపం, దిక్సూచి తన బిడ్డల మూర్తిమత్వ నిర్మాణంలో అమ్మ కీలక భూమిక పోషిస్తుంది. వారిని ముందు సమాజం బాధ్యతాయుతమైన పౌరులుగా నిలబెట్టడానికి అమ్మ విద్యుక్తంగా కొన్ని ధర్మాలు నిర్వహిస్తుందని ఉపనిషత్తులు, ప్రతిపాదించాయి. అవి ధ్వస్తి, ప్రాప్తి, శక్తి, ప్రశస్తి స్వస్తి ఈ పంచధర్మాల ప్రాతిపదికన అమ్మ తన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. బిడ్డల మనోకాలుష్యాల్ని దూరం చేయడం, వారిని ధర్మమార్గం వైపు పయనింపజేయడం, సర్వసమర్థులుగా వారిని తయారుచేయడం, అందరి అభిమానాన్ని పొందేలా గుణసంపన్నులుగా వారిని తీర్చిదిద్దడం, ప్రతికూల భావాలు, దురలవాట్ల నుంచి. వారిని దూరం చేసి సంపూర్ణ వ్యక్తులుగా ఆవిష్కరించడం.. ఈ అయిదు ప్రక్రియల్ని మాతృమూర్తులు నిర్వహించడం ద్వారా సమాజంలో సర్వదా సౌమనస్య భావాలుపరివ్యాప్తమవుతాయని ఆర్ష ధర్మం ఆకాంక్షించింది. మాతృమూర్తి 'గర్భాలయం'లో అణువుగా, అంకురంగా, చిరుదివ్వెగా ఉపిరి పోసుకుని, నవమాసాలు ఉమ్మనీరు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి శిశువుగా లోకంలోకి బిడ్డ ఆడుగిడుతుంది. అందుకే జననిని లోకపావనిగా పద్మపురాణం కీర్తించింది. అమ్మంటే జీవశక్తిని అందించే ప్రాణవాయువు. జరామరణాలకు అతీతమైన ప్రేమ ఆయువు సతత హరితార్థవంగా శోబిల్లే మాతృనందన వనంలో, తన బిడ్డలందరూ సదా ఆనందాతిరేకాలతో వర్ధిల్లాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది.

కౌసల్యా మాత అందించిన శుభ దీవెనలే ధర్మమార్గం వైపు నడిపిస్తున్నాయని శ్రీరాముడు పలికాదు. దేవకి తేజస్సు యశోదమ్మ యశస్సు తన శక్తియుక్తులకు కారణమని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అనసూయమ్మ అనుగ్రహమే తన అవతార పరమార్ధమని దత్తాత్రేయుడు ప్రవచించాడు. ఈ అన్నింటికీ అమ్మ ఆశీర్వాదమే మూలం! యుగపురుషులకే కాదు, బిడ్డలందరికీ అమ్మ అందించే అనంతమైన ఆలంబన ఆత్మవిశ్వాసం, జీవన గమనంలో పురోగమించడానికి ఉపయుక్తమవుతాయి. బిడ్డల మస్తకాల్ని అమేయమైన చైతన్యంతో నింపే ప్రేమ పుస్తకం-అమ్మ.