నీ 'చరణం' నాదే
posted on Aug 12, 2016
ఒక్క సారిగా కాలమాగినట్లులేదూ..
ఏం జాలమేసావో
కనుల కలయిక ఎంత మధురమో
తెలియడానికి
విరహాల ఉప్పెన ఆగి
సరసాల ఊయలలో
మది ఇంతలా ఊగుతుందా!
ఎక్కడి నువ్వు?
ఎక్కడ నేను!
మిరుమిట్లు గొలిపినట్లు
హృదయాంతరాళంలో ఎదో మెరుపు
మెరిసినట్లు,
ఆద్యంతం నీ ప్రత్యక్షం
నా పరోక్షాన్ని పరిక్షిస్తున్నట్లుంది.
.
.
ఇక కాలానిదేముంది
అదెప్పుడు విందని నా మాట
నీ బాటలోకి నేనొచ్చాక!
నీ చెక్కిళ్లపై
చేరిన నా చేతులకింత కలవరింత?
కావ్యమని ప్రత్యేకంగా రాయాలా?
శ్రావ్యమైన గానమేదో
మౌనరాగమై కనుల వెంట కురుస్తుంటే!
పల్లవి నీవే
చరణం నాదే!
ప్రణయ గేయానికి
నీ 'చరణం' నాదే!!!!
---- Raghu Alla