Facebook Twitter
సంక్రాంతి విశిష్టత ఏంటో తెలుసా?!

సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పంటల పండుగ. పెద్దల పండుగ. పశువుల పండుగ. పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత. గీసుకున్న అద్భుతమైన చిత్రిక. హరితవర్ణపు చీరను కట్టుకుని, బంతి, చేమంతులను జడలో తురుముకుని, రంగవల్లికల రంగుల దారిలో నడిచి వచ్చే సంక్రాంతి దేవతను చూసి మురిసిపోని మనిషి వుండడు. సంబరపడని కర్షకుడు వుండడు. మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! బీడు నేలను దుక్కి దున్ని పంటసిరిగా మార్చిన మానవుడికి ఇదే తొలి పండుగ. అప్పట్నుంచే మనిషి జీవితం బహు ముఖాలుగా, బహు విధాలుగా వికసించింది. అభ్యున్నతి దిశగా అడుగులు వేసింది. దీనంతటికి కారణం సూర్యుడు. సూర్య భగవానుడే మనకు జీవాధారం. సమస్త జీవరాశికి, వృక్షజాతి మనుగడకు ఆయనే కారణం. సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెట్టడాన్ని సంక్రమణం అంటాం. ఏడాదిలో సూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తాడు. ఈ నెలలో ప్రవేశించేది మకర రాశిలోకి. అందుకే ఇది మకర సంక్రాంతి అయ్యింది. పుష్యమాసంలో వచ్చే మకర సంక్రమణం ఉత్తరాయణానికి నాంది. ఇది పుణ్యప్రదం కూడా. అందుకే మకర సంక్రాంతి శుభవేడుకగా మారింది.
సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. వణికించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో ముందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని చెలికత్తెల మధ్య రాజకుమారిలా వస్తుంది. సంక్రాంతి కాంతి నిచ్చే పండగ. అందాల పండగ. ఆనందాల పండగ. పతంగుల పండగ. ముగ్గుల పండగ. గొబ్బెమ్మల పంగడ. హరిదాసుల పండగ. గంగిరెద్దుల పండగ. పాటల పండగ. జానపదాల పండగ. జనపదాల పండగ. సర్వశుభాలను కలిగించే పండుగ. శోభాయమాన పండుగ. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగనాళ్ళలో కనిపిస్తుంటాయి. ప్రళయస్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుండేది. ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణకథనం. వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తి శిరస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఈ రోజునే. మహాభారత యుద్ధంలో కురువృద్ధుడు భీష్ముడు అవసాన దశలో అంపశయ్యపై వుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచివుండి అశువులు విడిచాడట. పుణ్యగతులు మకర సంక్రమణం రోజున సంప్రాప్తిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని పెద్దలంటారు. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్దల పండగ అయ్యింది. పెద్ద పండుగగా మారింది.
సంక్రాంతి పండుగ ఎలా వస్తుందంటే..
ఇక సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాలని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు అ రాశిని మకర సంక్రాంతి అని అంటారు.

సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్ధము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్మాటక సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. పడమరకు అధిపతి వరుణుడు. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము. యోగశాస్త్ర ప్రకారం మన శరీరంలో షట్బక్రములలోని మూలాధారం వద్ద ఏనుగు (ఐరావతము) ఉంటుంది.
మకర సంక్రాంతి విశిష్టత ఇదే
మకర సంక్రాంతి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్చంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనూరాశిలో ప్రవేశించినప్పటికి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెల పొడుగునా వాకిళ్ళ ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఇలా ముగ్గులు పెట్టడం అత్యంత ప్రాచీనమైన సంప్రదాయమే.
పూజాస్థాన విశుద్ధ్యర్ధం దోమయేన పూజయేల్‌ తతః పంచవిదై శ్చూర్జైరంగవల్లీం ప్రకల్పయేత్‌ - స్కాందపురాణం
అంటే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంగా వ్యవహరింపబడుతుంది. అందుకే అతి పవిత్రమైనది. హిందువులు అంతా పెద్దల నుండి పిన్నలవరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో సంక్రాంతి ప్రముఖస్థానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన పుణ్యదినం. భూగోళమందు కర్మాటకరేఖ, భూమధ్యరేఖ, మకరరేఖలు ఉన్నాయి.
సంక్రాంతి విశిష్టత ఏంటంటే?
ఈ సంక్రాంతి ఒంటరిగా మాత్రం రాదు. మహారాణిలా ముందు భోగిని వెనుక కనుకను వెంటబెట్టుకుని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తుందట. 
సంక్రాంతి : ఇది మకర సంక్రాంతి పుణ్యదినం. అందువల్ల ఈ రోజు యధాశక్తి దానధర్మాలు చేయుట వల్ల జన్మజన్మల దారిద్ర్య బాధలు అంటవు.
స్త్రీలు పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మొదలైనవి దానం చేయుటవల్ల సకల సంపదలతో పాటు చకృని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ రోజు పితృదేవతారాధన చేయడం వల్ల వారికి శుభాశీస్సులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని పండితోత్తములు చెబుతూ ఉంటారు. 
కనుమ : రైతన్నలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. వారి బిడ్డలకు ఏలోటు లేకుండా పాడిని అందించే గోమాతను.. వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ధాన్యపురాశులను ఇంటికి చేర్చేవరకు సహాయం చేసే బసవన్నకు పూజలు జరిపి పశువుల పండుగ చేస్తారు. ఈరోజున అందరూ పోటీలు పడుతూ అందమైన ప్రభలు కట్టి వాటిపై పార్వతీపరమేశ్వరుల ప్రతిమలు ఉంచి మేళతాళాలతో వీధులన్నీ తిరుగుతూ అత్యంత వైభవంగా ప్రభలతీర్థం నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నుల పండుగగా ఈ వేడుక నిర్వహిస్తారు.
ముక్కనుమ : భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత నాలుగో రోజు వచ్చే పండుగ ముక్కనుమ. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు గౌరీదేవి వ్రతం చేసుకుంటారు. బొమ్మల కొలువు పెడతారు. ఈ దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలని నిమజ్జనం చేస్తారు.
ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు అందమైన ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో కళకళలాడుతూ సంక్రాంతి లక్ష్మిని అహ్వానిస్తూ ఉంటాయి.
సంక్రాంతి వేడుక నిజంగా కనుల పండుగ. ఈ రోజుల్లో స్త్రీలు తెలవారుజామున లేచి వాకిళ్లలో ముగ్గులు పెడతారు. వాటి చుట్టూ వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. వేకువజామున సాతాని జియ్యర్లు, జంగమదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, గంగిరెద్దుల మేళాలు ఇంటింటికీ వస్తారు. ఆటపాటలతో అలరిస్తారు. దీవెనలందిస్తారు. ఇలా పర్వదినాలన్నీ ఇలా సంబరాల పర్వంలా గడుస్తాయి. తెలంగాణ ప్రాంతంలో నీలాకాశాన్ని పంతంగులు రంగుల హరివిల్లులా మార్చేస్తాయి. కనువిందుచేస్తాయి.
ఈ పండుగకి లక్ష్మీదేవికి సంబంధం వుందని ఒరిస్సా ప్రజల నమ్మకం. ఈ శుభదినాల్లో పేదలకు వరాలిస్తూ ఆమె దళితుల ఇళ్లలోకి ప్రవేశించిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెని వెలివేశాడట. అయినా లక్ష్మిదేవి లెక్కచేయలేదు. ఈ మార్గశిర, పుష్యమాసాల్లో మరింత మంది బీదల ఇళ్లకు వెళ్లి వరాలు కురిపించిందట. అందువల్లనే ఈ మాసాల్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ముంగిలిలోనూ రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఆమె మెత్తని పాదాలు కందిపోకుండా వుండటానికి ఆవుపేడ ముద్దలపై తామరలు, గుమ్మడి పువ్వులు అమరుస్తారు. ఈ మాసంలో గొబ్బి లక్ష్మిని పూజించటం కూడా ఆనవాయితీ. గొబ్బి లక్ష్మి అంటే భూమాతే! ఆమెను కొలిస్తే సస్యాలను ప్రసాదిస్తుందని జనుల విశ్వాసం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథనం. ఒక్కో విధానం. భోగి రోజున ఇళ్లముందు, కూడళ్లలోనూ భోగిమంటలు వేస్తారు. విరిగిన కొయ్యలు, పాత చెక్క సామాన్లు మంటల్లో వేస్తారు. చిన్నారులు భోగిదండలు వేసి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. చలినుంచి తరిమేసి వెచ్చని గాలుల్ని ఆహ్వానిస్తారు. నవ్యతకు నాంది పలకడటానికి ఇది చక్కటి ప్రతీక. భోగి పండుగ నాడు సాయంత్రం చిన్న పిల్లలకు రేగుపళ్లు, చిల్లర నాణాలు, శనగలు, పువ్వులు వంటివన్నీ కలిపి భోగిపళ్లు పోస్తారు. ఈ పళ్లు పిల్లలపై పోస్తే విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని ఓ నమ్మకం. భోగభాగ్యాలను స్వాగతించే ఆకాంక్షకి ఈ వేడుక అద్దంపడుతుంది. ఇంత చక్కని ఆనందాన్ని మనకు అందించే సంక్రాంతి పండుగలు మనం జరుపుకుని మహారాణిలా వచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం....