అభిలాష
posted on Nov 15, 2024
అభిలాష!!
అఖిల తారలు
నీ పదపద్మములనుజేరి
అమితానురక్తితో కొల్చుటజూచి
పూటపూటనా ఇలాగ
మినుకుమినుకుమని మెరుస్తుంటి!
విశాలాకాశానున్న నక్షత్రమండలాన
నేటికిలా చుక్కనై ఉదయించితి
ఇన్నాళ్లూ ప్రవేశం నిషేదించితివి
తగననా నీ పవిత్ర పాదపూజకు?
తూర్పుదిశను దొరికించుకొని
ఆకాశానికి మిక్కిలి శ్రమతో ప్రాకిప్రాకి
పశ్చిమసంద్రంలో పడిమునిగి
మరలమరల ఉదయాస్తమయాల
చట్రంలో తిరగుతున్నా, ఇంతేనా బ్రతుకు?
భవసాగరమును తప్పుకొనుటకు
తగిన ఉపాయం దొరకదా
ఊరట కలగదా నీకిష్టమైతే
నీ చల్లని చూపు సోకితే మాత!
తారలందరూ నడిచిన త్రోవలను
వారు చేసిన ఆరాధనల తీరునిజూచి
అనునిత్యం నీ సేవలో తరించాలని
తత్తరపడుతున్న పసితారకను!
ఆత్మపీఠమందు సదా నిన్నుంచి
నిష్ఠతో సర్వదా అర్చించదలచితినే
నా ఆశ పేరాసనకుమమ్మా
నను కరుణించి బ్రోవుమమ్మా
నువ్వు తప్ప నాకెవ్వరే దిక్కమ్మా?
ఓ నిఖిలజననీ ఆదిశక్తీ పరాశక్తీ!!
- రవి కిషొర్ పెంట్రాల