ఈ లోకం నాకోసం ఏం చేసింది

ఈ లోకం నాకోసం ఏం చేసింది                                                                                                                        శ్రీమతి శారద అశోకవర్ధన్ ఈ లోకం నాకోసం ఏం చేసింది?     నా కోసం ఈ జగం ఏం చేస్తుంది?     కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తుంది!     పొల్లుమాటలు చెప్పి నన్ను మభ్యపెడుతుంది?     కడుపు నిండా తిని తిన్నదరుగక     'బ్రేవు' మని తేనుస్తూ     కాలే కడుపుల కిచ్చే పెద్దల కవితల్లాంటి     కన్నీటి ఉపన్యాసాలు     నా కడుపులో దేవుతూన్న     కల్లోలాన్ని  ఆపగలవా?     పసిబిడ్డలు గుక్కెడు పాలకోసం     గుక్కపట్టి  ఏడుస్తుంటే     కుర్రకుంకలు ఆకలిబాధ కోర్చుకోలేక     చెత్తకుండీలో  గొప్పవాళ్ళు సగంతిని పారేసిన     ఎంగిలాకుల కోసం  కుక్కలతో కుస్తీ పడుతూంటే     ఆ దృశ్యాన్ని పరదేశీయులు వినోదంగా     చిత్రాలు తీస్తుంటే     అది చూడలేక నా గుండెలు     ముక్కలు ముక్కలవుతూంటే     పాలకులు పాడే ప్రగతి జోలపాట     నా సంక్షోభాన్ని  ఆపగలదా?     కట్ట బట్టలేక  నిలువ నీడ లేక     తోటి ఆడపడుచులు కంట తడిపెడుతూంటే     సిగ్గుతో  నా మనసు కుంచించుకు పోతూంటే     చలువ రాతి మేడల్లో వుంటూ     చక్కని కార్లలో  తిరుగుతూ     మానభంగాల గురించి మహా ఇదైపోతూ     కమ్మని ఉపన్యాసాలు దంచే నాయకుల     తియ్యని మాటలు     నా బాధను బాపగలవా?     నా కళ్లల్లో కాంతి రేఖలు నింపలేని వెన్నెలలూ     నా గుండెలో మమత పండించలేని  కోకిలలూ      నా కన్నీటికి కనికరించని తారకలూ     చలించని చలువ రేడూ         నా బాధలను గుర్తించని ఉదయ భానుడూ     నా ఉనికిని లక్ష్యపెట్టని  అవనీ ఆకాశాలూ     మంచూ మబ్బూ కొండా కోనా పంచాభూతాలూ     ఏవైనా సరే నాకెందుకు?     వాటి గొప్పలు వినడమెందుకు?     నా గోడు ఈలోకంలో దేముడికీ ఒద్దేమో?     పలకకుండా  రాయిగా  నిలచిపోయాడు     భగవంతుడు సైతం     భజనలకు లొంగిపోయి భజన పరుల     కబంధ హస్తాలలో ఇరుక్కుపోయాడేమో?     చుట్టూ గుడి కట్టించుకుని కూర్చుండిపోయాడు.     ఇది కాదు ఈనాటి కధ!     ఏనాటి నుంచో  జరుగుతున్న గాధ!     యుగ యుగాల చరిత్ర!     ధనికులు తీరిక వేళల్లో  గానం చేసుకోవడానికి     ఉపకరించే గీతిక!     కలిమికీ లేమికీ మధ్యనున్న వైరం     నానాటికీ పెరుగుతోందేగాని     తరగడం లేదు ఈషణ్మాత్రం!     లేదు ఎన్నటికీ దీనికీ పరిష్కారం!     అందుకే అడుగుతున్నాను గొంతెత్తి     ఈలోకం నాకేమివ్వగలదని?     ఈ జగం నాకేమి చెయ్యగలదని?     ఎగసి పోతాను రెక్కలు కట్టుకుని     ఎగిరిపోతాను చైతన్యాన్ని వెతుక్కుని     ఆకలి నిద్రా క్షుద్బాధలేని లోకంలోకి!     ఈర్ష్యాసూయలు అగుపించని చోటికి     కలిమి లేములు కనిపించని వాడకి     నిత్యం వసంతం తాండవించే నీడకి!     ఆలోకం నా కోసం ఏమీ చెయ్యనక్కరలేదు     నా కోసం ఆ జగం కాస్తంత చోటుంచితే చాలు!     పారిపోవడం కాదు ఈ లోకం నుంచి నా ధ్యేయం     పిరికిగా కానిపించని చోటికి!     ఆ లోకం ఈ భూలోకం కావాలనేదే     నా లక్ష్యం!     అంతవరకూ ఈ ఆకలిపాట     ప్రతిచోటా పాడుతూనే ఉంటాను!     అపర శారదనై ప్రతి కవితలో     ఈ పలుకులు తెలుపుతూనే ఉంటాను!  

సామాన్యుడి స్వగతం!

సామాన్యుడి స్వగతం!                                                                                                                                          - శ్రీమతి శారద అశోకవర్ధన్    నిప్పుని చూస్తే భయంలేదు నాకు నీరుని చూసినా భయంలేదు నాకు నీచత్వపు నీడలన్నా డొంక తిరుగుడు దారులన్నా నీళ్లుకారిపోతాను నిలువునా కంపించి పోతాను! పామంటే భయంలేదు విషమంటేనూ భయంలేదు   పాములా పాలుతాగి పాలుపోసిన చేతినే కాటేసే మనిషంటే గజగజ వొణికి పోతాను తప్పక వారికి ఝడుస్తాను! భాదంటే భయంలేదు చావంటేనూ భయంలేదు అసూయాతో ఉడికిపోతూ ద్వేషంతో రగిలి పోతూ అడుగడుగునా ఛస్తూ అందంగా అభాండాలు వేసిచంపే అల్పులంటే భయపడతాను వారికి ఆమడ దూరంలో వుంటాను కుళ్ళిపోతూన్న సమాజాన్ని చూసి కుమిలి పోతుంటాను కళ్లులేని ఈ లోకాన్ని చూసి కన్నీరు కారుకుంటాను అయితే, మమతలెరిగిన మనసుకీ మనసుతెలిసిన మనసుకీ బానిసనై పోతాను సర్వంమరచి సంతోషంగా బంధానికి నిచ్చెనలు వేస్తాను. ఎందుకో తెలుసా? మనిషి నేను మనసున్న మనిషిని నేను! కానీ, ఆకలి కడుపులోని నరాలను కాల్చేస్తున్నప్పుడు ఆ భాధకి తట్టుకోలేక పసివారు రోడ్డుమీద విసిరి పారేసిన ఎంగిలాకుల్లోని మెతుకులు గతికి తృప్తి పడుతున్నప్పుడు, ఈతి బాధల కోర్వలేక మరి వేరే దారిలేక కాసుకోసం కామాంధుడి కౌగిట్లో కన్నె పిల్లలు నలిగి బలై పోయినప్పుడు అది చూసి నా హృదయం ముక్కలు ముక్కలైనప్పుడు, నింగీ నేలా నీరూ నిప్పూ ఒక్కటై నన్ను ఎదిరించినా అవినీతి, అక్రమం, సమాజం కుళ్లూ, అసూయా అన్నీకలసి నన్ను బెదిరించినా లెక్క జెయ్యక లక్ష్యబెట్టక నిద్రాణమై వున్న మానవత్వాన్ని కొరడాతో కొట్టి మేల్కొలుపుతాను ఉద్రేకంగా ప్రజ్వరిల్లుతూన్న మారణ హోమాల మంటను ' ఉఫ్' మణి ఊపిరితో ఊది చల్లారుస్తాను. నడుంకట్టి ప్రజల భుజం తట్టిలేపి సిసలైన ప్రజాస్వామ్యాన్ని సృష్టిస్తాను. సమతా మమతలను స్థాపిస్తాను. ఎందుకో తెలుసా? మనిషిని నేను మనసున్న మనిషిని నేను! సామాన్య మనిషిని నేను!

ప్రియతమా

ప్రియతమా ప్రియతమా..... నా ప్రణయమా.... వదలకే క్షణమైనా నన్ను నీ ఎడ బాటు భరించలేను నేను నా ప్రాణం నువ్వు నా ఊపిరి నువ్వు నా ఆలోచనా నీతోనే మొదలవుతుంది చూసే కళ్ళకు మనం ఇద్దరం కావచ్చు కానీ నేను ఏనాడో నీలో ఐక్యం అయ్యిపోయాను నువ్వు లేని నేను అసంపూర్ణం.. నిను కలసిన క్షణం నాలో ఎంత ఆనందం కలుగుతుందో నిను విడిచిన క్షణం అంతకు మించిన వేదన కలుగుతుంది నీకు దూరం అయ్యే ప్రతీసారి నా ప్రాణం పోయినట్టవుతుంది మళ్ళీ తిరిగి నిన్ను కలుస్తాననే చిన్ని ఆశే నాకు ఊపిరి పోస్తుంది నాలోని ప్రతీ అణువు నీ జ్ఞాపకాలతో నిండిపోయింది...... మన  మద్య ఈ దూరాన్ని చిరిపి మనల్ని దగ్గర చేసేరోజు కోసం ప్రతీక్షణం ఎదురుచూస్తున్నా                                                                                                                   - ప్రియ

తపస్విని

తపస్విని                                                                                                  శ్రీమతి శారద అశోకవర్ధన్ ఎన్నో పవలు! ఎన్నెన్నో రేలు     నీ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని     ఎదురుచూసి నిదురకాస్తే     నీవేతెంచిన మరుక్షణం     కన్ను కుట్టిన నిద్రాదేవి     వడివడిగా ఒక్క తృటిలో     కసితీరా ఆవరించి     నిన్ను నన్నూ వేరు చేసెను!     ఘనకార్యం సాధించినట్టు     వేణు వెంటనే మాయమాయెను!     గుండెలోని ఊసులెన్నో     గొంతుదాటి వెలికిరాక     కళ్ళలోని కధలన్నీ     కరిగిపోయి చెదిరిపోగా     తెలుపలేని మూగమనసు     గుట్టుగా గుసగుసలు పలికెను.     ఏమని?         సొగకన్నుల నీ చేలికానికి     ఆ వెన్నెల రేడు సయితం     ఎన్నటికి సరికాడని     ఎలాగా?     పులకరించింది వయసు!     అబ్బురంగా అడిగింది మనసు!     దొంగ చాటుగా మబ్బుల మాటున     తార తారతో సరసాలడును ఆరేడు     గుండె దిటవుతో పొంగు వలపుతో     నిన్ను తప్ప వేరెవ్వరినీ చేరడు నీ జతగాడు!     ఇద్దరి మధ్యన పోలిక ఎక్కడ?     నీ ప్రియుడికి నీ వంటేనే మక్కువ!     పగలంతా పలుదారులు తొక్కుతూ     రాతిరి మాత్రం నింగిని నిక్కిన     కలువలరేడు కడు గడసరి వాడు     రేయీ పవలు తేడా తెలియక     పాలూ నీరుగ నీతో కలసిన- కడు     ప్రేమధనుడు నిను వలచిన వాడు!     నెలకొకసారే ఘనముగ వెలిగి     తక్కిన రోజులు తప్పుకు తిరిగే         పిరికివాడు ఆ వెన్నెల రేడు     నిత్యము నీతో నీడగ నిలిచి-ప్రతి        నిముషము నీతోడుగ నడిచే-రస     హృదిగల రమణుడు నీవాడు!     ఇద్దరి మధ్యన పోలిక ఎక్కడ?     నీ ప్రియుడికి నీవంటేనే మక్కువ!     మూగ మనసు మాటలు విని     ఊరడిల్లింది హృదయం     పరవశించింది ప్రతి క్షణం!     ఊగిపోయింది మేను-ఉయ్యాలగా     సాగిపోయింది ప్రేమ జంపాలగా!     మనసు మీటింది మది వీణచేసి     కళ్యాణ రాగం!     విందుచేసి మురిసింది మమతల     పందిరేసి వయసు వింత సోయగం!'     అనిపించింది నాకు ఆ క్షణం     నాకు మాత్రం ఏమి తక్కువ     గుండె నిండా ఎంత మక్కువ     నాకోసం ఎన్నికళ్ళో కలల తేలుతూ     తూలుతూంటే     వలలు పన్ని వగస్తూంటే     నా అడుగులో  అడుగులేసి     నాట్యమని పులకరిస్తే?     నా మాటతో మాట కలిపి అది     గీతమని భ్రమిస్తూంటే     నా నిట్టూర్పుల సెగలు పీల్చి     చలువ వెన్నెల వెల్లువలని మురుస్తూంటే     నా చుట్టూ గిరిగీసుకు కూర్చున్నా     అపర శారద అవతారమని     అభివర్ణించి ఆనందిస్తూంటే?     మౌనిలాగా  మెల్లగా     నవ్వుతోంది నా మనస్సు     నా ప్రియుని ప్రేమానురాగాల     వర ప్రసాదంకోసం  చేస్తోంది తపస్సు!     అందుకు,     వేయి వరుణులు ఒక్కసారి వర్ణించినా     లక్ష పవనాలు ఒక్కసారి ప్రభంజించినా     కోటి మేఘాలు చుట్టూ మూగి     కోటి కోట్ల మెరుపులతో ఉరుములతో     చేయి కలిపి హూంకరించినా     మా ప్రేమ చలించదు     మా మమత నశించదు!     రేపటి ఆశ పురి విప్పుకుని     మయూర నాట్యం చేస్తుంది     రేపటి ఆశ గండు కోయిలలా గొంతెత్తి     మోహన రాగం పాడుతుంది!     ఎందుకో తెలుసా?     ప్రేమ పవిత్రం! ప్రేమ శాశ్వతం!     ప్రేమ అమలినం! ప్రేమ అమరం!     ప్రేమ త్యాగం! ప్రేమే దైవం!

శ్వేతపత్రం మీ హృదయం

శ్వేతపత్రం మీ హృదయం                                                                                                                            శ్రీ శారద అశోకవర్ధన్ పిల్లలంటే దేముళ్ళ     పిల్లలకి లేవు కక్షలూ కార్పణ్యాలు     రకరకాల చెట్లూ చేమలూ,     నలుపు తెలుపు మబ్బులూ మెఱుపులూ     వేర్వేరుగా వున్నా ఒక దానితో ఒకటి     పెనవేసుకు పోయినట్టే     ఆకాశంలో తరల్లాగా     భూలోకంలో నిలిచి వెలిగే     పగటి చుక్కలు మీరు     కిల కిల నవ్వే మీరు     చకచక నడిచే కీలు బొమ్మలు మీరు     చిలుకల మాదిరి     చినచిన పలుకులు     సింగారులు మీరు     తళతళ మెరిసే మేలిమి బంగరు     మేని గల పుత్తడి బొమ్మలు మీరు     అమ్మ చేసిన బొమ్మగా అవతరించి     కల్ల కపటము లెరుగని     సిరిమల్లెలు చిన్నారులు మీరు!     ప్రపంచమనే వనంలో విరబూసిన     విరజాజులు చామంతులు పూబంతులు!     కులమత కుటిలత్వాలు తెలీవు!     కులం మతం కలబోసిన మంటల     మరణహొమాలు తెలీవు!     తెలిసిందల్లా అందరమూ మనుషులమేనని!     అందరికీ మంచి గుణముండాలీ అని!     పసి మనసుల లేత హృదయాలు     స్వచ్చమైన పాల నురుగులాంటి     తెల్ల కాగితాలు!     మనసూ , మమతా,     నీతీ నియమం ఎంచి ఎంచి రాసుకోదగిన     శ్వేత పత్రాలు మీ హృదయాలు!     స్వార్ధమంటే తెలీదు     ద్వేషమన్నా తెలీదు     తెలిసిందల్లా స్నేహంలోని తియ్యదనం     ఆప్యాయతలోని మాధుర్యం!     పాపలూ! మీరు రేపటి పౌరులు!     హృదయమనే ఆ తెల్లని ఫలకం మీద     పసితనంలో రాసుకున్న రాతలనే పదిలంగా దాచుకోండి!     పెరిగే కొద్దీ తుడిపేసి కొత్తరాతలు రాయకండి!     చెమ్మ చెక్కలతో చేతులు కలిపి ఆడుకుంటూన్నట్టే     పుంగిరి వూతలలో చేతులు పట్టుకుని తీరుగుతూన్నట్టే     కలిపి చేతులు విడవకండి!     కలసిన బతులుకు విడదీయకండి!     కలతలు లేని జీవితం     కల కాలం గడపండి!     ఒకే తాటిపై నడవండి     ఒకే భాష ఒకే జాతి     ఒకే నీతి ఒకే రితి     తెలుగు బాలలం మేమంటూ     తెలుగు తనమే మాదంటూ     ప్రపంచమంతా చాటండి     జాతి గౌరవం నిలపండి!

అపురూపం నీ చెలిమి

అపురూపం నీ చెలిమి                                                                                                    R.V.S.S. శ్రీనివాస్ నేస్తం... నీతో స్నేహమంటే... ఏమిటో చెప్పనా?.. అందరిలాగే నాలుగు  అందమైన పదాలు జోడించి  అంత...ఇంత...అంటూ  పోగిడేస్తావ్...అంతేగా! అంటూ పెదవివిరుస్తావు... ఎలా చెప్పేది? ఎప్పటినుంచో  వెదుకుతున్న  ఆత్మీయతల నిధి  ఇప్పటికి దొరికిందని. అనురాగాల సన్నిధి  నేటికి దొరికిందని... భావ సారూప్యం ఉన్న నేస్తం దొరకటం నింగినున్న జాబిలి  ఒక్క సారి దోసిలిలో పడినంత  చల్లని అనుభూతినిస్తుందని  ఇప్పటిదాకా తెలియదు సుమా!... స్నేహం చేయడం  ఎంతో సులువు. అది నిలుపుకోవటం చాలా కష్టమంటూ  వ్రాసిన సూక్తులు ఎందుకో నచ్చావు నాకు. అమలిన స్నేహాన్ని కష్టపడి  వెతుక్కోగలిగితే  ఆ స్నేహం నిలుపుకోవడం  ఎంత సులభమో అనిపిస్తుంది. ఎన్ని గనులు వెదికానో తెలుసా... నాకు కావలసిన  వరాల వజ్రాన్ని పట్టేందుకు. ఎన్ని వనాలుతిరిగానో  నెయ్యాల నేమలీకను  సాధించేందుకు... శుక్లపక్ష పాడ్యమినాడు మసక వెలుతురులా  కనిపిస్తూ...  దినదిన ప్రవర్ధమానమౌతూ  నిండు పున్నమి నాటికి  కోటిదివ్వెల కాంతులతో  వేలతారల వెలుగులా  శ్వేతప్రభలతో వెలిగే  వెండివెన్నెలలా  ఎప్పటికీ వన్నె తగ్గనిదై ఉండాలి  మన స్నేహం. ప్రాతఃకాలపు నీడలా  ఉండకూడదు మన స్నేహం... అపరాహ్నపు ఎండలో...  బిందువు నుంచి క్రమక్రమంగా  పెరుగుతూ మనకంటే ఎత్తుగా ఎదిగి పోతూ  అనంతంగా పెరిగిపోతూ...  నిశీధిలో కలిసి కరిగిపోయే  నీడలా ఉండాలి మన స్నేహం. రెండు స్వార్థపూరితమైన  మనసుల మధ్య స్నేహం  కలకాలం నిలవదు... నీ బాధ నాకన్నీరవ్వాలనే స్వార్థం నాది... నా సంతోషంలో నీ కంట పన్నీరొలకాలనే స్వార్థం నీది... ఇలాంటి స్వార్థాల స్నేహం మాత్రం కలకాలం నిలవాలి సుమా!

అడగాలని వుంది

అడగాలని వుంది                                                                                                               శ్రీమతి శారద అశోకవర్ధన్ సృష్టికర్త ఎప్పుడైనా కనిపిస్తే     ఏమయ్యా బ్రహ్మయ్యా!     నన్నెందుకు మనిషిగా పుట్టించావని     కసితీరా అడగాలనివుంది     ఉసిగొలిపే మనసెందుకు     ఊరకనే ఇచ్చావని నిలదీసి     పోట్లాడాలని వుంది!     మట్టిగా వెసుంటే     తాలిమినీ ఒరిమినీ     నానిండా నింపుకుని     నవదాన్యాలూ పండించి     ఆకలి కడుపుల నింపేదాన్ని     ఆనందాన్ని పొందే దాన్ని!     చెట్టుగా పుట్టుంటే     పచ్చగా ఎదిగెదిగే     పూలూ కాయలూ పూస్తూ కాస్తూ     పదుగురికీ పనికొచ్చే దాన్ని     కల్పవృక్షమై నిలిచేదాన్ని.     రాయీ రప్పగ పడివుంటే     బండగా బతికే దాన్ని     ఎండావానా నీడగ నిలిచేదాన్ని     రచ్చబండనై వెలిగే దాన్ని!     సుత్తినే నేనవుతే     గట్టిగా చేయెత్తి కొట్టి     ఇనుమూ జనుమూ ఏదైనా     నిమిషంలో వంచేదాన్ని     అహర్నిశలూ శ్రమించీ     ' శహభాష్' అనిపించుకునేదాన్ని!     కత్తినే నేనవుతే     కాశిలా లేచొచ్చి     దుష్టశక్తుల నరికే దాన్ని     దుండగాల నా పేదాన్ని     శిష్టరక్షణ చేసే దాన్ని!     పశువుగానైనా పుట్టుంటే     పాలూ పెరుగూ పంచేదాన్ని     గోపాలునీతో జోడీగా     గంగిగోవుగా పూజింపబడే దాన్ని     కనీసం గొడ్డుగావైనా  పుట్టుంటే     హలాన్ని పట్టుకు పొలాన్ని దున్ని     ఫలాన్ని చూసి హర్షించేదాన్ని     పనికొచ్చే పని చేస్తున్నానని తృప్తిపడే దాన్ని!     చివరకు చీమాదోమా     చిలుకా ఎలుకా ఏదైనా సరే పుట్టుంటే     ఈర్ష్యాసూయలు ఏవీ లేక     ఐకమత్యంతో బతికేదాన్ని     సమభావాన్ని పంచేదాన్ని!     అనవసరంగా మనిషిగపుట్టి     మసుకుతోడు మమతలు పెంచి     స్వార్ధం నిండిన ఈ లోకంలో     మనలేక పోతున్నాను     మాధనంతో మసి అవుతున్నాను.     అందుకే సృష్టికర్త ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే     ఏమయ్యా బ్రహ్మయ్యా!     నన్నెందుకు మనిషిగా పుట్టించావని     కసితీరా అడగాలని వుంది         ఉసిగొలిపే మన సెందుకు     ఊరకనే ఇచ్చావని     నిలదీసి పోట్లాడాలని వుంది.

పెరుగుతున్న దూరాలు......

పెరుగుతున్న దూరాలు                                                                                                                             -కనకదుర్గ నీకూ నాకూ మధ్య ఎందుకింత దూరం? చెప్పలేని అగాధాలు మనసులు భారమై మూగపోతున్న భావాలు ఈ మౌనాలు గుండెని పిండేస్తుంటే ఇలా ఎంత దూరం ఈ ప్రయాణం? మనసులు ఒంటరివై దిక్కు తెలియక అల్లాడుతున్నాయి ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? గమ్యం లేని ఈ పయనం ఎందాకా? వేదనావేదనలతో అలసి సొలసిపోతున్న మనసులు సేద తీరేదెలా? ఒకరికొకరుగా, మనసులో మనసుగా మెలగాల్సిన హృదయాలు నేడు మూగవోయి మౌనంగా రోధిస్తున్నాయి. ఎదురెదురుగా వున్నా ఇద్దరిమధ్య చెరపలేని దూరం, ఇలా కృంగిపోతూ, కృశించిపోతూ కుమిలిపోతూ ఎన్నాళిలా? బదులులేని ఈ ప్రశ్నలతో ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచంలో, మనసులోని మాటలు పెదవి దాటి రాని మౌనాలయిపోతూ కలవలేని సుదూరతీరాలకు తీసుకెళ్తుంటే ఏమి చేయలేక ఈ దూరాలని చెరపలేక సతమతమవుతున్న నేటి హై టెక్ జంటే్నా మనది?  

నింగీ నేలా ఏకం చేస్తా

నింగీ నేలా ఏకం చేస్తా శ్రీమతి శారద అశోకవర్ధన్ నది ఒడ్డున నట్టాడుతూ నక్షత్రాలను లెక్కబెడుతూ     ఆకాశంలోని అందాలను ఆస్వాదిస్తూ ఆనందించలేను     అడేనెమలీ పాడేకోయిలా పచ్చనిచెట్టు పశు పక్షిదులా     పసందుగా వున్నా పలకరిస్తూన్నా     ఆ అనుభూతిని నా వరకే పరిమితం చేసుకోలేను     పరవశిస్తూ పలవరిస్తూ ఆ పరిధిలోనే పడివుండలేను.     ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆ దృశ్యాలను చిత్రస్తూ     అక్షరాల మేడలు కట్టి అందంగా రూపులుదిద్ది     కవ్వించే కలలుకంటూ కళ్లుమూసుకు బతకలేను     ఊహల ఊయలలో ఊగిపోలేను!     నదిమధ్యన సుడిగుండాల్లో కొట్టుమిట్టాడుతూ     అహరహం అలలతో కుస్తీ పడుతూ జీవనం సాగిస్తున్న     ప్రాణకోటిలో నేనూ పాలుపంచుకొని నింగినేలా ఏకం చేస్తాను.     సహ జీవనం సాగిస్తున్నానని తృప్తిపడతాను     గాలిలో నీటితో నింగితో నేలతో పోరాడి     జీవనం గడుపుతూన్నందుకు గర్వపడలేను     మొదటిది కోరికలూరించి బబ్బోపెట్టే సుషుప్తి!     రెండోది కోరడాతో కోట్టి లేపి బతుకు బాటను చాటేశక్తి!     నదిఒడ్డున పదిలంగా కూర్చుని     నక్షత్రాలు లెక్కబెడుతూ అక్షరాలతో     అనుభూతులు అల్లుకుంటూ కూర్చోవడం     సుషుప్తి!     అహరహం సుడిగుండంలో కొట్టిమిట్టాడుతూ     జీవనం సాగిస్తున్న ప్రాణకోటిలా బ్రతకడం     మనుగడకి మార్గం చైతన్యానికి నిదర్శనం!     సుషుప్తి జాతికి గొడ్డలి పెట్టు     జాగృతి జాతిని నడిపించే ప్రగతిమెట్టు  

ఆడపిల్ల - అమృతం

ఆడపిల్ల - అమృతం మనోహర   ఆడపిల్లనమ్మా అమృతం  కురిపించే  జాజి కొమ్మనమ్మా విరజాజులలో విరబూసిన వెన్నెలమ్మా స్వచ్చమైన తెల్లదనానికి  రూపం నేనమ్మా ... మనసులలో  ఆనందం  చిలికించే మరువానికి  మరచిపోని  సువాసనలు నాలోనివే  అవి నాలోనివే... ఆడపిల్లనమ్మా అమృతం  కురిపించే  జాజి కొమ్మనమ్మా  ॥ దోబూచులాటలకు, చందమామ దొంగచూపులకు  పులకించే  హృదయము నాదమ్మా... ఆ  హ్రుదయపు  తలపులకి  వయ్యారాలు   నేర్పించేది  నేనమ్మా అది  నేనమ్మా ... ఆడపిల్లనమ్మా అమృతం  కురిపించే  జాజి కొమ్మనమ్మా  || మంచుపల్లకి  కలల రూపమై   ఆ కలలో  రాణినై నేనై పరదాల  జాటున  తలవంచిన చిత్రమే  నాదమ్మా.... ఆడపిల్లనమ్మా అమృతం  కురిపించే  జాజి కొమ్మనమ్మా విరజాజులలో విరబూసిన వెన్నెలమ్మా  ||

మహిలో మహిళ

మహిలో మహిళ శ్రీమతి శారద అశోకవర్ధన్ మహిళలో వుంది 'మహి'శబ్దం     ఆమెతో ఇమిడివుంది పూర్తిజగం !     వన్యమృగము కూడ తన బిడ్డను పెంచుతుంది స్తన్యమిచ్చి     తనలోని సగం బలాన్నందించి కోరుకుంటుంది     తనను మించినది కావాలని!     మనసిచ్చిన మగువ మురిపిస్తుంది వలచినవాణ్ణి     అందిస్తుంది కోటి స్వర్గాల సుఖాన్ని     రాగ రంజితం చేసి అనురాగాలు పండించే భామిని     సృష్టించగలదు ఇలలోనే స్వర్గాన్ని     అబలగా అణిగిమణిగి అందాల ఆనందాలడోలల్లో     తేలిపోయే కోమలి     కౌగలింత జోరుకే కందిపోయే ఉగ్మలి     రగిలించగలదు రుధిత జ్వాలల్ని     దహించి వేయగలదు దావానలంలా     యావద్ ప్రపంచాన్నీ !     ఆగ్రహిస్తే ఆవేశమొస్తే, అవసరమనిపిస్తే     లిపర కాళిలా  అవతారమెత్తి     కదనతొక్కగలదు కత్తి దూయగలదు     దీక్ష్యతో లక్ష్యాన్ని సాధించగలదు.     ఎంతచేసినా ఏం చేసినా     తన వ్యక్తిత్వాన్ని  నిలబెట్టుకునే     స్వాతంత్ర్యాన్ని సంపాదించలేక పోతుంది     పురుషుడిచేతిలో  ఆటబొమ్మలా ఆడింపబడుతోంది.     నాడు కన్యాశుల్కం నేడు వరకట్నం     పేరు ఏదైతేనేమి రెండు తీసెను మహిళ ప్రాబం !     ఈఆట కజ్టాలంటే, అనర్ధాలనాపాలంటే     ఆడవారికే ఆర్ధిక స్వాతంత్యం కావాలనుకున్నారు     అప్పటికి కాని సమస్యలు సమసి పోవనుకున్నారు.     సమసమాజస్థాపన జరగదనుకున్నారు.     ఆ విద్యను అంతంచేసి ఆడవారు     విద్యా ఉద్యోగాలలో  ఉన్నతస్థానాన్ని పొందాలని ఆశిస్తూ     వారిచుట్టూ అల్లుకున్న  ముళ్ళతీగెలను పెకిలించివేసి     విజ్ఞానపు దీపాలు  వెలిగించడానికి పూనుకున్న     ఎందరో మహనీయుల కృఫలం     నేడు మనం కలుసుకున్న  ఈ మందిరం !     ఇది యాభై సంవత్సరాల క్రితం వేసిన పునాది     ఆడజాతికీ అలుముకున్న అంధకారాన్ని     తరిమికొట్టడానికి పలువురునేతలు పనికీననాంది !     ఉన్నవూరు నీ కన్నవారినీ వదిలి     ఒంటరిగా మహిళ ఉండవలసివస్తే     నిలువనీడనిచ్చి 'నేనున్నాలే' అంటూ     నిర్భయంగానిలిచి వెలిగిన కూడలి     ఆంధ్రయువతీ మండలి !     గోల్డెన్ జూబిలీయే కాదు     ఎన్నో ఎన్నెన్నో  శతజయంతులు చేసుకోవాలనీ     మరెన్నో ఇంకెన్నో ఇటువంటి భవనాలు వెలిసి     మహిళాభ్యుదయానికి తోడ్పడాలని ఆశిస్తున్నారు     ఆ పరమేశ్వరుని అర్ధిస్తున్నాను     మరోసారి గుర్తుచేస్తున్నాను     మరువబోకండి ఈ సత్యం     మహిళలోనే వుంది 'మహి' శబ్దం     ఆమెతోనే వుంది పూర్తిజగం !!

ఈ ఉదయం నా హృదయం ఆర్తితో అర్దిస్తోంది!

ఈ ఉదయం నా హృదయం   ఆర్తితో అర్దిస్తోంది! శ్రీమతి శారద అశోకవర్ధన్ ఏ పూర్వపుణ్యమో ఏ జన్మ సుకృతమో     ఈ ఉదయం నా హృదయం పరవశించి పాడుతోంది     ఈ దత్త కుటుంబపు తోటలో నేను సయితం     ఒక పుష్పాన్నై పూచినందుకు     ఈ సుందర సుగంధ సుమ గుచ్చాల నడుమ     విరిసి వికసించినందుకు!     ఈ ఉదయం నా హృదయం     పరవశించి పాడుతోంది!     రకరకాల పూవుల రంగురంగుల్లో పూచి     ఇంధ్ర ధనస్సులా ప్రజ్వరిల్లుతూంటే     కలకలలాడే ఈతోట కన్నుల పండుగచేస్తూ     మురిపించి మైమరపిస్తూ వుంటే     తోటంతా ఇంత అందంగా తీర్చిదిద్ది     నారు పోసి నీరుపోసి పెంచిన - ఆ     ఆనందమూర్తి పాదాల చెంత     రవ్వంత చోటు దొరికితేచాలని     తహతహలాడింది నా హృదయం        అట వెలసిన పరిమళ సుమ కదంబంలో     ఈ గడ్డిపూవుకు తావుంటుందో లేదోనని     గుబులు నిండిన మనస్సుని గుప్పెట్లో పట్టుకుని     దిక్కుతోచక దిగులు పడింది నా హృదయం!     తోటిపూవులు నడుమ కొలువు తీర్చిన     వారి అనుభవాలు వల్లిస్తూ వుంటే - ఆ     అమృతమూర్తి అద్భుత లీలలు వినిపిస్తూ వుంటే     తన్ను తాను మరచి పోయింది     తన్మయత్వంలో తేలిపోయింది నా హృదయం     ఆ కరుణామయని కనులారా తనివిదీర తిలకించాలనీ     ఆ తేజోమయని మనసారా ధ్యానించి జపించి     తపించి తరించి పోవాలనీ     ఉబలాట పడింది ఉవ్విళ్ళూరింది ఊపిరిని బిగబట్టి     ఆ పిలుపు కోసం చెవులు రిక్కపొడుచుకుని     కాచుకు కూర్చుంది నా హృదయం!     గడ్డి పూవుగ బుట్టినా గన్నేరై పూసినా     ఏముందీ గొప్ప తనం     వికసించి వాడి నేల రాలిపోవడమే తప్ప!     ఏ జవ్వని జడలోనో ఏ రసికుని ఒడిలోనో     నలిగి నశించడం తప్ప     విలువేముంది వాటికి     చెప్పుకోను కధ యేముంది?     గాలికెరిగి రాలినా ప్రత్యేకించి కోసినా     ఈ పవిత్రమూర్తి పాదాలపై వాలినప్పుడే     సంతరించుకుంటుంది ప్రత్యేకత     త్పప్తిగా తలెత్తుకు చూస్తుంది స్పష్టినంతా!     అందుకే అర్ధిస్తోంది చేతులు సాచి నా హృదయం     నిత్య నీరాజనాలందుకునే పాదాలపై     నిరంతరం నిలిచిపోవాలని     గగన పుష్పలా మెరుస్తూ!     గంభీరంగా వెలిగి పోవాలనీ     ఆర్తిలో అర్ధింస్తోంది నా హృదయం     ఆశలో నిరీక్షిస్తోంది నా హృదయం!  

అభినవ రాక్షసుడు

అభినవ రాక్షసుడు శ్రీమతి శారద అశోకవర్ధన్ పారపళ్ళు లేవు కోర మీసాల్లేవు     వీరుడసలే కాదు పరమ భీరువు     నోరువిప్పి మాట్లాడలేడు     తీరుగా ఏపనీ చెయ్యలేడు     చెప్పేది ఒకటయితే చేసేది వేరొకటి     చెప్పి చేసేది ఇంకొకటి .     కటువుగా మాట్లాడడు కఠిణంగా అగుపడడు     సుతిమెత్తని తీగెలా మెలికలు తిరిగిపోతాడు     పాదరసంలా దేనికీ అంటక నడిచిపోతాడు     బండరాయికన్నా బలమైన గుండె కలవాడు     బల్లకింద నుంచే బహుకార్యాలు సాధించగలవాడు     కత్తితో అవసరం లేనివాడు కలంతోనే పొడిచి చంపగలిగేవాడు     గాయం కనబడకుండా గట్టి జాగ్రత్తలు తీసుకునేవాడు     ఖాయంగా నానాగడ్డీ కరిచైనా తన స్థానాన్ని నిలుపుకునేవాడు     కక్షబూనితే కాళ్ళబూట్లనే రధచక్రాలుగా వాడికసి తీర్చుకునేవాడు     కిక్కురు మనకుండా నిలుచున్నచోటే నీతులు చెబుతూనే     గోతులు తీసేవాడు     ఎవడయ్యావాడు ఎవడు వాడు?     వాడె ఆధునిక రాక్షసుడు     నేటి మానవుడు.     వాడిని పసిగట్టడం కష్టం వాడి నీడంటేనే భయం     అంతకన్నా     పారపళ్ళూ కోరమీసాలూ వున్న ఆకాలపు     రాక్షసుడే నయం! ఇది ముమ్మాటికీ నిజం!