Facebook Twitter
ఆధ్యాత్మిక సౌరభం.. కార్తిక మాసం

కార్తీక మాసం వస్తే ఆధ్యాత్మిక సౌరభాలు.. దీపాల సందళ్ళు.. ఆలయ సందర్శనలు.. శివనామ స్మరణలు.. ప్రతి రోజు ప్రత్యేకమే. ప్రతి తిథీ విశిష్టమే! ఆధ్యాత్మికంగా పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభం. తెలుగు మాసాలు..తిథుల లెక్కల ప్రకారం కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజూ ప్రత్యేకమైనదే. ఆధ్యాత్మికంగా విశిష్టతలు సంతరించుకున్నదే. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పుకునే కార్తీకం విష్ణుమూర్తికీ ఇష్టమైన మసమే అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ మాసం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. ఆధ్యాత్మికతను ఇష్టపడని వారికి ఈ మాసంలో భక్త జనకోటి చేసే పూజలు.. అందుకోసం పాటించే విధానాలలో శాస్త్రీయత కనిపిస్తుంది. అవును.. కార్తీక మాసంలో దేవుని మీద నమ్మకంతో చేసే ప్రతి కార్యక్రమం సకల మానవాళికి ఆచరించదగ్గ కార్యక్రమం. దేవుని నమ్మినా.. నమ్మకపోయినా ఈ మాసంలో ఆధ్యాత్మికంగా పాటించే విధి విధానాలలో ఎంతో ప్రయోజనం ఉంటుంది.
సనాతన ధర్మంలో ఆయనములు రెండు ఉన్నాయి. అవి ఉత్తరాయణం.. దక్షిణాయణం. ఉత్తరాయణంలో మాఘ మాసానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో.. దక్షిణాయణంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. ముఖ్యంగా హిందువుల కు (Hindus) ఇది చాలా పవిత్రమైన నెల. ఈ పుణ్య మాసం హరిహరులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం (Karitika Puranam) చెబుతోంది. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం (Fasting) ఆచరించగలిగితే ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఉపవాసం, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే కార్తీకమాసంలో ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. వైకుంఠ వాసుడు పరమశివునికి ఈ మాసం ప్రీతిపాత్రం. ఎన్నో వేల సంవత్సరాలుగా హిందువులు శుభప్రదమైన మాసంగా భావిస్తూ కార్తీక మాసంలో ప్రత్యేక ఉపవాస దీక్షలు చేస్తూ మోక్షం కోసం ఆ పరమేశ్వరుడిని కొలుస్తుంటారు. అయితే హిందువులు సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నా ఇటువంటి విధానాల్లో కొంత ఆరోగ్యం, కొంత శాస్త్రీయత ఉంది. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ‘ఆశుతోషుడు’ అని పేరు. 
విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఆధ్యాత్మికపరంగా ఈ కార్తీక మాసం ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ సోమవారం నాడు ఉపవాసం చేసి, రాత్రి పూట నక్షత్ర దర్శనం చేసి భోజనంతో ముగిస్తారు. తద్వారా ప్రజలకి అష్టఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఏ అవసరాలకు కూడా ఉపయోగించరాదు.
ఈ కార్తీకమాస వారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉన్నది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్తుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల కార్తీకమాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ఉంటుంది. అవి ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో చేసే పూజలు వారిరువురి అనుగ్రహం కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకోవలసినది దీపారాధన. ప్రతి రోజూ రెండు పూటలా దీపాన్ని వెలిగించి భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తారు. దీపాన్ని ఎలా వెలిగించాలి అనే దానిలోనూ నియమాలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు దీపారాధన చేయకూడదు. దానికి పురాణాల్లో ఒక విధానాన్ని నిర్దేశించారు. తెల్లవారుజామునే స్నానాదులు ముగించి సూర్యోదయం కంటే ముందే తులసి కోట ముందు దీపారాధన చేయాలి. ఇలా ఉదయాన్నే ఉంచిన దీపం విష్ణువుకు చెందుతుందని చెబుతారు. అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం తులసి మాతకు చెందుతుందని అంటారు. అసలు దీపారాధన చేసేది విష్ణువు కోసమే. ప్రతి నెలలోనూ విష్ణువుకు ఒక పేరు ఉంటుంది. కార్తీక మాసంలో దామోదరుడుగా పిలుస్తారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రలోకి వెళ్లి, కార్తిక శుద్ధ ఏకాదశినాడు నిద్రలేస్తాడని అంటారు. అందుకే కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి ప్రత్యేకమైనడిగా చెబుతారు. ఇక దీపాల విషయానికి వస్తే కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మలో చేసిన పాపాలూ తొలిగిపోతాయని అంటారు. కార్తీక పౌర్ణిమ రోజు 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తికి దీపారాధన చేసిన ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతారు. దీపం పరబ్రహ్మ స్వరూపంగా చెబుతారు. చీకట్లు పారద్రోలే దీపం..భక్తుల కష్టాలనూ పారద్రోలుతుందని నమ్ముతారు. ఇక ఆలయాల్లో సాయం సంధ్యా సమయంలో ఆకాశాదీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని స్తంభం పై ఎత్తుగా ఉంచుతారు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉన్న ఆకాశదీపం.. శాస్త్రీయంగానూ చాలా ఉపయోగకరం. కార్తీకమాసం వర్షాకాలం వెళ్లిపోయాకా వస్తుంది. వర్షాలతో ప్రకృతి అంతా నీటిలో నానిపోతుంది. అయితే, ఇదే సమయంలో వివిధ రకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వాటిని దీపాలు ఆకర్షిస్తాయి. ఆ దీప కాంతి వేడికి అవి అక్కడే ఆగిపోతాయి. అందుకే దీపాల్ని వెలిగించడం ఉపయోగకరం. ఆకాశదీపం కూడా అదే విధానం.. దైవం చెడునుంచి రక్షించేది అనేగా భావిస్తాం. దీపం కూడా ఆ పని చేస్తుంది. పూర్వం ఆలయాలు దాదాపుగా ఊరికి అటు చివర్ ఇటు చివర ఉండేవి. చిన్న చిన్న ఊళ్లు ఉండేవి. అక్కడి ఆలయాల్లో ఎత్తుగా వెలిగించి ఉంచే దీపం ఊరంతా కాంతిని పంచడమే కాకుండా కీటకాలను అక్కడే ఆకర్షించి ఊళ్లలోకి వెళ్ళకుండా చేస్తాయి.