Facebook Twitter
నిరంతర విద్యార్థులు

ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్ తన సుప్రసిద్ధ నవల ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ను  అది అత్యుత్తమ కాలం, అది మహా చేటుకాలం , అది ఆశల వసంతం (స్ప్రింగ్), అడియాసల శిశిరం (వింటర్),  అనే వాక్యంతో ఆరంభించాడు. ఫ్రెంచి విప్లవం రోజులను దృష్టిలో పెట్టుకొని డికెన్స్ అలా స్పందించాడని అంటారు.

వాస్తవానికి కాలం ఎల్లప్పుడూ లోలకమే. వసంతాలు, శిశిరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మానవ జీవితమూ అంతే. అది ఆశలు, అడియాసల మధ్య ఊయల. కాల స్వరూప, స్వభావాలను అర్థం చేసుకొన్నవారికి జీవితపు ఊయలకు చెందిన రెండు అంచులూ సమంగానే అనిపిస్తాయి. సహజంగానే తోస్తాయి. స్వభావాన్ని కాల ఆకళించుకొంటూ కాలంతో కలిసి నడవడమే మనిషి కర్తవ్యం.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో (ఈ డిజిటల్ యుగంలో) రాబోయే విప్లవాత్మక పరిణామాలను ఎంతో ముందుగా అంచనా వేసిన అమెరికన్ రచయిత- ఆల్విన్ టోఫ్లర్. ఆయన రచించిన 'ఫ్యూచర్ షాక్ (1970), థర్డ్వేవ్(1980) గ్రంథాలు సాహిత్య లోకంలో పెను సంచలనం సృష్టించాయి. టోప్లర్ కు దార్శనికుడన్న గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ రోజుల్లోనే ఆయన చెప్పిన ఓ అద్భుత వాక్యం సుప్రసిద్ధమైనది. '21వ శతాబ్దంలో 'నిరక్షరాస్యుడు' అనే పదానికి అర్థం మారిపోతుంది. కేవలం చదవడమో, రాయడమో తెలియని వ్యక్తికి మాత్రమే ప్రస్తుతం వర్తిస్తున్న ఆ పదం- రాబోయే రోజుల్లో మరింత విస్తృత అర్థాన్నిస్తుంది. దాని నిర్వచనమే మారిపోతుంది. నేర్చుకోనివాడు, నేర్చింది జీర్ణించుకోలేనివాడు, ఎప్పటికప్పుడు కొత్తదాన్ని నేర్చుకోవాలన్న కుతూహలం లేనివాడు- 21వ శతాబ్దం యువతరం దృష్టిలో నిరక్షరాస్యుడు అవుతాడు' అని టోఫ్లర్ నిర్వచించాడు. ఒక యుగసంధిలోనో, మలుపులోనో స్థిరంగా నిలబడి అలా రాబోయే తరాల ఆలోచనలను పట్టుకోవడం దార్శనికతకు చిహ్నం. ఏనాడో 1915లో రాసిన తన 'కాసులు' కవితలో మహాకవి గురజాడ 'మగడు వేల్పు(దేవుడు) అన్నది పాతమాట... ప్రాణమిత్రుడు అతడు నీకు' అన్నాడు. నేటి ఆధునిక మహిళ అంతరంగాన్ని అర్థం చేసుకొన్నవారికి గురజాడ దూరదృష్టి స్పష్టంగా తెలుస్తుంది. నవీన నాగరికతలో వివిధ మాధ్యమాల ద్వారా పోటెత్తుతున్న సమాచార ఉప్పెనలు... నిరంతరం మార్పుచెందుతున్న సైద్ధాంతిక ప్రవాహాలు... అనుక్షణం మారిపోతున్న ఆధునిక జీవన విధానాలు... అతివేగంగా దిగజారుతున్న మానవీయ విలువలు- మనిషిని బలవంతంగా అయోమయంలోకి నెడుతున్నాయి.

ఈ సంక్లిష్ట యుగంలో మరిన్ని ప్రశ్నలకు, సందేహాలకు గురిచేయకుండా, విస్పష్టమైన సమాధానాన్ని అందిస్తూ- కాలగమనాన్ని గురించి సామాన్య మానవుడికి తేటతెల్లం చేయగల దార్శనికులు సమాజానికి అవసరం. వారినే 'వైతాళికులు' అంటారు. వారు చూపించే దివిటీల వెలుగులో ప్రతి మనిషీ కాలగమనాన్ని గుర్తిస్తూ మనుగడలో స్థిరమైన నిలకడను సాధించాలి. అంటే మనమంతా ఆల్విన్ టోఫ్లర్ చెప్పిన అర్ధంలో చక్కని 'అక్షరాస్యులు'గా మారాలి. నిరంతర విద్యార్థులం కావాలి. నేర్చుకోవడం విషయంలో నిర్లక్ష్యాన్ని విడనాడి, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. కాలంతో కలిసి నడవడమంటే అసలైన అర్థం అదే!