మీలో ప్రతిబింబిస్తా

మీలో ప్రతిబింబిస్తా   విరిగితే అతుకుపడకున్నా హృదయంలేని ఎన్నో మనసులకన్నా నేనే మిన్న! స్వచ్ఛతకు, సౌకుమార్యానికి నాదే అగ్రతాంబూలం రూపలావణ్యానికి నకలునునేను ఉన్నదున్నట్లు చూపడమే నాకు తెలుసు పలకరించే ప్రతివాళ్ళూ నావాళ్ళే కుడిఎడమల తేడాలే తెలియని నాకు మసిపూయడాలు, మారేడు చేయడాలు అసలే తెలియదు నేరమూలాన్ని పరావర్తనంతో వెలికితీస్తూ చట్టాన్ని జీవింపజేసే న్యాయమూర్తి గుండెగుడిలో కొలువుతీరిన నేను ధర్మదేవతకు నిలువటద్దాన్ని! ప్రేమ మందిరంలో వెలసిన నేను నిత్యమైన, సత్యమైన అనురాగానికి దర్పణాన్ని! తలకట్టుతో రూపురేఖల్ని తీర్చిదిద్దుకున్నట్లే తలపుల సవరింపులతో మనిషి మనీషిగా మారాలనే నేను మీ సౌందర్య నిలయాలలోని సొగసుటద్దాన్ని! మౌనంగా పలకరించే మీ నేస్తాన్ని మీ నవ్వుతో శ్రుతికలిపే స్నేహహస్తాన్ని మిమ్ముల పీడించే కులమత భేదాలు మిమ్ముల వేధించే వర్ణవర్గ భాషాప్రాంత వైషమ్యాలు నన్నేమీ చేయలేవు ఇవేవీ అంటని నాతో చేయి కలిపి మీరూ స్వేచ్ఛా జీవనాన్ని ఆరంభించండి! ఆ నవశకనానికి ఈరోజే తొలిరోజు కావాలని కలలుకంటున్నా నా ప్రతిబింబాన్ని మీలో చూచుకొని మురిసిపోవాలని ఆరాటపడుతున్నా! - మాచవోలు శ్రీధరరావు సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో       

ప్రశ్నించిన ప్రతిబింబం

   ప్రశ్నించిన ప్రతిబింబం  వెలుతురునన్ను తాకినప్పుడల్లా నేను రెండుగా మారుతాను ఒకటినేను మరొకటి నా ప్రతిబింబం నా ప్రతిబింబమంటే నాకు భలే సరదా ఎంతసేపు చూసినా తనవితీరని నా ప్రతిబింబం ఇట్టే కట్టిపడేయాలనుకున్న సమయాన నా బాల్యం నాముందు నాట్యమాడుతుంది తెలియని ఆనందనపు ఊహాలోకాల్లో విహరించినంత ఉత్సాహం స్వర్గమును నా గుప్పిట పట్టుకున్నట్టుగా కొండంత గర్వం ఇలా నా అడుగులను నడకతో జతకట్టే ప్రతీక్షణం నా నీడను చూసి నేను నివ్వెరపోతుంటే నన్ను చూసి ఒకవెర్రి నవ్వు విసిరేసి ఓసారి నన్నిలా ప్రశ్నించింది నాప్రతిబింబం ఓ సహచరీ.. నన్నుచూసి ఆశ్చర్య సముద్రంలో మునిగిపోతే ముందుగతి తెలుసుకోవడం నీతరం కాదు అందుకే... సాగిపో... అవధులులేని తీరాలకు అనంతసన్మార్గ దూరాలకు గతాన్ని తవ్వుతూపోతే మిగిలేది క్షణికానందమే ఇదుగో... నేనుకూడా నీచరణాలకు మోకరిల్లుతున్నాను నన్ను చూస్తూ కాలయాపనకు తావివ్వొద్దు  నీ పురోగమన పాదప్రయోగమే నాకు పరమానందం అనగానే నన్ను నేను స్పర్శను కోల్పోయినంతపనయ్యింది ఆ క్షణమే వెనుదిరిగిన నా చూపును క్రమస్థితిలో వుంచి నా చరణాలను త్యాగధనులు నడిచిన పోరుదారుల అడుగు జాడలవైపు మళ్ళించి నామేధను అలుపెరుగని లక్ష్యసాధనవైపు ఎక్కుపెట్టి సాగిపోతున్నాను - సుప్పని సత్యనారాయణ సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

మనిషికోసం మాట్లాడుదాం!

మనిషికోసం మాట్లాడుదాం! మనిషితనం, మరుగుజ్జు అవుతున్న సంధికాలంలో మనం ఒక్కక్షణం మనిషి కోసం మాట్లాడుదాం! కన్నబిడ్డల్నే కడతేర్చే అడవి నీతి నిత్యకృత్యమై, పరంపరై దినపత్రికల్లోకంపై మంచితనాన్నే మాలిన్యంచేస్తున్న దౌర్భాగ్యపు సందర్భానా... మసకబారుతున్న మనిషికోసం మళ్ళీమళ్ళీ మాట్లాడుదాం! అమ్మకడుపున ఉమ్మనీటి స్వేచ్ఛ విహంగాన్నీ ఆధునికత మాటున నీడను పసిగట్టి పైత్యరసం తలకెక్కి పసిపిందెల్ని చిదిమేస్తున్న పనికిమాలిన మనిషికోసం పదేపదే మాట్లాడుదాం! పారాణి ఆరని పచ్చటి పందిరి ఇంట నవ వధువు మృత్యుఘోషలో విగతజీవి అయితే చావు బాజా గేలినృత్యపు వికటాట్టహాసాన్ని ఆనందించే కట్నపిశాచాలు ఆవరించిన రక్తపిపాసుల కోసం రచ్చరచ్చగా మాట్లాడుదాం! కనురెప్పేకనుపాపనుకాటేస్తున్న వికృతచేష్టలతో విలువల వలువలూడదీస్తూ నడిబజారున దుశ్యాసన పర్వాల్ని సాగిస్తున్న కీచక వంశాంకురాలకోసం నిస్సిగ్గుగానైన మాట్లాడుదాం! గోముఖ వ్యాఘ్రాలు మత కుబుసపు పడగనీడన అదును చూసి కాటేసి పారేనెత్తుటి వరదల్లో నిలువెల్లా స్నానమాడుతూ పైశాచికానందాన్ని పదేపదే కాక్షించే ప్రేతాత్మలు ఆవరించిన రాక్షస మనిషికోసం గొంతెత్తి మాట్లాడుదాం! మనం ఒక్కసారి ''మనీషి''కోసం కూడా మాట్లాడుదాం! జననమరణ మధ్యకాలమంతా మనాదంతా మనిషే కేంద్రీకృతమై రేపటివెలుగుకోసం, వెన్నెలకోసం, మనిషికోసం మహోన్నత స్వప్నంకోసం బంధాల్ని, బంధనాల్ని ప్రేమ మమకారాల్ని చివరకు దేహాన్ని ప్రాణాన్ని తృణప్రాయమంటున్న ఆ మహోన్నత 'మనిషి' కోసం తప్పకుండ మాట్లాడుదాం! మాట్లాడుతూ మాట్లాడుతూ మృగానికి మనిషికీ మధ్య తేడాను వ్యవస్తీకృతం చేద్దాం!   ......వెంకటేష్‌ వలన్‌దాస్‌ సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

పవిత్రబంధం

పవిత్రబంధం జగమెరిగిన బ్రాహ్మణుడికి జందెమేల? - ఇదో ప్రశ్న! జందెం జగాన్ని అర్థం చేయిస్తుంది అర్ధం అర్ధమైతే జీవితం అర్ధమౌతుంది వెన్నుపూసలేని జీవితం, వన్నెచిన్నెలులేని పూసలదారం అనుభవాల పూసలేరుకుంటు జ్ఞాపకాలఏరులో ఈదుకుంటూసాగితే సాగే కాలప్రవాహిలో క్రిమిలా కొట్టుకపోదు జీవనం జీవనం వశమై ఎక్కడికో ఊరేగదు గాలిబుడగలు గ్యాసు బుడగలు మాటల ఊటల బుడుగలు విబిజియారై కాంతులు చిమ్మే చిడుగులు డ్రైనేజికాలువలోని నీటిబుడగలు కొలనులోని తామరాకుపై బుడగలు సబ్బుబుడగలు బోరింగ్‌పైపు నీటిబుడగలు మేఘజలం ధరిణిమాత చల్లని ఒడిని తగిలి చిప్పిల్లే బుడగలు! బుడగలు బుడగలు బుడగలే బుడగలు! అన్నింటినీ అలవోకగా సందర్శనం చేయిస్తుంది జందెం! జందెం ఒక సర్టిఫికెటు - జందెం ఒక మహత్తు మూడుగా, తొమ్మిదిగా వ్రేలాడే చుక్కాని పాంచభౌతికత పేగుకి కంటివెలుగు పంచవెన్నెల రామచిలకకు ముక్తిమార్గం వికసిత కమలం - కుసుమిత భాస్కరం మట్టికడవకు మోక్షమాత అహంభావం తుంచి ఇహపరాన పరభావన తెరతొలగించి నాటకం నడిపే పవిత్ర సూత్రం. ......ఉమ్మెత్తల సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

వెలుగుల రోజు

వెలుగుల రోజు        మనిషికి మనిషికి మధ్య చీకటి తెరలు జారుతున్నాయి ఈవేళ స్నేహపు చిరునవ్వులోనూ విషపుజాడలు ఇపుడు మనుషుల మధ్య సాగే నమ్మకాల జాలు చీకటిమరకలు చీకటి తీగలు తెరలుతెరలుగా, పొరలు పొరలుగా చుట్టుకొని ఉప్పొంగే చీకటి సముద్ర అలలు అయినా చీకటి అలుముకొనే రేయిలో ప్రేమ వెన్నెల వర్షం కురిసి పున్నమి నవ్వుల వెలిగేను వెన్నెలదీపాలు జాతిదేహంపై కుట్రల విషవ్యూహాల్లోనూ చీకటే కొంతమంది చీకటి ఏకాంతగానాన్ని ఆలాపిస్తారు ఈచీకటిని బ్రద్దలు కొట్టేది ఖండించేది వెన్నెల కొడవలి నెలవంకే ఆయుధం చీకటంటే చీకటికాదు సర్పదారుణాలకు దుర్మార్గ జంతుక్రూర చేష్టలకు నిలయమది గుండెనిండా నవ్వేనవ్వులోనూ చీకటే నివాసం వెలుగువెన్నెల జగతినిండా నిండినరోజు లోకమంతా వెన్నెల దీపాలతో కాంతులీనేదే నిజమైన పున్నమి జ్ఞానపు వెలుగులరోజు   సి.హెచ్‌.ఆంజనేయులు సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో  

ప్రేముంది చూశారూ...ప్రేమా...ఆ ప్రేమ...

  ప్రేముంది చూశారూ...ప్రేమా...ఆ ప్రేమ...   ప్రేమ పూస్తూ ఉంది. ప్రపంచం ప్రేమ కోసం పరితపిస్తోంది. కన్నీటి కొలనులో  చేపై ఈదుతూ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాయి కళ్ళు.  మగాడిని  ఇంకా మనిషిగా  ఉంచడంలోనూ, అప్పుడప్పుడు అయోమయంలో పడేయడంలోను ఆమెకు చేతైనట్టు ఇంకెవరికి చేతనవును? ఆమె వల్ల  ఏదైనా సాధ్యమని ఎక్కువగా నమ్మేది ఆ మగాడే. ఆమె ఏది చేసినా ఆ మనసుని కోరుకుంటూనే ఉంది శతాబ్దాలుగా మగ మనసు.... అందుకే ప్రేమలో "ఆది" శివుడిని అధిగమించి నిల్చోడానికి సాహసిస్తున్నారు "ఇప్పటి అర్ధనారీశ్వరులు" దేవుడు ఉన్నట్టు, లేనట్టు చెప్పాలా వద్దా అని తడబడుతున్న పెదవులు రెండూ ఎందుకొచ్చిన గొడవని మౌనంగా ఉండాలన్నా ఉండలేకపోవడం నిజం....ప్రేమ పర్వంలో మాత్రం... మనసులోని మాటను చెప్పడానికి ముందువెనుకలు ఆలోచించినా చూపులతోనైనా వెల్లడిస్తాడు అతను... అందుకే ప్రేమ పర్వంలో తనను మునిగిపోనివ్వడానికి సైతం మగ మనసు  అన్ని విధాలా సిద్ధమైపోతుంది.  అందుకే అంటోంది ఆ మనసు...ఒకవేళ రాసే మనసు మరచినా జీవితంలోని ఆని ఆశ్చర్యాలలోను ఆమె ఉండాలని చూపులు గుర్తు చేస్తూనే ఉంటాయి.... ప్రపంచ సాహిత్యాలన్నీ పీల్చి పిప్పిచేసిన మగ మనసు కిందా మీదా పడిప్రేమను టన్నుల కొద్దీ  రాసేస్తోంది.  మౌనాన్ని వీడి ఆమె చెప్పిన అనేక మాటల్ని సేకరించి దాచుకుంటున్న ఆ మగ మనసు అనుకుంది ఒకరోజు ఇలా... "ఎక్కడో మొదలై ఎక్కడెక్కడో  ప్రయాణించినా  కోరిక  ముగిసే చోటు తెలుసు.... ఎన్ని రకాలుగా  కష్టపడినా యెట్లా బాధను అనుభవించినా  ప్రేమ శ్రీకారం చుట్టే చోటు ఎవరికీ తెలియదు. అందుకే ఆమెకు తెలియకుండా నేనూ,  నాకు తెలియకుండా ఆమె ...ఇద్దరూ ఏదో క్షణాన ప్రేమలో పడిపోతే ఎంత బాగుంటుందని ..? - యామిజాల జగదీశ్

గులాబీలా వికసిస్తుంది

  గులాబీలా వికసిస్తుంది      ఆడదంటే  కస్టాల గూడు అయినా ఆమె సాగుతుంది ముందుకు సాగుతుంది తీరమే తెలియకున్నా ముందుకు సాగుతుంది పడవ గాలికి నిలువ లేకున్నా కన్నీటి ధారలు వర్షపు జల్లులై కనబడనీకున్నా ముందుకు సాగుతుంది|| మగాడు  ముల్లులా గుచ్చుకున్నా గులాబీలా వికసిస్తుంది! గుండెలోన  ముల్ల బాధ అదుముకొని  పువ్వులా ఆనందం పంచుతుంది చూడలేని పాడులోకం చిద్రం చేసినా ముందుకు సాగుతుంది|| తేనె పట్టులాంటి జీవితాన తేనెటీగలేన్ని ముసిరినా అయినా ఆమె సాగుతుంది ముందుకు సాగుతుంది తేనెనే దాచుకొని ముందుకు సాగుతుంది|| పడదోసే పాములెన్ని పైకి ఎగబాకనీకున్నా  అయినా  సాగుతుంది ఆమె ముందుకు సాగుతుంది ఆడదంటే  కస్టాల గూడు అయినా ఆమె సాగుతుంది ముందుకు సాగుతుంది||