తను అమ్మైపోతాడు

తను అమ్మైపోతాడు     సూటిగా కళ్ళల్లోకి చూస్తున్నపుడు పసిపాపలాంటి తన కళ్ళు నవ్వుతాయి భుజాన్ని నాకు అరువిచ్చాక తను నాన్నైపోయి చెంపలు తడుతూ బుజ్జగిస్తాడు చాలా సేపటి నిశ్శబ్ధం తరువాత తన గొంతు ఒక అమృతమవుతుంది ఆ పసినవ్వే మళ్ళీ నాకో పాటవుతుంది ఏమీ తెలియనితనంలోంచి పుట్టిన ప్రేమ అమాయకంగా,ముద్దుగా ఉంటుంది తను ఏడుస్తాడు నాలుగ్గోడల మధ్య కుమిలిపోయే రోదన కాదు అది మనసు గోడలు పెకిలించుకుపోతున్నట్టుండే బాధలో చిన్న ఓదార్పు కోసం తను నవ్వుతాడు ఈ పసితనం ఎప్పటికీ ఇలాగే ఉండాలన్పించేలా నేను వేదన పడ్తున్నపుడు సమస్యంతా తనదైపోతున్నట్టు లాలనగా తను అమ్మైపోతాడు         -సరిత భూపతి

చినుకు

  చినుకు పదా!నేలన రాలే ముత్యాలను ఒడిసిపట్టి నువ్వు నా మీద నేను నీ మీద చిలకరించుకొని కాసేపు పరవశిద్దాం మేఘాలన్నీ ఆనంద భాష్పాలైపోతున్నపుడు నువ్వూ నేనూ నవ్వులై మురిసిపోవటానికి ముందు మట్టిగీతం ఒకటి వినిపించిందా? మిన్నునైనా లాలిస్తే.. మన్ను ఒడిలో పాపైపోదూ! కప్పు కాఫీ ముద్దుల్లో కరిగిపోతున్నపుడుman లీలగా బీథోవెన్ సింఫనీ .. మనసు గదులను కట్టిపడేస్తున్నపుడు కళ్ళల్లో మెరిసిన మెరుపు మరి ఆ ఆర్ధ్రత మేనుదో.. మిన్నుదో! రెండూ ఒకేలా మురిసిపోతూ ఉంటే కళ్ళెదుట మెదిలిన నీ రూపానికి మళ్ళీ మనసు మోహనరాగంలో పడి మునకలేస్తూ అనకుండా ఉండగలదా పెన్నాళ్ళ వెన్నాయి నాన్ నీతాన్ మీట్టూ ఎన్నేన రాగన్గళ్ నీతాన్ కాట్టూ ( ఈ వీణ మీటేది నీవేనంటా .. నా తలపు..నా వలపు నీదేనంటా)   -సరిత భూపతి

పూర్ణమదం పూర్ణమిదం

  పూర్ణమదం పూర్ణమిదం శూన్యం నుంచే పుట్టి శూన్యంలోనే కలిసిపోయే మస్తిష్కమొక్కటి రెండు గాజుకళ్ళేసుకొని లోకాన్ని వెతుకుతుంటుంది శూన్యంలో ఏముంటుందని దాన్ని అడగ్గలవా? అనంత జగత్తు నిండి ఉన్నది శూన్యంలోనే అని ఎప్పటికో స్ఫురిస్తుంది దానికి కటిక రాత్రుల నల్లటి నిశ్శబ్దాలనోసారి అడుగు ఇంత ఏమీలేనితనాన్ని గుడ్డిగా మోస్తున్నదెందుకని మరో ఉదయంలో ఇగిరిపోయి శూన్యమవటానికే అనదూ! చిగురుటాకుల రెక్కలు పండి నిర్ధాక్షిణ్యంగా రాలిపడిపోతూ ఎందుకింకా నవ్వు నీకిపుడు ఇంకేం మిగిలిందన్నపుడు శూన్యంలో పుట్టే మరో వసంతం మరో శూన్యంలోకి తీస్కెళ్తున్నంత కాలం ఈ నవ్వు చెదరదనే చెప్తుంది ఏది ఎక్కడ మొదలైనా ఏది ఎక్కడ అంతమైనా ఉన్నదొక్కటే శూన్యం పూర్ణమదం పూర్ణమిదం -సరిత భూపతి

వద్దు ఏదీ వద్దు...

  వద్దు ఏదీ వద్దు... నాకేదీ వద్దు.. ఏ బాధ్యతా వద్దు.. ఏ బంధమూ వద్దు అవసరాణుగుణంగా మీరు పంచే ప్రేమా వద్దు. బాధ్యత పేరుతో మాకిచ్చే విలువా వద్దు సంస్కృతి,ఆచార,వ్యవహారాల పేరుతో మాపై చూపే నమ్మకమూ వద్దు ఏదీ వద్దు బాబోయ్... మాకేదీ వద్దు.. నన్ను నన్నుగా బ్రతకనీయని ఏదీ వద్దు నేను నాలా ఉండలేనప్పుడు నాకెందుకీ సంబంధబాంధవ్యాలు. రెక్కలున్నా ఎగరలేము పరిగెట్టాలనున్నా కనీసం నడవలేము మనసారా నవ్వాలనున్నా మాపై పెట్టిన గౌరవభావ భారానికి నవ్వలేము గగనతలాన్ని కనుచూపుమేర చూస్తూ కలలు కందామన్నా... తల ఎత్తలేని బాధ్యతల్లో మునిగి-మునిగి పోతుంటాము. పుట్టింది మొదలు ఇలా ఉండాలి.. అది చేయకూడదు.. ఇదే సరే..అది వద్దు.. వాడు మగాడు..నువ్ ఆడపిల్లవి నీకెందుకే వాడితో పంతం.. ఒక ఇంటికి పోవలసిందానివేగా "ఆడ"పిల్లా అని ఊరకనే అనలా.. ఎప్పటికయినా పరాయిదానివే.. వినీ వినీ వద్దన్నా కాదన్నా మాకు మేమే పరయి వారమవుతాం.. పెళ్ళి చేస్తారు అత్తింట్లో మొదలు .. "ఆడ"పిల్ల" "ఆడ"పిల్లే.. "ఈడ"పిల్లవుతుందా.. అమ్మాయ్ అంటూనే మరో "అమ్మ" తనూ ఆడదనే విషయం మరచిన మరో "ఆడపిల్ల. మారాలీ మారాలీ అని అనుకుంటాము గానీ.. మనలో మనం తొంగి చూసుకుంటే మార్పు ఎక్కడ రావాలన్నది మనకి తెలుస్తుంది. జీవితమంతా అయిపోతుంది. కానీ.. "ఆడాపిల్లో "ఈడ"పిల్లో మాత్రం ఎవ్వరికీ ఎప్పటికీ తెలియదు అన్నింటా తానై ఉంటూ నడిపించే ఆడదానికి తానేడ పిల్లో మాత్రం తెలియదు.   - సంధ్యా తులసి  

వాన కురిస్తే...

వాన కురిస్తే... చిన్న చిన్న చినుకులలో తడుస్తూ వెళ్ళిపోయిన బాల్యాన్ని బాల్యంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ ఎగిరే ఊహలకు కాస్త కళ్ళెం వేస్తే ఎంత బావుంటుందో... కాసేపలా నిలబడి కురిసే వానలో తడుస్తూ..వేసారిపోయిన జీవితాన్నీ- ఎండిపోయి అడుగంటుతున్న మానవత్వాన్ని తడిచెమ్మతో నిద్దురలేపితే ఎంత బావుంటుందో.. అడ్డుపెట్టుకున్న అహంకారాన్ని కాదని పోయిన నిన్నలను,మొన్నలనూ వద్దనుకున్న విచారాలనూ.. వాన నీటితో కడిగేసుకుంటే ఎంత బావుంటుందో.. చిందులేస్తూ పసి బాల్యపు ముగ్దత్వపు పరిమళాలని అనుభవిస్తూ ప్రేమలు,అప్యాయతలు నింపుకుని మరోసారి మనుషులమయితే ఎంత బావుంటుందో.   - సంధ్యాతులసి

ఎన్నెన్ని కబుర్లో లేఖల లోకంలో

ఎన్నెన్ని కబుర్లో లేఖల లోకంలో     ఉత్తర ప్రత్యుత్తరాల కాలం పోయిందేనాడో!! ఎప్పుడయినా పాత పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు పేజీల మధ్యన దాచిన ఉత్తరం కంటపడితే అదో అబ్బురం.. అలా ఓసారి తడిమి చదివిందే అయినా మరో మారు చదివి జాగ్రత్తగా దాచుకుంటాం!! ఎంతయినా ఒకప్పుడు దూరాలను కరిగించి అనుబంధాలను దగ్గర చేసినవి ఈ ఉత్తరాలే.. కుశల మడిగిన కార్డులా గుంభనపు ఇన్ లాండ్ కవరులా తరువాత వచ్చి చేరిన పలకరింతలు పులకరింపులయ్యేలా గ్రీటింగ్ కార్డులు.. మనసుదోచిన జవరాలికో ప్రణయ లేఖ మానస వీరునికి ప్రేమ లేఖ మనసెరిగిన మారాణికి మానస లేఖ దూరతీరాల కొలువు తీరిన మారాజుకి సుఖదుఃఖ్ఖాల పరామర్శ లేఖ కన్నవారిని కుశలమడిగే లేఖ వీడిన నేస్తాల పలకింపుల లేఖ కొత్తగా పరిచయమైన కలంస్నేహంతో పరిచయ లేఖ పెండ్లికి శుభ లేఖతో చావుకి కార్డుతో .. ఎన్నెన్ని కబుర్లో లేఖల లోకంలో లోకాలే మరచి మునిగి చదివిన గురుతులెన్నో వైభవం ఆనాడు కనుమరుగైపోయె నేడు...- సంధ్యాతులసి     - సంధ్యా తులసి