మధురాంతకం రాజారాం

మధురాంతకం రాజారాం   - డా.ఎ.రవీంద్రబాబు        రాయలసీమ కథారత్నం మధురాంతకం రాజారాం. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజల భాషకు పట్టం కట్టిన రచయిత. కథల్లో ఓ జీవితానికి సరిపడా వైవిధ్యాన్ని నింపిన ఘనుడు. ఎక్కడా ఊహలకు, అతీతాలకు, అవాస్తవాలకు పోకుండా నేలబారు తీరుగా కథలను రచించిన వాస్తవికవాది. 300లకు పైగా కథలు రాసినా దేని ప్రత్యేకత దానిదే. పోలీకలేని మానవులే మనకు దర్శనమిస్తారు. తెలుగులో మలితరం కథా రచనలో రాజారం గారిదొక భిన్నమైన స్వరం.       మధురాంతకం రాజారాం చిత్తూరు జిల్లాలోని మొగరాల (రమణయ్యగారి పల్లె) గ్రామంలో అక్టోబరు 5, 1930లో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. ఆ వృత్తిలో ఉండటం వల్లే రాజారాం కు పల్లెలతో, గ్రామీణ జీవితాలతో, వారి మధ్య ఉన్న సంబంధాలతో పరియం ఏర్పడింది. ఆ నేపథ్యం నుంచే వీరు కథా వస్తువును ఎన్నుకున్నారు. అధ్బతుమైన శిల్పంతో కథలు రచించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయని రచనా మార్గాన్ని స్వీకరించారు. నాగేంద్ర, దత్తాత్రేయ లాంటి కలం పేర్లతో కూడా రచనలు చేశారు. మధురాంతకం రాజారాం కథలు మాత్రమే కాదు రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, వ్యాసాలు కూడా రాశారు. తమిళ రచనల్ని అనువదించారు. వీరి కథలు తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదాలయ్యాయి. రాజారాం రచించిన 'చిన్నప్రపంచం - సిరివాడ' నవల రష్యన్ భాషలోకి అనువాదమైంది.          వీరి కథలు పలు సంపుటాలుగా వెలువడ్డాయి.  1. వర్షించిన మేఘం (7 కథలు)      2. ప్రాణదాత (5 కథలు)  3. కారణభూతుడు (2 కథలు)        4. కళ్యాణకింకిణి (11 కథలు)  5. పునర్నవం (10 కథలు)           6. తాము వెలిగించిన దీపాలు (8కథలు)  7. వక్రగతలు ఇతరాలు(7 కథలు)     8. వగపేటిక... (6 కథలు) 9. మధురాంతకం రాజారాం కథలు (40 కథలు) 10. మధురాంతకం రాజారాం కథలు (22 కథలు) 11. పాంథశాల ( 23 కథలు)       12. జీవితానికి నిర్వచనం (29 కథలు) 13. కూనలమ్మ కోన (4 కథలు)     నేడు వీరి కథలు మొత్తం నాలుగు సంపుటాలుగా లభిస్తున్నాయి.           ' కథకి వస్తువుగా ఓ వ్యక్తి జీవితాన్ని మధిస్తే ఓ కథ పుట్టొచ్చు' అన్న మధురాంతకం రాజారాం అదే సత్యాన్ని ఆచరించి కథలు రాశారు. అందుకే అవి భిన్నంగా ఉంటాయి.         సర్కసు డేరా కథ- సర్కసు ఫీట్లకంటే ప్రమాదకరమైన ఫీట్లు బయట బతుకుకోసం చేస్తున్నారని చెప్తుంది.         ఎడారి కోయిల కథలో తండ్రి విదేశాలలో స్థిరపడినా కొడుకు గ్రామీణ వాతావరణాన్ని వెతుక్కుంటూ వస్తాడు.         పులిపైన స్వారీ కథ జాతకాలను నమ్మి సినీ నిర్మాత మోసపోవడాన్ని వివరిస్తుంది.         ఓటుకత కథలో ఒక్కసారి కూడా ఓటు వేయలేని పశువుల గంగప్ప గురించి చెప్తుంది.         కొండారెడ్డి కూతురు కథలో తులసి భర్తను చంపడానికి వచ్చిన మనుషులకు అన్నం పెట్టి, రక్షణ కల్పించి, వాళ్లను మనసులను మారుస్తుంది.           అందుకే రాజారాం కథలు తిట్టవు, అతి తెలివిని ప్రదర్శించవు, సందేశాలు ఇవ్వవు, కంటతడిపెట్టిస్తాయి. చదివేవారి గుండెలను బరువెక్కిస్తాయి. స్వచ్ఛంగా, అచ్చంగా, మన చుట్టూ ఉన్న జీవన స్రవంతినే మనకు చూపెడతాయి. పంచదార గుళికల్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఆ సారం మనలో ఇంకిపోయి మనసుకు హాయిని కలిగిస్తాయి. పలు రకాల మనుషులు, భిన్న మనస్తత్వాలు, గ్రామీణ జీవితాలు, మధ్యతరగతి మానవులు, సగటు మనిషి సమస్యలు... ఇవీ వీరు కథల అంతఃచిత్రం.        అసలు వీరి కథలు చదువుతుంటే ఆరుబయట నానమ్మో, అమ్మమ్మో ఒడిలో కూర్చోబెట్టుకుని కథ చెప్పినట్లు ఉంటుంది. ఆకట్టుకునే శైలి, శ్లేషతో కూడిన వాక్యాలు, సన్నని నవ్వుతో జీవితసారాన్ని మాటల్లో కూర్చినట్లు తోస్తుంది. పెద్ద బాలశిక్షలా జీవిత జ్ఞానాన్ని బోధిస్తాయి. వీరి కథల్లో స్త్రీ పాత్రలకు ప్రత్యేకత ఉంది. అవి ఆటపట్టిస్తాయి. చిరుకోపంతో అలుగుతాయి, ఒక్కోసారి మురిపిస్తాయి. ప్రేమాభిమానాల్ని పంచుతాయి, అవసరమైతే సుతిమెత్తగా మందలిస్తాయి. మనతోపాటు సహజీవనం చేస్తాయి. అత్యంత సహజంగా, స్వచ్ఛంగా ప్రవర్తిస్తాయి. మొత్తం మీద అనుబంధాలతో అల్లుకపోతాయి. అందుకే అవి ఎక్కడో ఒకచోట మనతో తారసపడినట్లే ఉంటాయి.          మధురాంతకం రాజారాం కథలు తీపి, వగరు, కారం, పులుపు కలబోసిన ఉగాది పచ్చడి లాంటివి. రాయసీమ గ్రామీణ నేపథ్యం నుండి పుట్టిన కథల్లో ' బీగాలు, ఈసిళ్లు, యిర్లవాడు, తబిళ్ల, బిన్నె, దేవళం, పులుసన్నం... ...' లాంటి చిత్తూరు జిల్లా పదాలు సహజ సుందరంగా కనిపిస్తాయి. ' తీసుకో తీసుకో' అని కుర్రవాడిని వూరించి, వాడు దగ్గరకి వచ్చేలోపుగానే మనం దాచిపెట్టుకునే తినుబండారంలా అంతలో మృత్యుదేవత చిక్కి బిక్కరించబోయి ఇంతలో దూరంగా వెళ్లి వెక్కిరించడమేనా మానవ జీవితం...' అంటాడు మధురాంతకం రాజారాం జీవితానికి మృత్యువుకు ఉన్న సంబంధాన్ని నిర్వచిస్తూ...  రాజారాం ఏప్రిల్ 1, 1999లో చనిపోయారు. కథా రచయితగా ఎన్నో ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. 1968లో ' తాను వెలిగించిన దీపాలు' కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. 1991లో గోపీచంద్ సాహితీ సత్కారం 1993లో ' రాజారాం కథల' కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1994లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు   1996లో అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ వారి బహుమతి వీరిని వరించాయి.    వీరి స్మృతికి నివాళిగా ' కథాకోకిల' పేరిట కథా విమర్శలో, కథా రచనలో ప్రముఖులకు ప్రతి ఏడాది అవార్డులు ఇస్తున్నారు. వీరి కథల నిండా ఎన్నో పాత్రలు, వాటి వైవిధ్య స్వభావాలు, భిన్నత్వాలు, సంక్లిష్టతలు... అందుకే వీరి కథలు ప్రతి ఇంట్లో, గ్రంథాలయంలో తప్పక ఉండాల్సిన అవసరం ఉంది. 

మేఘాపహరణం

   మేఘాపహరణం (కథ)                                          - మాలతీచందూర్                                                 మాలతీ చందూర్ పలు పత్రికలలో కాలమిస్ట్ గా పనిచేశారు. నూజివీడులో జన్మించి మద్రాసు నగరంలో స్థిరపడినా తెలుగు భాషకు, సాహిత్యానికి దూరం కాలేదు. పైగా అపారమైన సేవ చేశారు. ఆంధ్రప్రభ పత్రికలో వీరు సుదీర్ఘకాలం రాసిన 'ప్రమదావనం' గిన్నీసు రికార్డుకెక్కింది. 400ల ఆంగ్ల నవలల్ని తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిని ఘనత కూడా మాలతీ చందూర్ గారిదే.        మాలతీ చెందూర్ ఎన్ని రచనలు చేసినా వారికి కథా రచయిత్రిగా మంచి పేరు ఉంది. 150 కథలు పైగా రాశారు. వీరి కథలు ప్రకృతి, మానవ సంబంధాలు, ప్రపంచీకరణ... ఇలా పలు అంశాలును వివరణాత్మకంగా, ఆసక్తిగా, హాస్యంగా వివరిస్తాయి. మాలతీ చందూర్ రాసిన 'మేఘాపహరణం' కథ మనిషి ప్రకృతిని నాశనం చేయడం వల్ల కలిగే అనర్థాలను అర్థవంతంగా తెలియజేస్తుంది.         'మేఘాపహరణం' కథ 'ఆ వూర్లో వర్షపు చుక్కపడి మూడేళ్లయింది' అని మొదలవుతుంది. తర్వాత రచయిత్రి వర్షాలు పడటానికి ఆ వూరి ప్రజలు ఏం చేశారో చెప్తారు. 'కప్పలకి పెళ్లిళ్లు చేయడం, విద్వాంసుడు ఆపకుండా ఫిడేలు వాయించడం' ఇలాంటివి ఎన్నో చేస్తారు. కానీ వరుణదేవుడు కరుణించడు. కొంతమంది వలసలు వెళ్లిపోతారు. ఒకరోజు ఆకాశంలో నల్లటి మేఘాలు కనిపిస్తాయి. వర్షం పడుతుందని అందరూ ఆశపడతారు. ఆ నల్లటి మేఘాలలో విమానాలు కూడా తిరుగుతుంటాయి. మేఘాలు వచ్చినా వర్షం ఎందుకు పడటం లేదో..,!? విమానాలు ఎందుకు తిరుగుతున్నాయో...!? ఎవరికీ అర్థం కాదు.       వయసుకొచ్చిన ఆడపిల్లలు పరిమళ, రేఖ ఆ విమానాల్లోంచి తమకోసం రాకుమారుడు లాంటి పెళ్లికొడుకు దిగివస్తాడని కలలు కూడా కంటారు. ఈ తతంగం మొత్తం ఆ వూర్లోనే ఉంటున్న అడ్వకేటు సాంబమూర్తికి కూడా బోధపడదు. పైగా ఆవూరు రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. చివరకు రహస్యాన్ని బావమరిది ద్వారా తెలుసుకుంటాడు. 'పక్కరాష్ట్రం వాళ్లు క్లౌడ్ సీడింగ్ చేసి బలవంతాన వర్షాలు కురింపించుకుంటున్నార'ని. అంతే... వెంటనే చలపతిరావు 'స్వరాష్ట్రంలో మబ్బుల్ని పొరుగు రాష్ట్రం తమవైపుగా  తర్లించుకుపోయి, దొంగతనంగా తమ రాష్ట్రంలో వర్షం కురిపించుకుంటున్నార'ని పొరుగు రాష్ట్రం మీద దావా వేస్తాడు.        అనేక తర్జనభర్జనల తర్వాత కేసు సుప్రిింకోర్టుకు వెళ్తుంది. 'ఆకాశ మండలంలోని, సూర్యచంద్రులు, నక్షత్ర మండలం, గాలి, మబ్బులూ ఇవి సర్వ మానవాళికీ చెందుతాయి ... ... కానీ పొరుగు రాష్ట్రం మబ్బుల్ని తరలించి వాటిపై కార్బన్ డయాక్సైడ్ క్రిస్టల్ చల్లి, వర్షం కురిపించారు.  అది చల్లడానికి రోజూ విమానాలను పంపారు. అందువల్ల పొరుగు రాష్ట్రం చేసింది తప్పు' అని కేసు రుజువు అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పేటప్పుడు మబ్బుల్ని కూడా దొంగలించే పరిస్థితికి మానవుడు ఎందుకు చేరుకున్నాడు... ఎలా దిగజారి పోయాడు... అని జడ్జీలు ఆలోచన చేసి తీర్పు ఇస్తారు.           'ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో చెట్లు నాటి, వాటిని పెంచి వృద్ధి పరచగల బాధ్యత నేరం చేసిన రాష్ట్రంపైన ఉంచుతున్నాం.' అంటారు.         ఈ కథ ఒకప్పుడు ప్రభుత్వం కుత్రిమంగా వర్షాలు కురిపించడానికి చేసిన ప్రయత్నం పై చురక. మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని, చెట్లను, నదులను...లాంటి సహజవనరులను నాశనం చేస్తే చివరకు ఏమౌతుందో...? మాలతీ చందూర్ పరిష్కారంతో సహా వివరించారు. అందమైన వాక్యనిర్మాణం, సహజంగా సాగిపోయే శైలి. కథా నిర్మాణానికి సంబంధించి ప్రారంభానికి, ముగింపుకు సంబంధం. పాత్రల భావోద్వేగాలు... అన్నీ ఈ కథను గొప్పకథగా తెలుగు కథానికా సాహిత్యంలో నిలిపాయి అనడంలో ఏమాత్రం అనుమానం లేదు.                                                        డా.ఎ. రవీంద్రబాబు

సురవరం ప్రతాపరెడ్డి

     సురవరం ప్రతాపరెడ్డి                                                           డా.ఎ. రవీంద్రబాబు       తెలంగాణలో రాజకీయ, సాంఘిక, సాహిత్య చైతన్యానికి సురవరం ప్రతాపరెడ్డిని ఆద్యుడిగా భావించాలి. సాహిత్యాన్ని, చరిత్రను, రాజకీయాలను, సామాజిక చైతన్యాన్ని కలగలిపి ఒక్కచేత్తో వాటికోసం ఉద్యమించిన తెలంగాణ వైతాళికుడు. బహుభాషా వేత్త. మొక్కవోని ధైర్యంతో ఆనాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా తెలుగుభాష, సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన సాహసి. తెలంగాణలో సాంస్కృతిక వికాశానికి బాటలు వేసిన మార్గదర్శి. రచయిత, సంపాదకుడు, పరిశోధకుడు అంతేకాదు అసామాన్య ప్రజ్ఞావంతుడు.      సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివాడు. ఆ తర్వాత తిరువాన్ కూరులో బి.ఎల్. పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఉర్దూ, ఆంగ్లం, తెలుగు, పారశీ, హిందీ, సంస్కృతం భాషల్లో పాండిత్యాన్ని సంపాదించాడు.       ఆనాటి నిజాం పాలనలో ఉర్దూరాజ్య భాష. ఎక్కడో ఒకటోరెండో తెలుగు పత్రికలు మాత్రమే వచ్చేవి. అది గమనించి 1926లో 'గోలకొండ' పత్రికను స్థాపించారు. 1947 వరకు దాని బాధ్యతను నిర్వహించారు. తన సంపాదకత్వాలతో నిజాం దురాగతాలను నేరుగా ప్రశ్నించాడు. అనేక సవాళ్లను సూటిగా ఎదుర్కొన్నాడు. తెలంగాణలో తెలుగు భాష వికాసం చెందేలా పత్రికను తీర్చిదిద్దారు. తెలంగాణలో కవులు లేరన్న ముండబ వెంకట రాగవాచార్యుల ప్రశ్నకు సమాధానంగా 1934లో 354 మంది కవులతో 'గోలకొండ కవుల చరిత్ర'ను ప్రకటించాడు. అంతేకాదు 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర', 'హిందువుల పండుగలు', 'హైందవ ధర్మవీరులు', 'గ్రంథాలయోద్యమం' లాంటి చరిత్ర, సంస్కృతిని విశ్లేషించే రచనలూ చేశాడు. 'భక్తతుకారాం', 'ఉచ్చల విషాదము' అనే నాటకాలు కూడా రాశాడు.           ముఖ్యంగా భావకుడైన ప్రతాపరెడ్డి వీటితోపాటు కవితలు, కథలు, వ్యాసాలు కూడా రాశాడు. 'రామాయణ కాలంనాటి విశేషాలు' వీరి మరో ముఖ్యమైన రచన. ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలంనాటి సామాజిక పరిస్థితులకు దర్పనం. అసలు తెలంగాణలో తెలుగ కథ సురవరం తోనే వికాశదశకు చేరుకుందని చెప్పాలి. ప్రతాపరెడ్డి  1930 నుంచి కథలు రాశారు. వీరు మొత్తం 25 కథలు రాస్తే ప్రస్తుతం 21 కథలు మాత్రమే లభిస్తున్నాయి. వీటిని 1987లో ఆంధ్రసారస్వత పరహిషత్ వాళ్లు పుస్తక రూపంలో తెచ్చారు.           ఈ కథల్లో రెండు భాగాలున్నాయి. 11 కథలు 'మొగలాయి కథలు' మిగిలిన 9 కథలు 'సురవరం కథలు'. 'మొగలాయి కథలు' తెలంగాణ మొగలాయిల పాలనలో ఉన్నప్పుడు నుంచి వ్యాప్తిలో ఉన్నవి. వీటిలో 'గ్యారా కద్దూ బారా కొత్వాల్', 'రంభ' లాంటివి ముఖ్యమైనవి. 'రంభ' కథలో బీజాపూర్ సుల్తాను అదిల్షా రంభ అనే స్త్రీని ప్రేమిస్తాడు. కానీ చెప్పుడు మాటలు విని ఆమె శీలాన్ని శంకిస్తాడు. కిటికిలోంచి దూకమంటాడు. ఆమె భవనం కిటికీలోంచి దూకుతుంది. అయినా బతుకుతుంది. కానీ అవమానాన్ని బరించలేక కత్తితో పొడుచుని చనిపోతుంది. ఈ మొగలాయి కథల్లో ముఖ్యంగా అధికారుల లంచగొండితనం, క్రౌర్యం, ప్రజలను పీడించడం, దుష్టపాలన, ప్రజల నిస్సహాయత, అమాయకత్వాలే ఎక్కువగా కనిపిస్తాయి.           'సురవరం కథల'లో ఎక్కువ స్త్రీల జీవితాల్లోని ఆటుపోటులను చిత్రించినవే. స్త్రీలను నమ్మించి వేశ్యాగృహాలకు అమ్మడం, బాల్యవివాహాలు, మత మార్పిడులు, స్త్రీ  ఉద్దరణ లాంటివే ఈ కథల్లో కనిపిస్తాయి. 'నిరీక్షణ' కథలో ప్రేమించిన యువకుడు పెళ్లికి ముందు సముద్రంలో వేటకు వెళ్తాడు. ప్రియురాలు మాత్రం చేపల కూర వండుకుని ఆచారం ప్రకారం సముద్రపు ఒడ్డున ఎదురు చూసి చూసి చనిపోతుంది. 'హాసన్ బీ' కథలో కామాక్షి దొంగ స్వాముల్ని నమ్మి మోసపోతుంది. ఓ సాహెబును వివాహం చేసుకుంటుంది. పేరును హసన్ బీగా మార్చుకుని సంతోషంగా జీవిస్తుంది. 'మెహ్దీబేగం' కథలో జబ్బారు ప్రేమించిన వ్యక్తితో పారిపోతుంది, కానీ అన్నలు తెచ్చి ఇంట్లో బంధీని చేస్తారు. చివరకు వేశ్యగా మిగిలిపోతుంది. ఇలా ఈ కథలన్నీ నిజాం కాలం నాటి స్త్రీల బాధలను సమాజంలోని వారి స్థితిగతులను తెలియజేసేవే. 'సంఘాల పంతులు' కథ శిల్పం దృష్ట్యా అద్భుతమైంది.           కొన్ని కథల్లో సురవరం ప్రతాపరెడ్డి పాత్రల వేషభాషలు చిత్రీస్తే, మరికొన్ని కథల్లో వాటి ఆంతరంగిక సంఘర్షణల్నీ రాశాడు. ఇవి పేజీలకొద్దీ ఉండవు. చిన్నచిన్న కథలు. సరళమైన భాషలో సాగిపోతాయి. ప్రతాపరెడ్డి అవసరం కొద్ది అప్పడు వ్యాప్తిలో ఉన్న ఉర్దూ పదాలను కథలలో వాడారు. నౌకరీ, మస్తు, ఖాళీ, జిమ్మా, ఖజానా వంటివి మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడక్కడా తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన పలుకుబడులు కూడా కనిపిస్తాయి, అందుకే వీరి కథల్లో వాడిన భాష తెలంగాణ ప్రామాణిక భాషగా చెప్పొచ్చు.         సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో గ్రంథాలయోద్యమంలో  ప్రముఖపాత్ర వహించాడు. 1942లో జరిగిన ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు ఆధ్యక్షత వహించాడు. 1951లో 'ప్రజావాణి' పత్రికను స్థాపించాడు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆగస్టు 25, 1953లో మరణించాడు.         ఆయన మరణించిన తర్వాత 1955లో వీరి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి సాహిత్య, సామాజిక సేవకు గాను హైదరాబాదు ట్యాంక్ బండిపై వీరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

స్త్రీ విద్య

స్త్రీ విద్య                                            - భండారు అచ్చమాంబ         సుమారు వంద సంవత్సరాలకు పూర్వం స్త్రీ చదువే ఇతివృత్తంగా వచ్చిన కథ 'స్త్రీ విద్య'. చాలాకాలం వరకు తెలుగు కథాసాహిత్యంలో ఇదే తొలికథ అనికూడా భావించారు. ఈ కథ డిసెంబర్ 1902లో 'హిందూసుందరి' పత్రికలో ముద్రితమైంది. రచయిత్రి భండారు అచ్చమాంబ. స్త్రీల చదువుకోసం తపించిన మనీషి. మహిళలకు చదువు వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో సవివరంగా వందేళ్ల క్రితమే ఈ కథలో చర్చించింది రచయిత్రి అచ్చమాంబ.        ఈ కథ అప్పటి కాలమాన పరిస్థితులకు అద్దంపడుతుంది. భర్త పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. అప్పటికే వివాహం అయి ఉంటుంది. ఇంటికి వచ్చి భార్యతో కొన్ని రోేజులు గడిపి, పరీక్షలు ఉండటంతో మళ్లీ పట్నానికి బయలుదేరుతాడు.        అప్పుడు భార్య 'రేపు ఉండి ఎల్లుండి వెళ్లు' అంటుంది.        'నేను రేపు వెళ్లాల్సిన అవసరం ఉంది.' అంటాడు భర్త. అందుకు భార్య 'నీవు వెళ్లగానే నీ క్షేమసమాచారాలు తెలియజేయి' అని అడుగుతుంది. అందుకు 'భర్త నేను రాసిన ఉత్తరం ఎలా చదువుకుంటావు?' అని అడుగుతాడు. భార్య 'మా తమ్ముడితో చదివించుకుంటాను' అని చెప్తుంది.  అప్పడు వాళ్లిద్దరి మధ్య స్త్రీ విద్యకు సంబంధించిన చర్చ ప్రారంభమవుతుంది.         'చదువుకున్న వాళ్ల భర్త ఆయుష్షును హరిస్తారని శాస్త్రాల్లో ఉందట మా నాయనమ్మ చెప్పింది. అంతేకాదు ఇరుగుపొరుగు వాళ్లు నవ్వుకుంటారు. అసలు చదువుకోవడం వల్ల నాకు ఏమి లాభం' అని అడుగుతుంది. అందుకు భర్త 'అవన్నీ మూఢనమ్మకాలు, చదువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది'. అని చదువు అంటే ఏమిటి... జ్ఞానం అంటే ఏమిటి... చదువు వల్ల జ్ఞానం ఎలా వస్తుంది అనే విషయాన్ని సవివరంగా వివరిస్తాడు       'అక్షరాలు రాయడం, చదవడం నేర్చుకున్నంతలో మనుషులు విద్యావంతులు కాలేరు. చాలామంది రాసిన ఉద్గ్రాంథాలను చదివి వాటి తాత్పర్యాలను జీర్ణించుకున్న వారే విద్యావంతులని పిలుచుకుంటారు. ఇట్లాంటి విద్యవల్ల బుద్ధి వికసిస్తుంది. అనేక మంచి పుస్తకాల్లోని అమూల్యమైన ఉపదేశ వాక్యాలు మనసులో నాటుకుని మనుషులను ఉదాత్తవంతులుగా మారుస్తాయి. వాళ్లలోని చెడుపోయి ఆ స్థానాన్ని మంచి ఆక్రమిస్తుంది. ప్రపంచ జ్ఞానం పొందటానికి వాళ్లు అర్హులవుతారు. కొన్ని పుస్తకాలు చదవటం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. దీని వల్ల సంసారంలోని అనేక దుఃఖాలను కాసేపు మరిచిపోతారు.'       ఇద్దరి మధ్యా పలురకాలుగా చర్చ జరిగిన తర్వాత భార్య భర్తమాట వింటుంది. చదువుకోడానికి అంగీకరిస్తుంది. 'చదువుకుంటాను. మీకు ఉత్తరాలు రాస్తాను. మిమ్మల్ని సంతోషపెడ్తాను' అని మాట ఇస్తుంది.       రచయిత్రి కథను అంతటితో ముగించదు. భర్త భార్య చదువకున్న తర్వాత తన కాపురం ఎలా ఉండబోతుందో కలలు కంటాడు. ఈ కలల్లో రచయిత్రి అచ్చమాంబ విద్యావంతురాలైన స్త్రీ ఉన్న కుటుంబాలు ఎలా ఉంటాయో రాసింది. వీటిని అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యానే అర్థం చేసుకోవాలి. మొదటి కల- భార్య భర్తకు లేఖ రాయడం        మొదట భయంతో సిగ్గుతో, అక్షరాలు సరీగా కుదరక వంకరటింకరగా రాస్తుంది. అది నచ్చక మళ్లీ మరో కాగితం తీసుకుని రాస్తుంది. చివరకు విసుగొచ్చి అదే లేఖని టపాలో వేస్తుంది. రెండో కల- భార్య భర్తకు వ్యాసం చదివి వినిపించడం       భర్త పడక కుర్చీలో కూర్చొని ఉంటే... భార్య పక్కనే కుర్చీలో కూర్చొని పత్రికలో అచ్చయిన వ్యాసాన్ని చదివి వినిపిస్తుంది. భర్త ఆనందం పొందుతాడు. మూడో కల- భార్య పిల్లలకు చదువు చెప్పడం      భార్య ప్రేమతో కొడుకు, కూతుర్ని దగ్గర కూర్చోపెట్టుకుని విద్యాబుద్ధులు చెప్తుంది. వీరి పిల్లలను చూసి మిగిలిన వాళ్లు మెచ్చుకుంటారు.      ఇక కథలో చివరకు భార్య అయిదు నెలల తర్వాత మీకు ఉత్తరం రాయడం మొదలు పెడతాను. అని మాట ఇస్తుంది. దీపావళి పండుగకు భర్త ఇంటికి వస్తానని చెప్పడంతో కథ ముగుస్తుంది.       ఇక శైలి, శిల్పం, భాష విషయానికి వస్తే... కథ గ్రాంథికభాషలో సాగుతుంది.     'ఇఁక నేను మిమ్ముల నుండమని యననుగాని మీరు పోయినది మొదలు మూడునాలుగు దినములకొకసారి తప్పక క్షేమముఁ దెలుపుటకానను మఱువకుండుటకు వేడెదను. తమ కుశలవార్త తెలియకుండిననిట నా కెంత మాత్రమును దోఁచదు'       కథ మొత్తం సంభాషణాత్మక రూపంలో ఉంది. ఇది మహత్తరమైన శిల్పం. చాలా కష్టమైన శిల్పం కూడా. కేవలం పాత్రల మాటల ద్వారా వారి మనోభావాలనే కాకుండా కథా నేపథ్యాన్ని, వాతావరణాన్ని సృష్టించాలి. ఇలాంటి శిల్పం కత్తిమీద సాము. కథమొత్తం ఏకబిగిన చదవిస్తుంది. వారిద్దరి సంభాషణ ఆసక్తికరంగా రాశారు అచ్చమాంబ. వీరి శైలి గ్రాంథికభాష అయినా చదువరిలో విసుగు పుట్టదు.       ఇప్పటికీ చదువుకు దూరమవుతున్న స్త్రీలు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లకే కాదు, ఛాందస బావాలతో అత్యాధునిక యుగంలో కూడా స్త్రీ చదువును అడ్డంకుంటున్న వారికి ఈ కథ ఓ గుణపాఠం.                                                        - ఢా.ఎ.రవీంద్రబాబు

త్రిపురనేని గోపీచంద్

   త్రిపురనేని గోపీచంద్   డా.ఎ. రవీంద్రబాబు      తెలుగు సాహిత్యానికి సమున్నతమైన నవలను అందించాడు గోపీచంద్. ఆధునిక కథ, నవలాసాహిత్యంలో చిరస్థాయిగా మిగిలిపోయే రచనలు చేశాడు. జీవితంలో అనేక సిద్ధాంతాలతో వాదులాడి... వాటిని తన అభిప్రాయాలకు అనుభవాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. తండ్రి నుంచి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా, ఎక్కడా ఆ ప్రభావం తన రచనలపై పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఇలాంటి అమూల్యమైన కథ, నవలాకారుడు త్రిపురనేని గోపీచంద్.        గోపీచంద్ సెప్టెంబరు 8, 1910 కృష్ణాజిల్లా అంగలూరులో జన్మించాడు. తండ్రి ప్రముఖ హేతువాద నాయకుడు, సంఘసంస్కర్త, రచయిత త్రిపురనేని రామస్వామి. తల్లి పున్నమాంబ. గోపీచంద్ బి.ఎ. చదివాడు. ఆ తర్వాత లా పూర్తి చేశాడు. న్యాయవాద వృత్తిని కొంతకాలం చేపట్టాడు. బి.ఎ. చదువుకునే టప్పుడు 1932లో శకుంతలను వివాహం చేసుకున్నాడు.       గోపీచంద్ జీవితంపై అనేక సిద్ధాంతాలు, వాదాల ప్రభావం ఉంది. తన తండ్రిద్వారా 'ఎందుకు?' అని ప్రశ్నించడాన్ని అలవాటు చేసుకున్నాడు. అలా మొదట హేతువాదంతో ఏకీభవించాడు. తర్వాత కమ్యూనిజంపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ ప్రభావంతో చాలా రచనలు చేశాడు. రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఈ కాలంలోనే పత్రికల్లో రాజకీయ కథలు, వ్యాసాలూ రాశాడు. చివరకు అరవిందుని పట్ల విశ్వాసంతో ఆధ్యాత్మిక భావాలవైపు మొగ్గు చూపాడు.        గోపీచంద్ వ్యక్తిగత, ఉద్యోగ జీవితం కూడా వైవిధ్యంగానే కనపడుతుంది. న్యాయవాద వృత్తిని వదిలేశాక, చలన చిత్రరంగంలో ప్రవేశించాడు. నిర్మాతగా, దర్శకునిగా కొన్ని చిత్రాలు నిర్మించాడు. 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టరుగా, 1956లో ఆధ్రప్రదేశ్ సమాచారశాఖకు సహాయక డైరెక్టరుగా కూడా పనిచేశాడు. 1957-62లలో  ఆకాశవాణిలో పనిచేశాడు. అయితే గోపీచంద్ మొదటి నుంచి చివరి వరకు ఏ రంగంలో ఉన్నా సాహితీ రచనను మాత్రం వదలుకోలేదు. కాలేజ్ లో చదువుకునే రోజుల్లో తండ్రి రాసిన 'శంభుక వధ' నచ్చి దానిపై కాలేజ్ మ్యాగజేన్ కు వ్యాసం రాశారు.       వీరి రచనలను మూడు భాగాలుగా చూడవచ్చు 1. నవలలు 2. కథలు 3. తాత్విక, సామాజిక రచనలు      నవలల విషయానికి వస్తే- అసమర్థని జీవయాత్ర, గడియపడని తలుపులు, చీకటి గదులు, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా, పరివర్తన, యమపాశం, శిథిలాలయం వంటి నవలలు రాశారు. అయితే వీటిలో గోపీచంద్ కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన నవల 'అసమర్థుని జీవయాత్ర'. తెలుగులోనే మొదటి వైజ్ఞానికి నవల ఇది. గోపీచంద్ ఈ నవలను 'ఎందుకు?' అని ప్ర శ్నించడం నేర్పిన తండ్రికి అంకితం ఇచ్చాడు. ఇక 'పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా' నవలకు 1963లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.        కథల విషయానికి వస్తే- 'భార్యల్లోనే ఉంది', 'దేశం ఏమయ్యేటట్లు' లాంటి కథా సంపుటాలు వెలువరించారు. 'ధర్మవడ్డీ' లాంటి ఎన్నో అమూల్య కథారత్నాలను అందించాడు. వీరి కథల్లో సామాజాకి, తాత్విక కోణాలు కనిపిస్తాయి. పాత్రలు కూడా ఆయా నేపథ్యాలకు ప్రాధాన్యాన్ని వహించేవిగా ఉంటాయి. కథల్లో వ్యగ్యం, ఆలోచన సమపాల్లలో కనిపిస్తాయి. చమత్కారం, నాటకీకరణ, చక్కటి భాషతో వీరి శైలే ప్రత్యేకంగా ఉంటుంది. ఎం.ఎన్. రాయ్ ప్రభావంతో తెలుగులో మొదటగా రాజకీయ కథలకు శ్రీకారం చుట్టారు. 'కార్యశూరుడు' కథ పేదల గురించి, శ్రామికోద్యమం గురించి చెప్తుంది. 'పిత్రార్జితం' కథ సొంత ఆస్తిని నిరసిస్తుంది. 'మన కవి' కథ ప్రేయసి గురించి భావకవిత్వం అల్లే వారిని హేళన చేస్తుంది. 'సరే కానివ్వండి' కథ విప్లవాన్ని సమర్థిస్తుంది. 'పరివర్తన' కథ మనిషికి ఉండాల్సిన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుంది. 'గోడమీద మూడోవాడు' కథ హిందూముస్లీముల మధ్య ఐక్యతను కోరుకుంటుంది. 'ఒక వెంకటాచలం' కథ చలం పాత్రను విమర్శకు పెడుతుంది. 'నేనూ - భూతం' కథ సినిమా వాళ్లలోని నీతిరాహిత్యాన్ని వెక్కిరిస్తుంది.        ఇలా కథల్లో విభిన్నతను చాటాడు గోపీచంద్. ప్రపంచ సాహిత్యాన్ని, తాత్విక సిద్ధాంతాల్ని అధ్యయనం చేసినా, ఆ జ్ఞానాన్ని తన కథల్లో, నవలల్లో శిల్పం దెబ్బతినకుండా ప్రవేశపెట్టాడు. వీరి కథల్లో చెప్పదలచుకున్న అంశానికి అనుగుణంగానే పాత్రలు, కథ ప్రారంభం, ముగింపు ఉంటాయి.         సామాజిక, తాత్విక రచనలు- పోస్టుచేయని ఉత్తరాలు, తత్త్వవేత్తలు, మాకూ ఉన్నాయి స్వగతాలు.       ఇక సినిమాలు- చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు, పేరంటాలు, గృహప్రవేశం, రైతుబిడ్డ, సినిమాలకు పనిచేశారు.    తన రచనల గురించి గోపీచంద్ చెప్తూ 'జీవితంలో నాకు ఒక ప్రత్యేక పద్ధతి లేనట్టు నా కథా రచనకూ లేనట్టనిపిస్తుంది. కొన్నింటిని నేనే సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి వ్రాస్తే మరికొన్నింటికి సంభాషణలకు ప్రాధాన్యమిచ్చి చిత్రించాను.మరికొన్నింటిని మనస్తత్వము, వాతావరణము, ప్రధానముగా రూపొందించాను. అన్నింటి ప్రభావము నాపై కలదు.' అన్నాడు.        హేతువాదం నుంచి హ్యూమనిజం... తర్వాత మతవాదంలోకి వచ్చినా కథకుడిగా గోపీచంద్ మార్గం మాత్రం ఉదాత్తమైనదే...      'నాకు జీవితం పై ఆశైతే వుందిగాని, తెలివిగా బతకడం చేతకాదు. అందుచేత బంధం మీద బంధం చుట్టుకుంటూ వెళ్తుంటాను. చివరికి ఊపిరి సల్పని స్థాయిలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఎవరో ఒకరు వీపుమీద ఫెళ్లున చరుస్తారు.తుళ్లిపడి లేస్తాను. ఒళ్లు విదుల్చుకుంటాను. ఈ విదిలింపే నా పుస్తకాలు'. అని తన రచనలను పరిచయం చేస్తాడు గోపీచంద్.    నవలాకారుడు, కథకుడు, తాత్వికుడు, నాటకకర్త, హేతువాది అయిన గోపీచంద్ నవంబర్ 2, 1962న మరణించాడు. ఆయన శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం సెప్టెంబరు8, 2011లో తపాళబిళ్లను విడుదల చేసింది.       'జ్ఞానం కత్తిలాంటిది. ఉపయోగించుకోగల శక్తి ఉంటే ఆత్మరక్షణ చేస్తుంది. దుర్వినియోగం చేసుకుంటే ఆత్మహత్యకు అక్కరకు వస్తుంది' అని జ్ఞాన పరమార్థాన్ని ఈ ప్రపంచానికి అందించిన గొప్ప తాత్వికుడు, రచయిత త్రిపురనేని గోపీచంద్. 

గొల్లపూడి మారుతీరావు

    గొల్లపూడి మారుతీరావు                                                        డా.ఎ. రవీంద్రబాబు           గొల్లపూడి మారుతీరావు పరిచయం అక్కర్లేని ప్రజ్ఞావంతుడు. రచయిత, నటుడు, కథకుడు, నాటక రచయిత, నవలాకారుడు, రేడియోప్రయోక్త, సాహితీవేత్త... ఇలా బహుముఖీనం ఆయన ప్రతిభ. సినిమాలకు కూడా మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ నెట్ పేపర్లలో కాలమిస్టుగా పనిచేస్తున్నారు. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాత కూడా...         మారుతీరావు  ఎప్రిల్ 14, 1939న అప్పటి మద్రాసు ప్రావిన్సీలో ఉన్న విజయనగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎస్సీ ఆనర్సు పూర్తిచేశారు. ఆ తర్వాత పలు పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికకు ఉప సంచాలకునిగా, 1960లో చిత్తూరు ఎడిషన్ కు సంపాదక మండిలిలో ఒకడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాదు, విజయవాడలలో ఆకాశవాణికి ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా, ఆ తర్వాత సంబల్ పూర్, చెన్నై, కడపలలో రేడియో కార్యనిర్వహన అధికారిగా పనిచేశారు. 1981లో కడప కేంద్రం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ పొందారు.          1961 నవంబరు 11న శివకామసుందరిని వివాహం చేసుకున్నాడు. చిన్నతనం నుంచి ఎక్కువగా పుస్తకాలు చదవడం అలవాటున్న మారుతీరావు 14ఏళ్లకే  రచనలు చేయడం ప్రారంభించాడు. ప్రారంభ రోజుల్లో కవిత్వం ఎక్కువగా రాశాడు. అవి 'మారుతీయం' పేరుతో ఆ కవిత్వం పుస్తకంగా కూడా వచ్చింది. వీరి మొదటి కథ 'ఆశాజీవి' ప్రొద్దుటూరులోని స్థానిక పత్రిక 'రేనాడు'లో ప్రచురింపబడింది. కథా రచన నుండి నాటకాలపై మనసు మళ్లడంతో నాటకాలు రాయడం, ప్రదర్శించడం మొదలు పెట్టాడు గొల్లపూడి. 'ఆడది', 'కుక్కపిల్ల దొరికింది', 'రిహార్సల్', 'మహానుభావులు'... లాంటి నాటకాలకు మొదట దర్శకత్వం వహించాడు. వాటిలో ప్రధాన పాత్రలు పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. వీరు రాసిన 'అనంతం' నాటికకు ఉత్తమ రేడియో నాటకం అవార్డు వచ్చింది. భారత దేశంలో చైనా దురాక్రమణ కాలంలో, ఆ ఇతివృత్తంతో మొదటి నాటకాన్ని 'వందేమాతరం' పేర వీరే రాశారు. ఆ నాటకాన్ని ప్రదర్శించి ప్రధానమంత్రి రక్షణనిధికి 50,000రూ.ఇచ్చాడు. 1975 ప్రాంతంలో వీరి 'కళ్లు' నాటిక విజయవంతంగా ప్రదర్శింపబడింది. 'రాగరాగిణి' నాటిక అప్పటి రాష్ట్రపతి డా. రాధాకృష్ణగారి సమక్షంలో ప్రదర్శింపబడింది. హిందీలోకీ అనువాదం అయింది. 'కళ్లు' నాటిక విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశంగా కూడా కొంతకాలం ఉంది.          మారుతీరావుకు చిన్ననాడే సాహితీ ఉద్దండులతో పరిచయాలు ఉండేవి. చాసో, శ్రీపాద, శ్రీశ్రీ, పురిపండ అప్పలస్వామి, అబ్బూరి రామకృష్ణారావు, కృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డి వీరికి సన్నిహితులనే చెప్పాలి. టాగూర్ రచనలను, శరత్ రచనలను, చలం రచనలను విపరీతంగా చదివారు. టాగూర్ కథలు, గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేశాడు. కొన్ని ప్రముఖ ఆంగ్ల రచనలను అనువాదం చేసి తెలుగు వారికి అందించాడు.            గొల్లపూడి మారుతీరావు సుమారు 230 సినిమాలలో కమెడియన్, విలన్, ప్రత్యేక పాత్రలలో నటించాడు. కథా రచయిత, స్క్రీన్ ప్లే, మాటల రచయిత, నటుడిగా వీరికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పలు సార్లు నంది బహుమతులు కూడా వీరికి వచ్చాయి. హెచ్ఎమ్ టీవీలో 'వందేళ్ల కథకు వందనాలు' పేరుతో వచ్చే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రసిద్ధమైన తెలుగు కథలను పరిచయం చేశాడు. 'కౌముది' అనే నెట్ పత్రికలో కాలమ్ రాస్తున్నారు.            'చీకట్లో చీలికలు', 'సాయంకాలమైంది', 'అమృతంగమయి' వంటి నవలలు రాశారు. 'టాంజానియా తీర్థయాత్ర' అనే యాత్రా ట్రావెల్ ను కూడా రాశారు. 'అమ్మకడుపు చల్లగా' పేరుతో తన ఆత్మకథను అందించాడు.                కథా రచయితగా కూడా గొల్లపూడి మారుతీ రావుకు మంచి పేరుంది. అసలు మొదట మారుతీరావు కథారచయితే. తనకు తెలిసిన, చదివిన, విన్న అంశాల నుంచే కథలను అల్లేవాడు. దినపత్రికలో వార్త చదివి 'మృత్యువు ఆత్మహత్య', తన కళ్లెదుటే జరిగిన సంఘటన చూసి 'కీర్తిశేషుడు', కూరగాయలు అమ్మే స్త్రీ గురించి 'కాలం కరిచిన కథ'... ... ఇలా రాసేవాడు. రచనలకు పేర్లు పెట్టడంలో కూడా మారుతీరావుది ప్రత్యేకతే. 'గాలిలో ఓ క్షణం', 'పిడికెడు ఆకాశం', 'మళ్లీరైలు తప్పిపోయింది', 'అహంకారపు అంతిమ క్షణాలు'... లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కథల్లో, నవలల్లో పాత్రలను తీర్చిదిద్దడంలో, మాటల్తో వాటికి జీవం పోయడంలో మారుతీరావు సిద్ధహస్తుడు. అందుకే వీరి కథలు మనసును తట్టిలేపుతాయి, ఆలోచింపచేస్తాయి, సమాజంలో మనిషికి కర్తవ్యాన్ని బోధిస్తాయి. 'రోమన్ హాలిడే', 'నిదురపోయే సెలయేరు', 'జుజుమురా' అనేవి వీరి కథా సంపుటాలు. ఇవన్నీ 1999లో వచ్చిన 'గొల్లపూడి మారుతీరావు' సమగ్ర సాహిత్యంలో మనకు లభ్యమవుతున్నాయి.            'పెళ్లిపుస్తకం' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ వీరి చిన్నకొడుకు చనిపోతే అతని పేరుతోనే స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశాడు. మారుతీరావుకు ఎన్నో అవార్డులు పురస్కారాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, పులికంటి కృష్ణారెడ్డి పురస్కారం, గురజాడ అప్పారావు మెమోరిల్ అవార్డు వచ్చాయి. శ్రీపాద, వంశీ  తెలుగు అకాడమీ అవార్డులు వీరి 'స్వప్న' నాటికకు వచ్చాయి. వంగూరి ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభలలో జీవిత సాఫల్య పురస్కారం వీరిని వరించింది. వీరి నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం కూడా వచ్చింది.            నేటి రచయితలు బాగా చదవాలి, మళ్లీమళ్లీ రాస్తూ రచనకు వన్నెలు దిద్దాలి, సాటి సాహితీ మిత్రులకు చూపి సలహాలు తీసుకోవాలి అని మారుతీరావు సమాకాలీన రచయితలకు సలహాలు కూడా ఇస్తున్నాడు. చక్కగా తెలుగు చదవడం, చదివించడంతో పాటు ఒక తెలుగు పద్యాన్ని మీ ఇంట్లో పిల్లలకు నేర్పండి అని మాతృభాష కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో వయస్సు ఇచ్చే నైరాశ్యం, సమాజం ఇచ్చే నైరాశ్యం, కలం మీద నమ్మకం సన్నగిల్లడాన్ని దూరం చేసుకుంటూ ఈ వయసులో కూడా రోజూ... ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడు. దానిలోనే తృప్తి పొందుతున్నాడు.

చింతా దీక్షితులు

చింతా దీక్షితులు                                               - డా.ఎ. రవీంద్రబాబు           తెలుగు కథాసాహిత్యంలో తొలితరం కథకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. తెలుగు కథ నడకలు నేర్చుకుని సరైన మార్గంలో ప్రయాణించడానికి అనువైన బాటను నిర్మించిన వారిలో మఖ్యుడు. భాషలో, నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కథకుడు దీక్షితులు. ముఖ్యంగా బాలసాహిత్యాన్ని తెలుగులో సృష్టించిన వారిలో ఆద్యుడు. చింతా దీక్షితులు లేనిదే తెలుగు కథాప్రస్థానం  పూర్తికానట్లే అనిచెప్పాలి.            చింతాదీక్షితులు 1891 నంబరు 1న తూర్పుగోదావరి జిల్లాలోని దంగేడు గ్రామంలో జన్మించారు. వీరిది సాంప్రదాయమైన కుటుంబం. రాజమహేంద్రవరం (రాజమండ్రి) లో బి.ఎ. చదివారు. తర్వాత సైదాపేటలో ఎల్.టి చేశారు. ఉపాధ్యయునిగా, పాఠశాలల తనిఖీ అధికారిగా ఉద్యోగం చేశారు. కథలతో పాటు నాటకాలు, గేయాలు రచించారు. అపూర్వమైన బాలసాహిత్యాన్ని సేకరించారు. సొంతగా సృష్టించారు.           సుమారు 100కు పైగా వీరు కథలు రచించారు. 1964లోనే 'చింతాదీక్షితులు' కథలు పేర 22 కథలు, 1996లో 'చింతాదీక్షితులు సాహిత్యం' పేరుతో మరో తొమ్మది కథలతో పాటు వారి రచనా వ్యాసంగం మొత్తం ప్రచురింపబడింది. అందుకే గురజాడ, శ్రీపాద తర్వాత తెలుగు కథాసాహిత్యానికి బీజాలు వేసిన వ్యక్తి దీక్షితులు. తొలిరోజుల్లో భీమశంకరరావుతో కలిసి కవిత్వం చెప్పారు. జంటకవులుగా వీరిద్దరూ బాగా ప్రసిద్ధి పొందారు. 1912లో వీరు 'చిత్రరేఖ' అనే అపరాధ పరిశోధన (డిటెక్టివ్) నవల రాశారు. 'హరిణదంపతులు', 'కవికన్య' గేయాలను 1923లో ప్రచురించారు.          ఇక బాలసాహిత్యం విషయానికి వస్తే చింతా దీక్షితులు- స్వయంగా ప్రచారంలో ఉన్న జానపద గేయాలను సేకరించారు. స్వయంగా కొన్ని రచించారు. ఆ రోజుల్లో 'ఆంధ్ర సచిత్రవారపత్రిక'లో కొన్నిటిని ప్రకటించారు. 1931 నుంచి 'బాలానందం' పేరిట 'భారతి' మాస పత్రికలో బాలగేయాలు రాశారు. వీటిలోని 'సూరి, సీతి, వెంకి' పాత్రలు పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా అలరించాయి. 'బంగారు పిలక' గేయ కథలకు అప్పట్లో ఆంధ్ర ప్రభుత్వం బహుమతి లభించింది. అదేవిధంగా 1949లో వీరి 'లక్కపిడతలు' కు భారత ప్రభుత్వం బాలసాహిత్యంలో ప్రథమ బహుమతి ప్రకటించింది.            చింతా దీక్షితులు 'శర్మిష్ఠ', 'వరూధిని', 'దసరాదిబ్బ', 'శ్రీకృష్ణుడు' వంటి పౌరాణిక, చారిత్రక నాటకాలు కూడా రాశారు. వ్యవహారిక భాషలో 'అనుమానం మనిషి' అనే గొప్పనాటకాన్ని రచించారు. ఈ నాటకం ఆ రోజుల్లో భాగా ప్రాచుర్యం పొందింది.           చింతా దీక్షితులు రాసిన కథలు వస్తువైవిధ్యంతో నిండి ఉన్నాయి. వీరు ఉద్యోగరీత్యా పలు ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి ప్రజల జీవన విధానాలను పరిశీలించడం ఇందుకు కారణం కావచ్చు. వీరి కథల్లో 'దాసరిపాట', 'గొదావరి నవ్వింది', 'మూడు కుక్కలు', 'కిష్కిందలో కోతి', 'డబ్బు డబ్బు డబ్బు', 'పెద్దమేడ' ముఖ్యమైనవి. వీరిక మాత్రం 'తోటివనంలో' కథంటే చాలా మక్కువ. దీక్షితులు 'వటీరావు ఎం.ఎ.' పాత్రను సృష్టించి సంప్రదాయాలను కీర్తిస్తూ, ఆధునిక నాగరికతను నిరసిస్తూ చాలా కథలు రాశారు. 'దాసరిపాట' కథ వయోజన విద్యా ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. 'ఆంధ్రా దోమల సభ', 'పాకశాస్త్రం పరీక్ష', 'నీతిపాఠ' లాంటివి వీరి కథల్లోని హాస్యాన్ని మనకు పట్టిస్తాయి.           సంచార జాతుల మీద అంటే ఆదిమ జాతుల మీద మొట్టమొదటి తెలుగు కథ రాసిన ఘనత మాత్రం చింతా దీక్షితులు గారిదే... లంబాడీల జీవితాల్ని వివరిస్తుంది 'సుగాలీ కుటుంబం' కథ. 'చెంచురాణి' కథ కూడా ఈ కోవకు చెందిందే...  'అభిప్రాయభేదం' కథ ఆర్థికంగా సమాజంలో ఉన్నవారికి లేనివారికి మధ్య ఉన్న ఆంతర్యాలను ఎత్తి చూపుతుంది.              వీరి కథలు ప్రకృతిలోని ప్రతి అందాన్ని పట్టి చూపిస్తాయి. మనసుల్ని ఆర్ద్రతతో నింపుతాయి. సమాజంలోని వివిధ జాతుల జీవన విధానాల్ని పరిచయం చేస్తాయి. గ్రామీణుల బాధల్ని, నిరాడంబరతని చూపిస్తాయి. వీరికి పలు భాషలు వచ్చినా ఆ సాహిత్యాల ప్రభావం వీరి కథలపై కనపడదు. కథను నడిపించడంలో, వాక్యాలు కూర్చడంలో, సొగసుగా చెప్పడంలో చింతాదీక్షితులు సిద్ధహస్తులు. సంఘటనాత్మక కథలే కాదు, వర్ణనలు, సంభాషణాత్మకమైన కథలు కూడా వీరు రాశారు. వీరి కథలు ప్రకృతితో పాటు, ప్రణయం, హాస్యం, తాత్త్విక దృష్టి, పిల్లలను అలరించేవిగా మనకు కనపడతాయి. వీరు పూర్తిగా వ్యవహారిక భాషలో కథలు రాసినా అక్కడక్కడా గ్రాంథిక వాసనలు వస్తాయి. ( ముళ్లు - కంటకాలు, ఆశ్చర్యం - విస్మయం).          చలానికి తెలుగు కథమీద ఆసక్తిని, అనురక్తిని కలిగించింది దీక్షితులుగారే అంటారు. చివరకు ఆయన మనసును, జీవితాన్ని రమణాశ్రమానికి మల్లించడంలో కూడా వీరి పాత్ర ఉంది. తెలుగు కథకు, బాలసాహిత్యానికి విశేష సేవలిందించిన చింతాదీక్షితులు 1960లో కీర్తి శేషులయ్యారు. ఏది ఏమైనా తెలుగు కథకు తొలినాళ్లలో మార్గదర్శకులుగా వ్యవహరించిన వారిలో ధీక్షితుల గారు ఒకరు అన్నది మాత్రం నిజం.

కాగితం ముక్కలు - గాజు పెంకులు

కాగితం ముక్కలు - గాజు పెంకులు   - బుచ్చిబాబు     'చివరకు మిగిలేది' అనే ఒకేఒక్క నవలతో తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నారు బుచ్చిబాబు. బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వేంకట సుబ్బారావు. ఇతను సుమారు 80కి పైగా కథలు రాశారు. అయితే వీరి రచనలు ఎక్కువ భాగం మనషి, మానసిక జగత్తును చిత్రీకరించేవే... పాత్రలు కూడా మానసిక సంఘర్షణలతో సతమతమయ్యేవే... వీరు రాసిన 'కాగితం ముక్కలు - గాజుపెంకులు' కథ కూడా ఇలాంటిదే... బార్యపై అనుమానంతో ప్రవర్తించే భర్తను, ప్రేమన, పెళ్లి తర్వాత భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పును వివరించేదే ఈ కథ. బుచ్చిబాబు ప్రతేకమైన శైలి దీనికి మరో ఆకర్షణీయమైన ఆభరణం.        కథ రైలు వర్ణనతో ప్రారంభమవుతుంది. చంద్రం తన స్నేహితుడు నరసింహాన్ని రైలు ఎక్కించడానికి స్టేషనుకు వస్తాడు. నరసింహం కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రానికి, అతని భార్య అరుణకు స్నేహితుడు. అయితే చదువుకునే రోజుల్లో నరసింహం ప్రవర్తన వల్ల అతనికి పోకిరి, సింహం అనే పేర్లు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్మీలో ఉన్నతమైన ఉద్యోగం. ఆ ఉద్యోగం తాలూకూ వచ్చిన పొట్టి క్రాపు, మర్యాద, నమ్రత అతనిలో చంద్రానికి కనిపిస్తాయి. ఉన్న నాలుగు రోజులు చంద్రం భార్య అరుణతో మర్యాద పూర్వకంగా, నాజూకుగా ప్రవర్తిస్తాడు నరసింహం.      కానీ, రైలు ఎక్కేటప్పుడు మాత్రం తన దగ్గరున్న హంటర్ ను చంద్రానికి బహుమతిగా ఇస్తాడు. తన జ్ఞాపకార్థం ఉంచుకోమంటాడు. పైగా... 'ఈ నాలుగు రోజులు హాయిగా గడిచాయి. అరుణకు థాంక్స్ చెప్పు' అంటాడు. దాంతో చంద్రానికి అరుణపై, నరసింహంపై అనుమానం మొదలవుతోంది. 'ఒకర్నొకరు గారు అని సంబోధించే అవసరం వున్నంత వరకూ వారిని నిజమైన స్నేహితులుగా పరిగణించడం సాధ్యం కాదేమో...' అనుకుంటాడు.     నరసింహం ఇచ్చిన హంటర్ తో ఇంటికి వెళ్తాడు. భార్యను పిలుస్తాడు. పలకదు. మూసిఉన్న అరుణ గది తలుపులను తోసుకుంటూ లోపలికి వెళ్తాడు. 'తలంటు పోసుకొన్న జుట్టు తడిని తువ్వాలుతో బిగించి ఆర్పుకొంటూ పచ్చటి తెల్లచీర పూర్తిగా కట్టుకోకుండా జాకెట్టు కూడా లేని....' అరుణను చూస్తాడు. వెంటనే చంద్రంలో కోర్కెలు పురివిప్పుతాయి. ఆమె చేతిలో ఏదో కాగితం కనిపిస్తుంది. 'ఏమిటది?' అని అడుగుతాడు. ఆమె చూయించకుండా చీరమడతలో దాచుకుంటూ 'బైటకెళ్లండి' అంటుంది. 'ఏం మాట్లాడుతున్నావో?, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?' అని గద్దిస్తాడు. ఇద్దరి మధ్యా పెనుగులాట జరుగుతుంది. అరుణ వ్యక్తిత్వం క్రమంగా దెబ్బతింటుంది. చంద్రంలోని బలహీనతలు బయటపడతాయి. 'డేగ పాదం కప్పపిల్ల మీద పడ్డట్టు' ఆమె భుజాన్ని పట్టుకుంటాడు చంద్రం. ఆమె పక్కకు తప్పుకుంటుంది. చంద్రం కిందపడతాడు. దెబ్బ తగులుతుంది. చివరకు హంటర్ తో అరుణను కొట్టి చేతిలో కాగితాన్ని తీసుకుంటాడు.        తన గదిలోకి వెళ్లి దాన్ని చదువుతాడు. అది పెళ్లైన ఏడాదికి భార్యపై ప్రేమతో చంద్రం రాసిన లేఖ అది...     'అన్ని నదులూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట సముద్రంలో పడాల్సిందే అన్నాడు ఒక కవి. ఇప్పుడా సమయం వచ్చింది. ఉద్యోగం దొరికింది. నీకు ఉయ్యాలంటే ఇష్టం కదూ... మనుషులు లేని ఏకాంత లోయలలో రెండు శిఖరాలకు మధ్య తగిలిద్దాం ఆనందం అనే ఉయ్యాలని... దూరంగా వెళ్లిన పిల్ల వాయువు ఆ ఉయ్యాలని ఊపుతుంది..... ..... అరుణా... కొండ వెనక ప్రభాత కిరణం. నీ స్నానం కోసం వేచివున్న అడవి కొలను... మనకోసం ఎదురు చూస్తూ  ఉన్నాయి.'         ఉత్తరాన్ని కొంత చదివిన చంద్రానికి అరుణ ఆ ఉత్తరం తను చూడకుండా ఎందుకు దాచుకుందో అర్థం కాదు. ఆలోచిస్తాడు. ఎన్నేళ్ల క్రితమో తను పొందిన ఆనందాన్ని ఇప్పుడు చదువుకొని  గుర్తు తెచ్చుకుంటున్న పనికి తను అడ్డు వచ్చినందుకా...?! అని చంద్రం అర్థం చేసుకుంటాడు. 'హంటర్ స్వరూపంతో తను తన ముందు ప్రత్యేక్షమై ఆ ఊహా జగత్తును ధ్వసం చేశాడు. అందుకే విరోధిగా, పరాయి వాడిగా తూలనాడి ఎదురు తిరిగి, స్వప్న జగత్తులో తన నిజ స్వరూపాన్ని వొక్కసారి చూపెట్టింది'. అని నిజం తెలుసుకుంటాడు. హంటర్ తో తనూ ఓ దెబ్బ కొట్టుకుంటాడు. దాన్ని అక్కడే పడేసి అరుణ గదికి బయల్దేరుతాడు. కాని అప్పుడే అతడి కళ్ల నుండి ఒక కన్నీటి బిందువు రాలుతుంది. 'అది పగిలిన వాటిని అతుకు పెట్టే జిగురులాంటిది. అదికాస్త ఇప్పడు పడిపోయింది' అని కథను భారంగా ముగిస్తాడు బుచ్చిబాబు.           సున్నితమైన ఉద్వేగాలను ఆపుకోలేక మానవ సంబంధాల్లో కల్లోలాన్ని సృష్టించుకున్న చంద్రం. గతాన్ని తల్చుకొని వర్తమానంలో దొరకని ఆనందాన్ని స్వప్నలోకాల్లో పొందే అరుణ. కాలంతోపాటు వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్న నరసింహం... ఇలా మూడు భిన్న మైన మనుషుల మధ్య సాగుతుంది ఈ కథ. ఎక్కడా బుచ్చిబాబు వర్ణనలు పాఠకుడ్ని వదలకుండా వెంటాడుతాయి.       మొదట రైలు గురించి- 'బ్రతుకంతా భ్రమ అనుకొని మడి గట్టుకొని మూల కూర్చుని పెదవి చప్పరించే వారికి ఈ రైలింజన్ ఒక సవాల్... ... ధ్వనుల్ని తనలో జీర్ణించుకుని గతంలోంచి ప్రాణాన్ని తెచ్చుకున్న ఒక చారిత్రక కళేబరం' అంటాడు        అరుణ, చంద్రం పెనుగులాటలో అరుణ వ్యక్తిత్వాన్ని చెప్తూ-  1. ఇప్పుడామే కళ్లు ఎర్రగా వున్నాయి.  2. పరాయి స్త్రీగా కనపడుతుంది అరుణ.  3. అరుణ సంసార బంధాన్ని విస్మరించింది. తన భార్యకాదు-   వ్యక్తిత్వంతో ప్రజ్వరిల్లుతున్న వొక ప్రాణి అంటాడు         కథ చివర చంద్రం జీవితంలో వచ్చిన మార్పును, అరుణ లేఖ చదవడంలో పొందిన ఆనందాన్ని కలిపి వర్ణిస్తూ- 'ఆ ఉత్తరం రాసిన చంద్రం వేరు. ఆ చంద్రం ప్రియుడు- యవ్వనంలో స్వప్నాలల్లే మాంత్రికుడు. ఇప్పటి చంద్రం భర్త, ఉద్యోగం, హోదా, డబ్బు, నౌకర్లూ, స్నేహితులూ, మర్యాదలూ- ఆమె భార్య- వంటొండి పెడుతుంది....' అంటాడు.      అందుకే ఈ కథ ప్రేమికులలో, ప్రేమించి పెళ్ళిచేసుకోవాలనుకునే వారిలో, చేసుకున్న వారిలో, వచ్చిన, వస్తున్న మార్పులకు అద్దం లాంటిది. ప్రతి ఒక్కరూ చదవాల్సిన చీకటి లాంటి వెన్నల సౌధం.                                                                                    - డా.ఎ. రవీంద్రబాబు

చిరునామా లేని లేఖ

   చిరునామా లేని లేఖ                                                      డా.ఎ. రవీంద్రబాబు        ఎన్ని ఊహలు మనిషిని  నాశనం చేస్తాయో కదా...! అన్నీ అంతమై పోయాక...! నీకోసం నా కలల లోగిలిలో ఓ స్వప్న సౌధాన్ని కట్టాను. ఆకాశానికి భూమికి మధ్య నువ్వూ, నేను మాత్రమే జీవించగల ప్రదేశమది...! నీ నవ్వుల్ని నక్షత్రాలుగా మార్చి ఆ ప్రదేశమంతా వెలుగుల్ని పూయించాను.నీ శరీర కాంతినే సంధ్యకు అలిమి మన ఏకాంతంలో సాంధ్యరాగాన్ని ఆలపించాను. అప్పుడు సుదారాల్లోంచి, పక్షుల కిలకిల శబ్దాల్లోంచి సుతిమెత్తగా షెహనాయ్ మంద్రంగా వినిపిస్తోంది. అక్కడ నువ్వు నేను, సృష్టి సౌందర్య పరిమళం... ధారాపాతంగా కురుస్తున్న వెన్నెల సోన... నేను మాత్రం స్పర్శకు గాఢంగా నిశ్శబ్దాన్ని నేర్పుతున్నాను.         హటాత్తుగా కళ్లు తెరిస్తే... ఏముంది నా ముందు చీకటి...! నా చుట్టూ చీకటి... నా లోపల చీకటి... చీకటి... చీకటి... ఫెటిళ్ళమనే చీకటి.     ఏం చెప్పను... ?నువ్వు దూరమైన రోజు నుంచీ ఈ స్వప్నాలు సైతం నన్ను వేధిస్తూనే ఉన్నాయి. ఉరితాళ్లలా మారి నా గుండెనే ఉరి తీస్తామంటున్నాయి. ఆ గుండె నిండా ఉన్నది నీవేగా...! నీ జ్ఞాపకాలేగా...! వాటినీ కోల్పోయి నేనెలా బతకగలను..? ఆఖరకు ఆ కలల్లో కూడా నిన్ను చూసుకునే బాగ్యానికి దూరమవుతానేమో...!!?         అయినా...! దూరమనే శిక్ష ఇంత బాధను నింపుతుందా...? అసలు ప్రేమంటేనే శాశ్వత వ్యధేమో కదా...! దూరంగా ఉన్నంత సేపూ దగ్గరవ్వాలని, దగ్గరగా ఉన్నంత సేపూ దూరం కాకుడదనీ... బాధ. శాశ్వతంగా దూరమైతే.,.!? ఇలా...! నాలా...!        ఇప్పుడు నీ గురించి ఏవో కొన్ని అనుభవాలు, అనుభూతులు రాయగలుగుతున్నాను గానీ, పది నిముషాలు గడిస్తే...! నా వల్ల కాదేమో...! ఎందుకంటావా...? ఇట్లానే నా గుండెలోంచి ఏకంగా ఈ అక్షరాల్లోకి దూకేస్తావు. ఇక కాగితం నీ ఆకారంతో నిండిపోతుంది. నా కళ్లు పూర్తి నిమీలితాలవుతాయి. హృదయం బరువెక్కుతుంది. మౌనంగా మారిపోతుంది. అప్పుడు ఇక నానుంచి నేను దూరమవుతాను. మానసికంగా నీలో లీనమవుతాను. అప్పడిక నేనే నువ్వు, నీవేనేను. సృష్టిలో తొలి పరిచయం మనదే కదా...!! ఆ క్షణాల్ని ఎవ్వరితోనూ పంచుకోవాలని ఉండదు. ఏకంగా నాలోనేను మిగిలి, కిమిలి పోవడం తప్ప...!?        ప్రేమకు... మనిషికి... మనసుకు మధ్య ఈ బంధాల్ని పూర్తిగా విడమరిచి ఎలా చెప్పాలో నాకు ఇప్పడికీ తెలియడం లేదు. కవిత్వాలు, తత్వశాస్త్రాలు వివరించలేదు, బోధించలేదు. అదో ఆంతరంగిక సౌందర్యానికి పరాకాష్ట అయిన వ్యధా చిత్రమేమో...! ఏ చిత్రకారుడూ చిత్రీకరించలేక పోయాడు. అయినా.. ఆస్తి, ధనం, దేహం, వస్తు విపణిలో చిక్కుకున్న ఈ పాడు ప్రపంచానికి చెప్పినా అర్థం కాదు...!! బహుశా ఆత్రేయ గారిని అడిగితే బావుణ్ణు...      "మనిషి జన్మనిచ్చి మనసు నిచ్చితివయ్యా...       ఇంతకన్న ఏమికావలియు శిక్ష" అని దేవుడ్నే ప్రశ్నించాడు. నీవు ఎన్ని చెప్పినా నేను దేవుడ్ని నమ్మనన్నప్పుడు... నీకు వచ్చిన కోపం ఇంకా నామదిలో పదిలంగానే ఉంది. గమ్యం సినిమాలో...       "ప్రేమను ప్రేమించే ప్రేమ        ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది..." అన్న  వాక్యాలు నా గుండెను మరోసారి గెట్టిగా చరిచాయి. మరి నా జీవితంలో ఎందుకలా జరగలేదా అని...! అది సినిమా కదా...!!      అసలు ప్రేమకు మరుపనేది ఉందా అని...?ఉంటే...! సృష్టి ప్రారంభం నుంచి ఇన్ని శరీరాలు, ఇన్ని ఆత్మలు, ఇన్ని హృదయాలు దానిలోపడి భగ్నమై... చివరకు బూడిదై... ఓటమిపాలై... ఇలా ప్రేమను బాధించేవి కావేమో కదా...        రోజులు నాకు మౌనంగా భారంగా దొర్లుతున్నాయి. క్షణం క్షణం... నీ అధరం నుంచి వెలువడే చిరునవ్వులో కాలి బూడిదై పోవాలనే తపన. నీ ఎదురుగా నిన్నే చూస్తూ... నీ మాటల్లో మునుగుతూ... కాలాన్ని కాంతివంతంగా గడిపిన రోజులన్నీ మెదులుతున్నాయి. నువ్వు చెప్పినట్లే జీవిస్తున్నా మరణిస్తూ... నీ మాటల్ని గుర్తు చేసుకుంటూ... ఇష్టం లేక జీవితాన్ని భరిస్తూ... కొన్నిటిని ఎవరితోనూ పంచుకోలేం కదా...!  వాటిని బతుకు చివరవరకు గుండె కొసన మోయాలి. నీ జ్ఞాపకాలకున్న శక్తి అటువంటిది మరి. నువ్వన్న మాట ఈ క్షణానికీ గుర్తొస్తుంది... "మరీ అంత సున్నితంగా మనసు ఉండకూడదురా...?" ఏం చేయమంటావు...? నాకు చేతకావండ లేదు. నా మనసుకు మరోలా ఉండలేదు. క్షమించు ఇప్పటికి మాత్రమే... 

చలం

చలం                                         - డా.ఎ. రవీంద్రబాబు.              తెలుగు సమాజాన్ని ఊగించి, దీవించి, తన రచనలతో పెను తుపాను సృష్టించాడు చలం. కలానికి, జీవితానికి మధ్య కత్తి అంచుపై నడిచాడు చలం. నేను ఎవరు? అని ప్రశ్నిస్తూనే... తీవ్ర అశాంతితో, ఆవేదనతో అలమటించిన సౌందర్యవాది చలం. సంఘంలోని కుటీలనీతిని తూర్పారపట్టి, ఒంటరి వేదనలో బాధను సైతం ఆనందంగా స్వీకరించిన తాత్వికుడు చలం. స్త్రీ తరఫున వకాల్తా పుచ్చుకొని, ఆమె స్వేచ్ఛకోసం పరితపించిన ప్రేమికుడు చలం.             అనుక్షణం ప్రశ్నలతో, అశాంతితో జీవిస్తూ... ఆనందం కోసం కలలుగన్న చలం పూర్తిపేరు గుడిపాటి వెంకటచలం. మే 18, 1894న మద్రాసులో పుట్టాడు. తల్లి వేంకట సుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. అయితే తాతయ్య గుడిపాటి వెంకట చలం దత్తత తీసుకోవడం వల్ల ఇంటిపేరు మారింది. పాఠశాల విద్య పూర్తికాకముందే ఇతిహాసాలు, పురాణాలను క్షణ్ణంగా చదువుకున్నాడు. పిఠాపురంలో చదువుకుంటూ, కాలేజీ రోజుల్లో బ్రహ్మసమాజం వైపు ఆకర్షితుడయ్యాడు. చిన్న వయసులోనే రంగనాయకమ్మను పెళ్లి చేసుకున్నాడు.           చిన్నతనంలో తండ్రి తనను కొట్టడం, తండ్రే తల్లిని వేధించడం, చెల్లెలు పెళ్లి ఆగిపోవడం... ఇలాంటివి చలం పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చలం మద్రాసులో బి.ఎ. చదువుకునే రోజుల్లో భార్యను కూడా చదవించాడు. ఇది తెలుసుకుని 'ఆడపిల్లకు చదువేంటి?' అని చలాన్ని బంధువులు  దూరంగా ఉంచారు. తర్వాత చలం కాకినాడలో ట్యూటర్ గా, హోస్పేట టీచర్ గా పనిచేశాడు. తర్వాత రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజ్ లో ఉద్యోగం చేశాడు. పాఠశాల తనిఖీ అధికారిగా కూడా కొంతకాలం పనిచేశాడు.              చిన్నతనం నుండే చలానికి సమాజంలోని ఆచారాలు, కట్టుబాట్లు, నీతినియమాలు, వాటి వెనుక దాగిన రహస్యాలు గిట్టేవి కావు.  ప్రతి క్షణం ఆయనను బాధపెట్టేవి. ఆలోచింపజేసేవి. ఎదురపడే సంఘటనలు, స్త్రీల జీవితాల్లోని బాధలు నిద్రపోనిచ్చేవి కావు. వ్యక్తిగత జీవితంలో సమాజ ప్రభావం తీవ్ర మానసిక వేదనను కలిగించేది. చదవటం, సమాజంలోని ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి అనుభవాలతో పోల్చుకోవడం, ఈశ్వరుడికోసం వెతకడం ప్రారంభించాడు. కానీ చలానికి ఎక్కడా ప్రశాంతత దొరకక అశాంతిలో మునిగిపోయేవాడు. కళ్లెదుట స్త్రీలు పడే అగచాట్లు, కష్టాలు అతనిని బాధించేవి... ... ఇలా తన మనసు తనలో తను చేసుకునే అనేక వాద ప్రతివాదాలతో రచనా ప్రపంచంలోకి అడుగు పెట్టాడు చలం.     కీర్తికోసమో, ధనం కోసమో రచనలు చేయలేదు. తన బాధను, వేధిస్తున్న ప్రశ్నలను, స్త్రీ అణచివేతను భరించలేక వాటినే అక్షరాల్లోకి ప్రవేశ పెట్టాడు. ఎటువంటి అధికారాలకు, ప్రలోభాలకు, ప్రభావాలకు లొంగకుండా జీవించమన్నాడు. సరిహద్దులు లేని మానసిక, భౌతిక ప్రేమను, స్వేచ్ఛను పొందాలన్నాడు. దాని కోసమే తపించాడు. పిల్లలకు బాల్యంలో సంపూర్ణ స్వేచ్ఛను ఇవ్వాలన్నాడు.        శిశిరేఖ, మైదానం, వివాహం, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, అమీనా, అరుణ, జీవితాదర్శం, సీతతల్లి, ఆమె పెదవులు, బిడ్డల శిక్షణ, చలం, మ్యూజింగ్స్, టాగూర్ గీతాంజలి (అనువాదం), ప్రేమలేఖలు, పురూరవ, సావిత్రి, స్త్రీ, పాపం, ఆ రాత్రి, ప్రేమ పర్యవసానం, యవ్వనవనం, ఆనందం, విషాదం, భగవద్గీత. జెలసీ, వేదాంతం... ఇలా ఎన్నో పుస్తకాలు కథలు, నవలలు, నాటకాలు, నాటికలు, జీవితచరిత్ర, డైరీలు, ఉత్తరాలుగా... ... రాశాడు.  కుటిలనీతుల మధ్య, కుటుంబ గౌరవాల మధ్య, కట్టుబాట్ల మధ్య, మృగరాజ్యాల మధ్య స్త్రీకి జరుగుతున్న అణచివేతల్ని, అన్యాయాల్ని ప్రశ్నించాడు.       'స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి      ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి      ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం కావాలి'       అని గట్టిగా వాదించాడు. తన జీవితంలో, రచనల్లో ఇచ్చి చూపాడు. రాజేశ్వరి, అరుణ, శశిరేఖ... లాంటి ఎన్నో చలం పాత్రలు సమాజం విధించిన బంధాలు తెంచుకున్నాయి. ఆజ్ఞలు లేని స్వేఛ్ఛలో విహరించాయి. బాధలు, కష్టాలు, కన్నీళ్లు బరించాయి. వాటిల్లో ఆనందాన్ని అనుభవించాయి. సమాజాన్ని వెలివేశాయి. సమాజం చేత వెలివేయబడ్డాయి. అపార్థాలకు, అన్యాయాలకు గురయ్యాయి.          చట్టం పేరుతో, బంధం పేరుతో, సమాజం పేరుతో ఇద్దరిని కట్టిపడేసే బంధాలలో ఇరుక్కొని నరకం అనుభవించే కంటే... ఎక్కడ శరీరం మనసును నిర్లక్ష్యం చేయదో, ఎక్కడ ఆరాధన, ఆప్యాయత కట్టుబాట్లకు లొంగిపోదో అక్కడకు పొమ్మంటాడు చలం. 'మైదానం' నవలలో రాజేశ్వరిలా...       నేటి అత్యాధునిక స్త్రీ గురించి చలం ఆరోజుల్లోనే వాస్తవంగా ఆలోచించాడు. 'భర్త అధికారం నుంచీ, భర్త ఆధీనం నుంచి తప్పించుకుంటున్న నవీన స్త్రీ, షోకులకీ, సంఘగౌరవానికీ, ఫాషిన్సీకి బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కింద నుంచుని (ఆ పురుషుడికి బానిస అయితేనేం గాక) లోకాన్ని ధిక్కరించ గలిగే ఇల్లాలు, ఈనాడు సంఘగౌరవం పేర, ఉద్యోగం పేర, ఫాషిన్సీపేర వెయియమందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి - తన చుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు.' అని అన్నాడు           హిపోక్రసీలు, దుర్మార్గాలు, హింసలు, స్వార్థాలు, దౌర్జన్యాలు లేని మనుషుల్ని, మనసుల్ని, సమాజాన్ని చలం కోరుకున్నాడు. అన్నీ మర్చిపోయి ఒకరిలో ఒకరు ఐక్యమయ్యే ప్రేమ, తృష్ణ కావాలన్నాడు. అందుకే ఆ రోజుల్లో చలం స్వేచ్ఛ పేరుతో విశృంఖలాన్ని చెప్తున్నాడని, బూతుల్ని రాస్తున్నాడని ప్రచారం జరిగింది. చలం సాహిత్యాన్ని బహిరంగంగా చదవడానికే సమాజం భయపడింది.           చలంలో కేవలం స్త్రీవాదే కాదు, ఒక తాత్వికుడు, దార్శనికుడు, హేతువాది కూడా... సాహిత్యం మీద, కళ మీద చలానికి సొంతవైన, గాఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. 'మహాప్రస్థానా'నికి చలం రాసిన ముందుమాట నిజంగా యోగ్యతాపత్రిమే... 'నెత్తురు, కన్నీళ్లు కలిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తాయారుచేశాడ'న్నాడు శ్రీశ్రీ. 'శ్రీశ్రీ బాధ ప్రపంచపు బాధ, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' అని చెప్పాడు. శ్రీశ్రీ కవిత్వంలో 'చీకట్లో మొహాలూ, తోకలూ, కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలి దెబ్బల కింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మరఫిరంగుల మరణధ్వానం' ఉన్నాయన్నాడు.             చలం రచనల్లో మరో గుప్పగుణం ఆయన శైలి. ఆయన చెప్పే విషయాలని ఇష్టపడని వాళ్లు కూడా, ఆ వాక్యాల కోసం చలం పుస్తకాల్ని చదివేవారు. బాధ నుండి, ఆర్తి నుండి, తీవ్రమైన మనో వేదన నుండి పొంగుకొచ్చిన కన్నీటి సముద్ర అలల నుండి ఆయన శైలి రూపుదిద్దుకొంది. అందుకే దానికి అంత సౌందర్యం. పరిమితులు, పరిధులు లేని భాష ఆయన సొత్తు.          ఇంతగా స్వేచ్ఛకోసం, ప్రేమకోసం, హిపోక్రసీ లేని సమాజం కోసం... ... తపించిన చలం జీవితంలో ఒంటరి వాడిగానే మిగిలిపోయాడు. అవమానాలు పొందాడు. రచనల వల్ల, వ్యక్తిగత జీవితం వల్ల మానసికంగా సమాజం అతడిని కుంగదీసింది. జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అనారోగ్యంతో పెద్ద కొడుకు చనిపోయాడు. మరొక కొడుకు వ్యసనాలకు బానిసై ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కూతురు సౌరీస్ సన్యాసిగా మారిపోయింది. చలం ప్రేమ విషయలాతో విసుగుచెంది భార్య రంగనాయకమ్మ క్షోభ పడింది. తర్వాత వదిన పెద్ద రంగనాయకమ్మ మరణించింది. అన్ని విధాలా అతడిని తెలుగు సమాజం వెలివేసింది. చలం విజయవాడలోని సొంత ఇంటిని ఫిబ్రవరి9, 1950లోనే అమ్మి అరుణాచలం లోని రమణమహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయాడు.      కానీ ఆయన రచనల మీద మమకారం తీరక అనేకమంది అక్కడకు వెళ్లి ఆయనను చూసి, మాట్లాడి వచ్చేవారు. చలం కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు నచ్చిన వాళ్లతో జరిపేవాడు. చివరకు ఆధ్యాత్మిక భావనలోని సౌందర్యంలో మునిగి మే4, 1979లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.           స్త్రీల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రతిక్షణం అలమటించి, అక్షరయజ్ఞం సాగించాడు చలం. 'నేను' అనే భావనను త్యజించాలని ప్రయత్నించి, అన్వేషణ సాగించాడు. అనుభవ పూర్వకమైన సౌందర్యం వెంట పరుగులు తీశాడు. సమాజాన్ని పొరలు పొరలుగా విడదీసి లోపాలను ఎండగట్టాడు. సరిహద్దుల్లేని స్వేచ్ఛా మానసం కోసం పరితపించాడు. ఇలా చలాన్ని ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆయన రచనలు వారికి అలా కనిపిస్తాయి. అందుకే చలం పుట్టి 120 ఏళ్లు అయినా, ఇంకా అతని రచనలపై వాదోపవాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఉంటాయి.          తిట్టడానికో, పొగడ్డానికో, ఆ అర్ణవంలో పడి కొట్టుకపోవడానికో... తాత్వికంగానైనా, ప్రేమను తెలుసు చేసుకోడానికైనా, స్త్రీని కొంత అర్థం చేసుకోడానికైనా, హిపోక్రసీని వదులుకోడానికైనా... నిన్ను నీవు మలచుకోడానికి, సమాజాన్ని ఎలానో ఒకలా, కుహనా విలువల వలువలు విప్పి చూడటానికి చలాన్ని తప్పక చదవాల్సిందే....

కరుణ కుమార

కరుణ కుమార                                                  - డా.ఎ. రవీంద్రబాబు     రాయలసీమ మాండలిక పదాలను తొలిసారిగా కథాలోకానికి పరిచయం చేసిన రచయిత కరుణకుమార. ఉన్నత స్థాయి నుంచి నిరుపేదల వరకు సమాజంలోని అన్ని పాత్రలను తన కథల్లో సృష్టించిన కథకుడు కరుణకుమార. మనిషిని, మానవ ఔన్నత్యాన్ని ఉన్నతంగా రచనల్లో చూపించిన దార్శనికుడు కరుణకుమార. కరుణ కుమార అసలు పేరు కందుకూరి అనంతం.        కరుణకుమార ఏప్రిల్ 17, 1901 పశ్చిమగోదావరి జిల్లాలోని కాపవరంలో జన్మించారు. బహుశా హైస్కూలు విద్యతోనే చదువుకు స్వస్తి చెప్పారు. తర్వాత బతకడం కోసం బస్సుకండెక్టరుగా, కచ్చేరి గుమాస్తాగా పనిచేశారు. చివరకు తహసీల్దారుగా ప్రభుత్వం ఉద్యోగం చేశారు. కానీ ఏ పనిచేసినా అక్కడి సమాజాన్ని, ప్రజల జీవితాలను సూక్ష్మంగా పరిశీలించేవారు.  ఆ అనుభవాలనుండే కథలను రాసేవారు.        కరుణకుమార కథలు 1961లో 'సన్నజీవాలు' పేరుతో 6 కథలు, 1998లో 'కరుణకుమార కథలు'గా 10 కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి. ఆ రోజుల్లో భారతి, ఆంధ్రప్రభ పత్రికల్లో విరివిగా వీరు కథలు రాసేవారు. అప్పటి బ్రాహ్మణ అగ్రహారాలు, కాపుపల్లెలు, మాలవాడలు... ఇలా సమస్త ప్రజల జీవన విధానాలను, ఆయా మనుషుల చిత్తవృత్తులను సహజంగా చిత్రించారు. అంతేకాదు వీరి కథల్లో ఇతని పేరుకు తగ్గట్టుగానే కరుణరసం అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈయన కథలు చదువుతుంటే ప్రారంభ నుంచి ఉత్కంఠ భరితంగా సాగుతుంటాయి. సన్నివేశం తర్వాత సన్నివేశం చిత్రాల్లా కదిలిపోతుంటాయి. కయ్య-కాలువ, రిక్షావాలా, బిళ్ళల మొలతాడు, టార్చిలైటు వంటివి వీరి కథల్లో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.      కరుణకుమార లోకంలో చూసిన ప్రతి సన్నివేశాన్ని, సంఘటనను వదలకుండా కథల్లో బిగించాడేమో అనిపిస్తుంది. పట్టణాలకు వచ్చినా పల్లెటూరి ఆచారాలను వదలలేని మనుషులు, చిన్నచిన్న బస్తీల్లో జనాలు పడే అగచాట్లు, ఆకలి కేకలు వీరి కథల్లో ప్రధానంగా కనిపిస్తాయి. అందుకే వస్తు వైవిధ్యం ఉన్న ప్రపంచం వీరి కథాలోకం.      వీరి కథ్లలో ఎక్కువ నెల్లూరు జిల్లా పదాలు కనిపిస్తాయి. అక్కడి ప్రజల్లోని సొగసైన మాండలిక పదాలను సాహిత్యం పీఠం ఎక్కించిన ఘనులీయన. ఎగ్గు, ఎడపిల్ల, బదనాయం, ఆమైన... లాంటి పదాలు ఎన్నో కనిపిస్తాయి.         'బిళ్ళలమొలతాడు' కథలో ధనవంతురాలైన లక్ష్మమ్మకు కొడుకు రామిరెడ్డి, పాలేరు సుబ్బడు రెండు కళ్లు. అయితే రామిరెడ్డి కన్ను సుబ్బడి భారపై పడుతుంది. ఆమెను లొంగదీసుకోడానికి ప్రయత్నిస్తాడు. కుదరదు. కోపంతో సుబ్బడిపై బిళ్ళలమొలతాడు దొంగలించాడనే నేరాన్ని మోపి కోర్టుకీడుస్తాడు. లక్ష్మమ్మ మాత్రం కోర్టులో సాక్ష్యం చెప్పి సుబ్బడిని రక్షిస్తుంది. కోర్టు నుంచి నేరుగా యానాదిగూడెం సుబ్బడి ఇంటికి వెళ్తుంది. ఇలా మానవీయతకు విలువ ఇచ్చే పాత్రలు కురుణకుమార కథల్లో ఎక్కువగానే కనిపిస్తారు.        'రిక్షావాలా' కథలో రిక్షావాళ్ల దయనీయ పరిస్థితులనే కాకుండా తెలుగువారి సంస్కృతికి అద్దంపట్టే సంక్రాంతి పండుగ విశేషాలు వర్ణించారు. భోగి, పెద్ద పండుగ, కనుమ నుంచి పిల్లలు తల స్నానాలు చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, భోగిమమంటలు... పిండి వంటలు గురించి... లడ్డు, మిఠాయి, బొబ్బట్లు, పెరుగువడలు, అరిసెలు, దధ్యోదనం, చక్రపొంగలి... ఇవే కాకుండా పప్పు, ఆవకాయ, గొంగూర, క్షీరాన్నం... ఇలా తెలుగువారి సంపూర్ణ భోజనాన్ని వివరించారు కరుణ కుమార. డిసెంబర్ 1956లో కథా ప్రపంచాన్ని, తెలుగునేలను వదిలి వెళ్లిపోయారు.          అయితే, గుర్తుంచుకొని చదవాల్సిన కథా రచయిత కరుణకుమార అని చెప్పడం అతిశయోక్తి కాదు. వారి కథల్లో మారిన, మారుతున్న సమాజం మనకు దర్శనం ఇస్తుంది. అందుకే తెలుగు కథా ప్రపంచంలో కరుణకుమార స్థానం ఎప్పటికే పదిలమే...

అత్తగారు - కట్టుడు పళ్లు

అత్తగారు - కట్టుడు పళ్లు - భానుమతీ రామకృష్ణ                    సున్నితమైన హాస్యం, అలంకారమైన భాషతో అలరిస్తాయి భానుమతీ రామకృష్ణ రాసిన 'అత్తగారి కథలు'. తెలుగు ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాల్లోని సూక్ష్మ అంశాలను కూడా పాఠకునికి అందిస్తాయి. నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, రచయితగా గుర్తింపు పొందిన భానుమతి బహుముఖ ప్రజ్ఞకు 'అత్తగారి కథలు' మరో తార్కాణం.          'అత్తగారి కథల్లో'ని ఓ మంచికథే 'అత్తగారు - కట్టుడు పళ్లు' కథ ఉత్తమ పురుషలో నడుస్తూంది. రచయిత్రి మన పక్కనే కూర్చొని చెప్తున్నట్లు, దృశ్యాన్ని చూపిస్తున్నట్లు ఉంటుందీ కథ.         అత్తగారికి 76వ జన్మదినోత్సవం సందర్భంగా వంటయ్యరు పాయసం, వడలు, చేగోడీలు, మురుకులూ... వండుతాడు. వాటన్నిటిని చూసిన అత్తగారికి తినాలనే కోరిక ఎక్కువైనా, పళ్లు లేకపోవడం వల్ల ఏమీ తినలేక పోతున్నానని అర్థమవుతుంది. అంతలో అత్తగారి బాల్య స్నేహితురాలు అఖిలాండమ్మ పదహారేళ్ల పిల్లకుండే పలువరసతో నవ్వుకుంటూ వస్తుంది. ఆమె కట్టుడు పళ్ల వ్యవహారం తెలుసుకున్న అత్తగారు తనూ కట్టించుకుంటుంది. అయితే పిసినారితనంతో పంటికి పదిరూపాయలు ఖర్చు అవుతుందని లెక్కకట్టి పద్నాలుగు పళ్లు మాత్రమే కట్టించుకుంటుంది. పద్దెనిమిది పళ్లకు కలిసి 180 రూపాయలు మిగుల్చుకుంటుంది.        ఇక ఆ కట్టుడు పళ్లతో ఆమె తంటాలు మొదలవుతాయి. పని మనిషిని కోపంతో అరుస్తూ కంగారులో ఆ పళ్లను బావిలో పడేసు కుంటుంది. మళ్లీ కట్టించుకుంటే డబ్బులు ఖర్చుఅవుతాయని పనిమనిషి ద్వారా ముగ్గురు మగాళ్లతో బావిలో వెతికిస్తుంది. పళ్లు దొరక్కపోగా వాళ్లు మట్టి పూడిక తీస్తారు. యూబై రూపాయలు కూలీ పట్టుకుపోతారు.      అయితే తెల్లారి పేపర్లో వాళ్లు దొంగలని, పోలీసులు పట్టుకున్నారని, చాలామంది అలానే గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారని వార్త వస్తుంది. దాంతో అత్తగారు భయపడిపోతుంది. పనిమనిషి మీద కేకలేస్తుంది. ఇంట్లో పనివాడు అయ్యప్ప స్వామి మాల వేసి గడ్డం పెంచుకుంటే వాడిని గడ్డం తీయమని అరుస్తుంది.  వంటవాడు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొక్కుతో గడ్డం పెచుకున్నానన్నా వినకుండా గడ్డం తీయించుకోమంటుంది. ఇలా నానా అల్లరి చేస్తూ అందరినీ ముప్పతిప్పులు పెడుతుంది.        ఒకరోజు పనివాడు, వంటవాడు రాత్రి పూజకు వెళ్లి వస్తుంటే గడ్డాలు పెరిగి ఉండడంతో పోలీసులు పట్టుకుంటారు. అడ్రస్ చెప్తే వీళ్ల ఇంటికి తీసుకొస్తారు. పోలీసులు అడిగితే ఈ గడ్డం పెంచుకున్న వాళ్లు మాకు తెలియదని అత్తగారు చెప్తుంది. అప్పడే కారు డ్రైవర్ సింగ్ వచ్చినా అతనూ మాకు తెలియదని చెప్తుంది. వాళ్ల ముగ్గురూ ఎంత మొత్తుకున్నా గడ్డం పెంచుకున్న వాళ్లు ఎవరూ మాకు తెలియదని గట్టిగా చెప్తుంది. అంతలో కొడుకు సింగ్ ను పిలవగానే ముగ్గురూ పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి పోతారు. అత్తగారి ముఖం పాలిపోతుంది.       పనిమనిషి పరుగెత్తుకుంటూ వచ్చి 'అమ్మగారూ మీ పళ్లు పూడిక తీసిన మట్టిలో కనిపించాయని' చెప్తుంది. దాంతో వంటవాడితో, పనివాడితో 'నా పళ్లు దొరికాయని' సంతోషంతో కేకలేస్తూ చెప్తుంది. అప్పుడు వాళ్లు 'మా పెద్దమ్మ గారికి పళ్లులేవు.  నువ్వెవరో మాకు తెలియదు' అని ఆటపట్టిస్తారు.        ఇలా కథంతా నవ్వులతో నిండిపోతుంది. అత్తగారి నిర్వాహకాలు, పెద్ద వయసుతో వచ్చిన చాదస్తాలు.. కథలో మనల్ని మంత్రముగ్థుల్ని చేస్తాయి. 'ఒకదానికొకటి సంబంధం లేకుండా.... పాడుబడ్డ దేవాలయ స్తంభాల్లా ఆడుతుంటాయి.' 'పన్ను ఒకటి కుతుబ్ మీనారంత పొడుగ్గా...' 'పంటికి పది రూపాయలు పెడుతున్నాం గనుక కాస్త వెడల్పాటి పళ్లు కట్టించుకుంటే సగం చోటు కలిసొస్తుంది...' ఇలా... చతురోక్తులు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అందుకే అత్తగారి కథలు మన తెలుగింటి ఆణిముత్యాలు.                                                 డా. ఎ. రవీంద్రబాబు.     

వికసిత

  వికసిత...!!!  (కవిత)                                                                     - డా. ఎ. రవీంద్రబాబు   ఏ అభౌతిక చలనాల్లోనో... మౌనానికి అందని తర్కంలో... సృష్టి, స్థితి, లయలకు పూర్వమే నీవు నాకు తెలుసు. మనదిద్దరం బాగా పరిచయం. అందుకే... నీకోసం ఇప్పటికీ అన్వేషిస్తూనే ఉన్నాను. కాలం పొలిమేరకు దూరంగా నీ జ్ఞాపకాల గుర్తులు చెదిరిపోకుండా నిలిచే ఉన్నాయి. అవి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సరే,  నీ గురించి నీకు కొన్ని విషయాలు చెప్తా... విను.        ఉషోదయ కిరణాల మేలి ముసుగు తొలగించుకుని... మైథునానికి గుర్తుగా, గమ్మత్తుగా ఈ లోకం ఒడిలోకి జారిపడ్డావు ప్రియతమా... తొలకరి జల్లులు, నును వెచ్చని మంచు మత్తు స్పర్శలు నిన్ను లాలించాయి. పూజించాయి. పూలవానలు దోసిళ్లతో నిన్ను ముంచెత్తాయి. నీవు ప్రకృతి కన్నెవి. విరిబోణివి. సప్త స్వర గమకాల ప్రకృతి సంగీత సంగమానివి. లే లేత పొత్తిళ్ల నుంచి.. బుడిబుడి అడుగుల బోసి నవ్వుల నుంచి పాపవై, విరిసిన శ్రీ చంద్రికవై గతాన్ని తెంచుకుని... భవిష్యత్తును పుంజుకుని వర్తమానం వైపు పరుగెత్తావు. కాలం నీకు వయసును అరువిచ్చింది. సహజత్వం నీకు అందాల్ని అమర్చింది. యవ్వనం పొంగై, లేలేత సొగసై అమాయకత్వపు శరీరానికి ఆకృతి నిచ్చింది. నీ ప్రతి కదలిక ఓ అచ్చతెలుగు వాక్యమై గారాలు పోయింది. నీ చూపుల విరి కాంతుల్లో కోటి ప్రభాతాలు విచ్చుకున్నాయి. నక్షత్రాలు సైతం నీ లే నవ్వులో తలమునకలయ్యాయి. అసలు... ప్రకృతిలోని ప్రతి సుందరాకృతి నీ మేనిపై విరిగి తమకంతో స్వాంతన పొందలేక తపించింది.       అప్పుడిక క్షణాలు కాలాన్ని ఔపోసన పట్టేశాయి. ఏ గంధర్వడో పురుషుడై నిన్ను సమీపించాడు. పంచేంద్రియాలు మనసు బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాయి. తేలియాడే నీ కాంక్షా నురగల మధ్య కడలి కూడా బద్దలైంది. నీ తనువు, మనసు వ్రక్కలై మూర్ఛనులు పోయింది. కన్నీళ్లు గతాన్ని, వర్తమానాన్ని స్మరిస్తూనే ఉన్నాయి. భవిష్యత్తును శపిస్తూనే ఉన్నాయి. కాలం జ్ఞాపకాల పీడకల కాదు. ఓ అన్వేషణా శకలం మాత్రమే.. తపస్సు ఇంకా ముగియలేదు. వెదుకులాట కన్నులపై తేలియాడుతూనే ఉంది. అసలు ప్రకృతే ఓ వింత చర్యల ఢముకర నాదం. నీకు నీవు కాదు... నీ లాంటి వాళ్లెందరికో... ఓ స్వాప్నిక చర్యవు మాత్రమే...        రుజువులు, వాస్తవాలు అమానుషం. నిన్ను నీవు కంచెగా కాదు. ప్రాకృతిక వైభవంగా మలచుకోవాలి. ఎందుకంటే... వెదుకులాట వెన్నంటే చర్య. కాలం మధ్య నిలబడి విరబోసిన సౌందర్య కురుల్లో  చారికలు చెక్కిలపై తలవంచకూడదు. ఎందుకంటే... మా వెదుకులాట ముగియలేదు. అసలు మొదటి అక్షరం కూడా రాయలేదు... ఓం కారం పురుడు పోసుకోలేదు.       ఇంకా గడ్డిపూల తివాచీ మీద నీ అడుగుల గుర్తుల్ని ఏరుకుంటున్నాం. ఊగే పూలకొమ్మ నుంచి ఏ చివురుల్లోనో నీ జ్ఞాపకమై పలకరిస్తుందిని ఆశగా ఎదురు చూస్తున్నాం. ఓ ప్రాకృతిక సౌందర్యమా... నీవు ఎప్పటికీ అభౌతిక రూపానివే... ఆది, అంతం లేని మానవీయ స్పర్శవే... మనసు పొరల్లో దాగిన లయాత్మక నాదానివే... నా... దానివే...వే... వే...                  అంతం కాని అన్వేషణలోంచి కొన్ని క్షణాలకు అక్షరాల ఆకృతులు మాత్రమే                                                                 ... ఇవి...

నండూరి ఎంకి

  నండూరి ఎంకి - డా. ఎ. రవీంద్రబాబు తెలుగువారి ఆడపడుచు ఎంకి, స్వచ్ఛమైన జానపద పిల్ల ఎంకి, కల్లాకపటం తెలియని పల్లెటూరి అమ్మాయి ఎంకి. కావ్యనాయికల మధ్య పుష్పించిన అడవి మల్లె ఎంకి. చిలిపితనంతో అందరి మనసులు దోచుకున్న జవ్వని ఎంకి. అందుకే తెలుగు సాహిత్యంలోనే ఎంకి వంటి పిల్ల లేదు. ఇక ఉండబోదు. అసలు ఈ ఎంకిని సృష్టించి, తెలుగు వారి గుండెలపై చిత్రించింది నండూరి సుబ్బారావు.         నండూరి సుబ్బారావు 1985లో పశ్చిమ గోదావరి జిల్లాలోని వసంతవాడలో జన్మించారు. ప్రముఖ బావకవి బసవరాజు అప్పారావుకు దగ్గర బంధువు. నండూరి సుబ్బారావు ఏలూరులో మాధ్యమిక విద్యను చదువుకున్నారు. కాకినాడ కళాశాలలో చేరి మధ్యలోనే కళాశాల విద్యకు స్వస్తి పలికారు. ఆ తర్వాత మద్రాసు (చెన్నై) వెళ్లి క్రిస్టియన్ కాలేజ్ లో ఎఫ్.ఎ. చదివారు. ఆ పై బి.ఎ., బి.ఎల్. పూర్తిచేసి న్యాయవాదిగా స్థిరపడ్డారు. కానీ చివరి రోజు వరకు కవిత్వాన్ని మాత్రం వదల్లేదు.         సుబ్బారావు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదువుకునే రోజుల్లో ఒకసారి ట్రాంబండిలో ఇంటికి వెళ్తుంటే "గుండె గొంతుకలోన కొట్లాడుతాది" అనే పల్లవి మనసులో రూపుదిద్దుకొన్నదట. ఆ ఆలోచనతోనే ఇంటికి వచ్చేసరికి పాట పూర్తి అయ్యిందట. ఎంకిపాటల్ని ఎక్కువభాగం సుబ్బారావు చదువుకునే రోజుల్లోనే రాశారు. (1917-18) కొంత మంది మిత్రులు ప్రోత్సహిస్తే, మరికొంత మంది ఇది వాడుక భాష కాదు, దీనిలో రచన కొనసాగించడం కష్టం అన్నారట. అయినా నండూరి సుబ్బారావు ఆ భాషలోనే పాటలు రాసి తన సాహిత్య ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ పాటల్లో గోదావరి, విశాఖ జిల్లాలలోని గ్రామీణభాష సుందరంగా కనిపిస్తుంది.      1925లో "ఎంకిపాటలు" మొదటి సంపుటి విడుదలైంది. అంతే తెలుగు నేలపై ఎంకి దుమారం రేగింది. ఆ కాలంలో ప్రముఖులైన కవులు, రచయితలు, విమర్శకులు, ఎంకిపాటలను పాడుకున్నవారే. కొంతమంది పొగిడారు. మరికొంత మంది తెగిడారు. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, చలం లాంటి వారు ఈ పాటలను భుజానికెత్తుకున్నారు. ఇక ఆకాశవాణి అయితే వీటికి బహుళ ప్రచారం కల్పించింది. ఆ రోజుల్లో ప్రతి సాహితీ సభలోనూ ఎంకిపాట ప్రవాహమై పారింది. బసవరాజు అప్పారావు స్వయంగా ఎంకిపాటలకు బొమ్మలు గీశాడు. తర్వాత కళాభాస్కర్ కూడా... మొది సారిగా పారుపల్లి రామకృష్ణ ఈ పాటలకు బాణీలు కట్టారు. నేడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ఎంకిపాటలు లభ్యమవుతున్నాయి.        సుమారు 27 సంవత్సరాల తర్వాత నండూరి సుబ్బారావు పాతపాటలకు మరికొన్ని కొత్తపాటలు చేర్చి రెండో సంపుటిని తీసుకొచ్చారు. మొత్తం ఎంకిపాటలు 31. వీటిలో ఎంకి, నాయుడుబావలు ముఖ్య పాత్రలు. వారి మధ్య ఉన్న ప్రేమ, ఆకర్షణ, అనుభవాలు, అనుభూతులు, ఊహలు, విరహాలు, వినోదాలు, వారి వలపు, తలపు, దాంపత్య జీవితపు మధురిమలు, వేదనలు, వారుచేసే తీర్థయాత్రలు... ... ఇలా ఎన్నో ఆ పాటల్లో దొర్లిపోతుంటాయి. ప్రణయభావాలకు, పదాల పొందికకు కొత్త చిగుళ్ళు తొడిగాయి ఈ పాటలు.       ఎంకి పల్లెపడుచు. జానపద సౌందర్యం ఆమెది. అందుకే నండూరి సుబ్బారావు ఎంకిని ఇలా సృష్టిించారు.-    "యెంకి వంటిపిల్లలేదోయి లేదోయి    మెళ్లో పూసల పేరు    తల్లో పూవుల పేరు    కళ్లెత్తితే సాలు    కనకాభిసేకాలు    రాసోరింటికైనా   రంగుతెచ్చే పిల్ల   పదమూ పాడిందంటె    కతలు సెప్పిందంటె    కలకాలముండాలి   అంసల్లె, బొమ్మల్లె  అందాల బరిణల్లె  సుక్కల్లె నాయెంకి"          అందుకే తెలుగుపస, తెలుగునుడి, తెలుగునాదం, తెలుగురుచి... తెలుసుకునేలా ఎంకిపాటలు సాగుతాయి.     ఎంకి అమాయకపు పిల్ల, అల్లరిపిల్ల, నటన చేతకాని నవ జవ్వని, అందుకే నాయుడుబావ ఇలా అంటాడు.      "నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది       యెల్లి మాటాడిస్తే యిసిరి కొడతాది"    కానీ ఎంకికి నాయుడుబావంటే వల్లమాలిని ప్రేమ. అతడ్ని విడిచి ఒక్కనిముషం కూడా ఉండలేదు. విరహాన్ని భరించలేదు. అతడిని వెతుక్కుంటూ వెళ్తుంది.    "జాము రాతిరి యేళ జడుపూ గిడుపూ మాని     సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే     మెల్లగా వస్తాది నా యెంకి     సల్లంగా వస్తాది నాయెంకి"- అంటాడు నాయుడుబావ.         వాళ్లిద్దరికీ ప్రకృతే నేస్తం. పల్లె ప్రణయ స్థలం. తిరుపతి, భద్రాద్రి వెళ్తారు. పుణ్యస్నానాలు చేస్తారు. వారి సంగమం అంతః నేత్రానికి అందే మనోచర్య. వాళ్ల ప్రేమకు నమ్మకం మాత్రమే పునాది. అందుకే నాయుడుబావ "యెఱ్ఱి నాయెంకి", "సత్తెకాలపు యెంకి" అంటాడు. ఎంకి నాయుడుబావతో ఎకసెక్కాలాడుతుంది. ఆటపట్టిస్తుంది.     "యెంకి రాలేదని యెటో సూత్తావుంటే     యెనకాలుగా వచ్చి యెవరునోరంటాది.     యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు     యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు"- అంటాడు నాయుడుబావ        ఎంకిని కూడా ఆటపట్టించడమంటే నాయుడుబావకూ సరదానే. అప్పుడు కోపంతో వుడుక్కునే ఎంకిని చూస్తూ తెగ ఆనందపడిపోతాడు.      "గోడ సాటున యెంకి గుటక వేసే యేళ      సూడాలి నా యెంకి సూపులా యేళ      సూడాలి నా యెంకి సోద్దెమా యేళ" - అంటాడు.     అందుకే తెలుగువారి ఎంకి స్నిగ్ధ. స్వచ్ఛమైన ప్రణయిని. అంతేకాదు     "రాసోరింటికైన    రంగుతెచ్చేపిల్ల    నా సొమ్ము- నా గుండె    నమిలి మింగిన పిల్ల"- అని తనలో ఒక భాగమై పోయిన ఎంకి గురించి చెప్తాడు నాయుడుబావ.      ఊహ, వాస్తవం, అందం, ఆనందం, కళ, కల... అన్ని కలబోసిన అడవి మల్లె ఎంకి. శబ్దం, నాదం కలిసిన పాట ఎంకి.      నండూరి సుబ్బారావు ఊహాజనితమైన ప్రేమభావనలో మునిగి, ఆమె చూపు, మాట, పాట, కట్టు-బొట్టు, సాన్నిధ్యం, ఎడబాటు... అన్నింటిని ఆకల్పనలోనే అనుభవించాడు. వాటికి భాష కూర్చాడు. వాటిలో మనందరిని ముంచెత్తేడు.      "యెనక జన్మములోన యెవరిమోనంటి      సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి     ముందు మనకే జల్మముందోలె యంటి     తెలతెల్ల బోయింది పిల్ల నా యెంకి     యెన్నాళ్లొ మనకోలె యీ సుకములంటి    కంటనీరెట్టింది జంట నా యెంకి." -  అని వారి జన్మజన్మల సంబంధాన్ని పాటలో మనకందించాడు నండూరి. అందుకే పంచాగ్నుల ఆదినారాయణ ఎంకి, నాయుడుబావలను రతీమన్మథులతో పోల్చాడు. పురాణం సూరిశాస్త్రి జీవాత్మ-పరమాత్మలతో పోల్చాడు.      నండూరి సుబ్బారావు ఎంకి పాటలు సృష్టించి 85 ఏళ్లు దాటిపోయాయి. అయినా ఇప్పటికీ ఎంకి వయసు ఇరవై ఏళ్లే. ఎన్నెల్లాంటి ఎంకి ఎప్పటికీ నిండు పున్నమే.    "యెలుతురంతా మేసి యేరు నెమరేసింది"    "యెన్నెలల సొగసంత యేటి పాలెనటర"- లాంటి సౌందర్యాభివ్యక్తులు మన మనసుల్ని అద్భుతంగా ఆకర్షిస్తాయి. ఎంకిని అక్కున చేర్చుకోమంటాయి.   

డు.ము.వు.లు.

 డు.ము.వు.లు. - మల్లాది రామకృష్ణశాస్త్రి.                  మల్లాది రామకృష్ణశాస్త్రికి సనీకవిగా ఎంత పేరుందో, కథా రచయిగా అంతకు మించిన పేరుంది. పాటల్లో ఏ విధంగా లయ బద్ధమైన పదాల్ని పొదిగారో... కథల్లోనూ అలాంటి అందమైన వచనాన్నే రాశారు. తెలుగు సంప్రదాయాలు, జాతీయాలతో వేసవి కాలంలోని మామిడి కాయంత తీయగా ఉంటాయి మల్లాది కథలు.  వీరి కథలు ప్రారంభం, ముగింపు, సంభాషణలు సంక్రమమైన పద్ధతిలో అమరి ఉత్కంఠను కలిగిస్తూ సాగుతాయి . ఇందుకు ఓ మంచి ఉదాహరణ డు.ము.వు.లు. కథ.           ఈ కథ తెలుగులో మహాభారత రచనాకాలం నాటిది. అంతేకాదు దీనిలోని విషయం కూడా మహాభారతంలోని 15 పర్వాల్ని తెనిగించిన తిక్కన, వారి తండ్రి కొమ్మనది. కథలోకి ప్రవేశిస్తే- కొమ్మన స్వయంగా మేనమామ కూతుర్ని వివాహం చేసుకుంటాడు. కానీ పెళ్లిలోనే లాంచనాల దగ్గర వీరి తల్లిదండ్రులకు, అత్తమామలకు చెడుతుంది. రాకపోకలే కాదు, మళ్లు తోరణం నుండి మాటలు కూడా ఉండవు. అయితే కొమ్మన మమగారు గర్భాధానానికి ముహూర్తం నిర్ణయించి కొమ్మన తండ్రిగారికి లేఖద్వారా కబురు పంపుతాడు. కొమ్మన తండ్రి ఈ విషయాన్ని ఊళ్లో అందరికి చెప్పి కొడుకు కొమ్మనకు చెప్పడు. కానీ కొమ్మన తన తాత గురునాథం ద్వారా తనమామగారు పంపిన కబురు గురించి తెలుసుకుంటాడు. హిందూ స్త్రీల గొప్పతనం తెలుసుకుంటాడు. తన తండ్రి చేసిన తప్పునూ తెలుసుకుంటాడు.  కట్టుబట్టలతో మామగారింటికి బయలుదేరుతాడు. దారిలో తండ్రి కనిపించినా, అతని మాట లెక్కచేయకుండా తన భార్య దగ్గరకు వెళ్లడానికే సిద్ధమవుతాడు.                 కానీ దారిలో పెద్ద వెల్లువ అడ్డువస్తుంది. కొమ్మన ఆ వెల్లువలోకి దూకి ఈదుతాడు. మధ్యలో మట్టి బాన దొరకడంతో, దాని సాయంతో ఓ గట్టుకు చేరుకుంటాడు. అక్కడ తడిబట్టలతో ఒక కన్నెపిల్ల కనిపిస్తుంది. మాటమాట కలుస్తుంది. మనసు మనసు దగ్గరవుతాయి. దాంతో ఆ రాత్రి వారిద్దరూ ఒకటవుతారు. తెల్లవారాక ఆ పిల్లని తనతో రమ్మని కొమ్మన పిలిస్తే ఆమె రానంటుంది. కొమ్మన గుర్తుగా ఉంగరం తీసుకొని, కొడుకు పుడితే గురునాథా అని పేరుపెట్టి, నీ దగ్గరకు పంపుతాను అని చెప్పి, ఏటిలో దూకి వెళ్లిపోతుంది.     తర్వాత కొమ్మన మామగారింటికి వెళ్తాడు. అక్కడే కొడుకు తిక్కన పుడతాడు. మనవడు పుట్టడంతో కొమ్మన తండ్రి చూడ్డానికి వెళ్తాడు. దాంతో అందరూ కలిసిపోతారు. తిక్కన పెరిగి పెద్దవాడై మహాభారత రచనకు పూనుకుంటాడు.     ఒకరోజు కొమ్మన సభలో కొలువుతీరి ఉండగా ఒక వ్యక్తి వచ్చి నమస్కరించి, ఉంగారాన్ని చూపుతాడు. కొమ్మనకు గతం గుర్తుకు వస్తుంది. కొడుకని తెలుసుకొని 'గురునాథా' అని పిలిచి, కౌగిలించుకుంటాడు. అంతలో తిక్కన వస్తాడు. గురునాథుడి బాష చూసి "ఏమిటీ పాడు భాష?" అని కోపగించకుంటాడు. అప్పుడు గురునాథుడు తండ్రికి నమస్కరించి-        "యీ బాస,తవురి బాస నేనూ సదివినా- పొలంలో వోళ్లు పుట్రలో వోళ్లు- యీడికి యెర్రెక్కిందన్నారు. కూడదనుకుని యిడిసినా- ఆడూ యీడూ పలికే పలుకే పలుకునే - పాట కట్టినా- పదం కట్టినా- పదం పాటా- చేలో ఆవులన్నీ ఆలకిస్తయి- గొర్రెపిల్లలు కోలెస్తాయి- లేగలన్నీ సిందేస్తాయ్-... ....      ఒక్కరి కూటికీ గుడ్డకూ అక్కరకొచ్చేది మీ బాస- మందిలో పడేది మా బాస-" అని చెప్పి వెళ్లిపోతాడు.    తిక్కన కొమ్మన ద్వారా, అతను తన అన్న అని తెలుసుకుంటాడు. తన గర్వాన్ని తెలుసుకుంటాడు. తండ్రితో-  "నాన్నగారూ, భారత రచనకు ఫలం ఏమిటో నాకిప్పుడు అవగతమైంది. నేను వ్యాసభగవానుడికి వంకలు దిద్ది, మెరుగులు పెట్టగల మేధావిని కాదు. నా అహంకారం నశించడానికి- దైవం యీ రూపున వచ్చాడను కుంటాను.... ....  అన్నా కవే- నేనూ కవినేనా...?" అని ఆత్మ పరిశీలన చేసుకుంటాడు... మహాభారత సంహిత పూర్తయ్యాక గంటం ముట్టనని శబథం చేస్తాడు. ఇలా కథ ముగుస్తుంది.              మాట్లాడేభాష గొప్పతాన్ని చెప్పిన ఈ కథ, మనిషి నిగర్విగా ఉండాలన్న సందేశాన్ని కూడా ఇస్తుంది. చిన్నచిన్న మలుపులతో చదివే వాళ్లలో నూతన ఆలోచనల్ని రేకెత్తిస్తుంది.           కన్నెపిల్లకు, కొమ్మనకు మధ్య జరిగే సంభాషణలో-    "కొట్టుకొచ్చారా అయ్యా" అని కన్నెపిల్ల అడిగితే-    "లేదు- బాన పట్టుక వచ్చాను.. "అంటాడు కొమ్మన.   ఇలాంటి గమ్మతైన చమత్కారాలు కథలో మనల్ని ఆకర్షిస్తాయి. తాత గురునాథుడికి, మనుమడు కొమ్మనకు మధ్య జరిగే చర్చలో భార్యాభర్తల సంబంధాన్ని, కుటుంబ బాంధవ్యాల్ని గొప్పగా వివరిస్తుంది ఈ కథ. తెలుగు విభక్తులనే శీర్షికగా పెట్టిన మల్లాది రామకృష్ణశాస్త్రి "కంపా గట్రా, ఎగసన ద్రోయడం, ముణగానాం- తేలానాంగా ఉంది, నరంలేని మడిసి... ... " లాంటి ఎన్నో నుడికారాలను బంగారంలో వజ్రాల్లా పొదిగారు. అందుకే ఈ కథ ప్రతి ఒక్కరూ చదవాల్సిందే... ఆవు పాలలాంటి మల్లాది స్వచ్ఛమైన శైలికి అనుభూతి చెందాల్సిందే...                                                      - డా. ఎ. రవీంద్రబాబు.

నడకల నాణ్యత

నడకల నాణ్యత - స్వప్న కంఠంనేని ఇక మనుషుల నడకల విషయానికి వద్దాము. ఒక మనిషి నడిచే తీరు ఆ వ్యక్తి దృక్పధాన్ని, అంతకు మునుపు జీవితంలో అతను చవిచూసిన వొడిదుడుకుల్ని తెలియచేస్తూ అతడి క్యారెక్టర్ నీ వెలి జూపుతుంది. ఒక అమ్మాయి తను ప్రేమించే లేక ప్రెమించాలనుకుంటున్న యువకుడితో షికారుకు వెళ్ళిందనుకుందాము. ఆ సమయంలో అతడు నడిచే పద్ధతిని బట్టి ఆమె అతడి మనస్తత్వాన్ని తెలుసుకుని తనాతనితో మరింత ముందుకు వేళ్ళలో వద్దో నన్న విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చు. ఆమె కంటే నిదానంగా నడిస్తే ఒక యువకుడు తను ప్రేమించే అమ్మాయి కంటే గబగబా ముందుగాని ఆమెకంటే నెమ్మదిగా గాని నడుస్తున్నడనుకోండి. అతడు ఆమె అవసరాల్ని పట్టించుకోని వాడని అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆమె మీద తన ఆధిక్యాన్ని, కంట్రోల్ నీ ప్రదర్శించ జుస్తున్నాడని అనుకోవచ్చు. ఇంకా అతనితో పెళ్ళికాక, సంబంధమేమీ శృతి మించకపోతే ఆ అమ్మాయి అతనితో ' నాయనా నీకో నమస్కారం! అని చెప్పేయటం ఉత్తమం. గుళ్ళు బిగబట్టి నడిస్తే తల వేలాడేసి గూళ్లు బిగబట్టి ఎంతో బరువును మోస్తున్నట్లు నడిచే యువకుడు జీవితంలో నిరాశా నిస్పృహలను చవిచూసిన వాడని ఆర్ధం చేసుకోవాలి. జీవితం పట్ల అతనికుండే నెగటివ్ దృక్పధం అతడిలో జీవితం పంచుకోవాలనుకునే స్త్రీనీ చికాకు పరిచే అవకాశం ఉంది. అయితే ఆమె కూడా అతనిలాగే బరువు బాధ్యతల్ని మోస్తున్న స్త్రీ అయితే అతనామెకు సరి జోడి! టెంపరమెంట్ తో, తలతిక్కగా ప్రవర్తించే యువకుల కంటే ఇతను ఉత్తమం! తాను ప్రేమించే స్త్రీలోని సహనసౌశిల్యాలను ప్రశంసిస్తాడితను. ఆమె మీద ఆధారపడి ఉండటానికి ఇష్టపడతాడు. జేబుల్లో చేతులు పెట్టుకొని కొందరు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుస్తుంటారు. ఇది ఒకప్పుడు స్టైల్ గా కనిపించినా వాస్తవానికి ఇలా జేబుల్లో చేతులు పెట్టుకుని నడవటం తన అతిముఖ్యమైన జననేoద్రియ భాగాల్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం. తన భావాల్ని తనలోనే దాచుకునే మనిషి అయి ఉంటాడితడు. ఇతరుల మనస్సుల్ని స్పృశించటానికి  వాళ్ళ భావాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడితను. ఇతడితో జీవితాన్ని పంచుకోవాలనుకునే స్త్రీ ముందుగా తన గురించి అతనికి నమ్మకం కలిగించటానికి  చాలా పాట్లు పడాల్సి ఉంటుంది. పిడికిళ్లు బిగించి నలుగురిలో నిలబడి ఉన్నప్పుడు గాని నడుస్తున్నప్పుడు గాని కొందరి పిడికిళ్లు గట్టిగ బిగుసుకుని ఉంటాయి. ఇలాంటి మనిషి నెర్వస్ మనిషి అని లోకం మీద ఎంతో కక్ష ఉన్నవాడని అర్ధం చేసుకోవాలి. ఇతడు తనలోని నిరాశా నిస్పృహల్న, తన బరువు బాధ్యతల్ని తనతో జీవితం పంచుకొనే స్త్రీ మీద మోపే ప్రమాదం ఉంది. కాబట్టి అమ్మాయిలు ఒకటికి రెండు సార్లు ఇతని గురించి పునరాలోచించటం మంచిది!  

దిద్దుబాటు

 దిద్దుబాటు    - గురజాడ అప్పారావు     సంఘాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో గురజాడ అప్పారావు రాసిన కథ 'దిద్దుబాటు'. ఆధునిక లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న తొలి కథానిక ఇదేనని కొందరి అభిప్రాయం. 'దిద్దుబాటు' 1910 ఫిబ్రవరిలో 'ఆంధ్ర భారతి' పత్రికలో ప్రచురింపబడింది. అప్పటి సమాజంలో వ్యభిచారం ఒక వృత్తిగా ఉండేది.  విద్యావంతులు, పై స్థాయిలో ఉన్నవారిలో వేశ్యలపట్ల వ్యామోహం ఎక్కువ ఉండేది. ఇప్పటికీ ఈ సమస్య సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. వేశ్యాలోలుడైన భర్తకు భార్య బుద్ది చెప్పడమే ఈ కథలోని ఇతివృత్తం. అందుకే గురజాడ దీనికి 'దిద్దుబాటు' అని పేరు పెట్టారు.       ఇక కథలోకి ప్రవేశిస్తే- కమలిని భర్త గోపాల్రావు. వేశ్యలపై మోజుతో, వారి ఆటపాటల్లో మునిగి రోజూ రాత్రి బాగా ఆలశ్యంగా ఇంటికి వస్తుంటాడు. భార్యకు మాత్రం లోకానికి ఉపాకారం చేస్తున్నానని అబద్దాలు చెప్తుంటాడు. కమలినికి అసలు విషయం తెలుస్తుంది. భర్తకు బుద్ధిచెప్పి మార్చుకోవాలను కుంటుంది. అందుకు ఓ నాటకమాడుతుంది.        రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన గోపాల్రావుకు భార్య కమలిని కనిపించదు. ఇల్లు, పడకగది అంతా వెదుకుతాడు. దీపం వెలిగించి మరీ వెదుకుతాడు. కానీ భార్య కనిపించదు. బుద్ది తక్కువ పనిచేశానని బాధపడతాడు. భార్య ఏమైందోనని పరిపరి విధాలా ఆలోచిస్తాడు. భార్య కనపడలేదన్న కోపంతో నౌకరి రావుడుపై చేయిచేసుకుంటాడు. వెంటనే తప్పుతెలుసుకుంటాడు.       బల్లపై భార్యరాసిన ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో- '..... నా వల్లే కదా మీరు అసత్యాలు పలుకవలసి వచ్చింది. మీ త్రోవకు నేను అడ్డుగా ఉండను. ఈ రేయి కన్న వారింటికి వెళ్తున్నాను.' అని రాసి ఉంటుంది.     దాంతో గోపాలరావుకు గొంతులో వెలక్కాయపడ్డట్టు అవుతుంది. విద్యావతి, గుణవతి అయిన భార్య తనకు తగిన శాస్తి చేసింది అని వ్యాకులత చెందుతాడు. నౌకరికి పది రూపాయలిచ్చి కమిలినిని బతిమిలాడి తీసుక రమ్మంటాడు. 'తప్పు తెలుసుకున్నాను, ఇక ఎప్పటికీ సానుల ఇంటికి వెళ్లను, రాత్రిళ్ళ యిల్లు కదలను, తను లేకపోతే వెఱ్ఱి ఎత్తినట్లు ఉంది' అని భార్యకు చెప్పమంటాడు.     ఇదంతా మంచం కిందనుంచి వింటున్న కమలిని తన భర్తలో వచ్చిన మార్పుకు సంతోషించి నవ్వుతూ బైటకు వస్తుంది. ఇలా కథ ముగుస్తుంది.     ఈ కథలో గురజాడ అప్పారావు మూడు విషయాలు చెప్పాడు. వేశ్యావృత్తిని నిరాకరించడం. 'శివుడు పార్వతికి సగం దేహం పంచి యిచ్చాడు కాదా, ఇంగ్లీషువాడు భార్యను బెటర్ హాఫ్ అంటాడు. అనగా పెళ్ళాం మొగుడి కన్నా దొడ్డది అన్నమాట.' అని రాస్తాడు. అంటే కుటుంబంలో భార్యాభర్తలు సమానం అని ఈ కథ ద్వారా ఆనాడే గురజాడ అప్పరావు చెప్పాడు . ఇక మూడో విషయం స్త్రీ విద్య- 'భగవంతుడి సృష్టిలో కల్లా ఉత్కృష్టమయిన వస్తువ విద్యనేర్చిన స్త్రీ రత్నమే....  నీ కూతుర్ని బడికి పంపుతున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతోంది.' అని స్త్రీ చైతన్యానికి విద్యే మూలమని రచయిత గుర్తించాడన్నామాట.     ఈ కధలో రావుడి పాత్రద్వారా సున్నితమైన హాస్యాన్ని సృష్టించాడు గురజాడ. పాత్రలకు తగిన భాషను వాడినా, కథారచనలో వ్యావహారిక భాషకు పట్టం కట్టాడు. ప్రారంభం, ముగింపు, నిర్వహణ లాంటి అన్నిటిలో నేటీ కథలకు ఏ మాత్రం తీసిపోదు ఈ కథ. 'ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రను తిరిగ రచిస్తారు ' అన్న ఆయన ఆశాభావం ఈ కథ నిండా కనిపిస్తుంది. కానీ అది ఇప్పటికీ నరవేరలేదు అన్నది నిజం.                                            - డా. ఎ. రవీంద్రబాబు               

ఫ్యాషను, నడక ఏం చెబుతాయి ?

ఫ్యాషను, నడక ఏం చెబుతాయి ? - స్వప్న కంఠంనేని మీరు ప్రేమిస్తున్న యంగ్ మేన్ ఒకసారి సోగ్గాడిగా కనిపించి, కనుముసినా తెరిచినా మీ ముందు అతడే ప్రత్యక్షమవుతూ, మరొక రోజు మాసిన గెడ్డంతో, నలిగిన దుస్తులతో కనిపిస్తే..!  చిరాకు పడతారా ? కలవార పడతారా ? అతణ్ణి ఎలా అర్ధం చేసుకోవాలన్న సందేహంలో పడితే.. ఇదుగో..ఈ అంశాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒకప్పుడు మగవాడు దుస్తులు పట్ల శ్రద్ద వహించి షోకిల్లా లా తయారైతే సమాజం అతణ్ణి కొంత చులకనగా చూసేది. కాని  నేడలా కాదు,రాను రాను సభ్య సమాజం ఆడవారి లాగే మగవాళ్ళు కూడా దుస్తుల పట్ల, శరీరాకృతి పట్ల శ్రద్ద వహించాలని కోరుకుంటోంది. ఈ విషయంలో ఏ పురుషుడన్నా నిర్లక్ష్యం వహించితే అతడి ఆలోచనలను సందేహించటము  జరుగుతుంది. దానా దీనా నేటి ఆధునిక పురుషుడు ఫ్యాషన్లకు సంబంధించి కొన్ని ఒత్తిడులకు లోనవుతున్నాడు. అయితే శతాబ్దాల తరబడి స్త్రీ పొందిన ఒత్తిడులతో పోల్చి చుస్తే ఇదేమంత లెక్కలోనికి రాదన్నది వేరే విషయం! ఇప్పుడు పురుషుడు ధరించే దుస్తుల ధోరణి అతడిలోని ' ప్రేమరావును ఏరకంగా బయటపెడుతుందో చూద్దాం. అతి ట్రిమ్ గా వుండే రాకేశుడు : ఒక యువకుడు మడత నలగని ఒక ఇస్త్రీ బట్టలతో ట్రిమ్ గా తయారవుతాడు. బయటికి రాబోయే ముందు సెంటు స్ప్రే చేసుకుంటాడు. ఒకటికి నాలుగు సార్లు అద్దంలో చూసుకుని ఆడదానికంటే మిన్నగా టక్నీ,మడతల్ని  సరిచేసుకుంటాడు. బయటకి వచ్చి తనకోసం ఎదురు చూస్తున్న స్నేహితురాల్ని ' హాయ్' అంటూ గ్రీట్ చేస్తాడు. * ఇతనేలాంటి ప్రేమికుడు కావచ్చు ? తనెలా కనిపిస్తూన్నడనే అంశం కోసం డబ్బుని,శ్రమని,సమయాన్ని,వెచ్చించ గలిగే పురుషుడు తను ప్రేమించే స్త్రీ కోసం కూడా ఈ మూడింటిని ఖర్చు చేయగలుగుతాడు. నీట్ నెస్ కోసం,తీర్చిదిద్దటం కోసం, అతనినిచ్చే ప్రాముఖ్యత మాట నిలబెట్టుకునే విషయంలో కూడా అతను అంతరాత్మ బద్దుడై ఉంటాడనే విషయాన్నీ తెలుపుతుంది.అయితే ఒకటి ,స్వయం సౌందర్యం కోసం అతను పడే అతి తాపత్రయం అతనికి సంబందించిన రెండు నెగిటివ్ విషయాలను కూడా తెలుపుతుంది. అతను ఇతరులతో సంబంధాల విషయంలో కూల్ గా యధాలాపంగా ఉండవచ్చు. ఫర్ఫెక్షన్ (పరిపూర్ణత) కోసం పడే అతి తాపత్రయం అతనికి తనమీద తనకున్న తక్కువ అభిప్రాయాన్ని , స్వయం విమర్శనా తత్వాన్ని తెలియజేస్తుంది.స్వయంసౌందర్య స్పృహ లో కొట్టుమిట్టాడే మనిషి తను ప్రేమించే అమ్మాయి విషయం లో కూడా అదే రకపు నీట్నెస్ ని ఆశిస్తాడు. ఆ విషయంలో ఆమె ఏన్నడన్నా ఏ కారణం చేతనైన బద్దకించితే ఆమెకు తన పట్ల  ప్రేమ తగ్గింది గావునని అనుకునే అవకాశం ఉంది. అంతే కాదు  ఆమె నుంచి ఎడంగా జరిగే ప్రమాదము ఉంది. ఫ్యాషన్స్ ని పట్టించుకోనివాడు : ఇతనేలాంటి ప్రేమికుడు మహాశయా ? ఇతనిది కొంచం టీనేజ్ మనస్తత్వం ! మూడీగా ఉండే విప్లవాత్మక తత్త్వం. బుద్దిపుట్టినప్పుడు తన పక్కన ఉన్న అమ్మాయిని నవ్వులు కేరింతలతో  ఆకాశ వీధిలో విహరింప జేస్తాడు. తిక్క పుట్టిందంటే ఆమెనసలు లెక్క జేయడు. ఆ అమ్మాయి అతగాడిని మార్చాలని ప్రయత్నించినా అతడి నుంచి ఏదన్నా కోర్కెను కోరినా ఇష్టంలేకపోతే టీనేజ్ కుర్రవాడిలా తీవ్ర చూపుల్తో  తిరస్కరిస్తాడు.    నిర్లక్ష్య నిరంజనుడు : మరో రకం యువకుడు ఉంటాడు. తను ప్రేమించే అమ్మాయితో షికార్లు కొడుతున్నప్పుడు ఒకసారి సన్నటి గడ్డంతో, పెళపెళలాడే అందాల దుస్తులతో సొగసు పురుషుడిలా కనిపిస్తే మరోసారి సరిగ్గా గడ్డం చేసుకోకుండా నలిగిన దుస్తులతో అప్పుడే నిద్ర లేచిన వాడిలా బద్ధకంగా బయల్దేరవచ్చు. ఇతడి గురించి అమ్మాయి ఏమనుకోవాలి? ఇతను కొంచెం స్వార్ధచిత్తుడు, ఎంత సేపూ అతనికి తన ఉద్వేగాలు, తన ఫీలింగ్స్ ముఖ్యమైనవిగా కనిపిస్తాయి గాని ఎదుటివాళ్ళ ఉద్వేగాల్ని పట్టించుకోడు. అతడిని ప్రేమించే అమ్మాయి అతడు కోరుకునే ప్రేమను, ఆదర్శాన్ని అతడికి అందిస్తే ఆమె పట్ల నిజాయితిగా ప్రేమగా ఉంటాడు. అలాకాక ఆమె నువ్వు ఫలానా సమయంలో గడ్డం చేసుకోలేదు. నీ పక్కన రావటానికి నాకు సిగ్గేసింది" లాంటి సనుగల్లు ప్రారంభించిందంటే నువ్వెంత, నీ కతెంత, పో! అనే ధోరణిలో ఆమెను లెక్కచేయడు ఆడపిల్లకు అతనితో వ్యవహారం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఉంగరాల గింగరాలవాడు : కొందరు యువకులు ఉంటారు, మేడలో సన్నటి గొలుసు వేలాడుతుంటుంది. ( దానిని కాలరు బయటకి వెలాడవేసి నలుగురికి కనిపింజేయాలని చూస్తారు) అలాగే చేతికి ఉంగరం ఉంటుంది. తరచుగా దానిని వెలి మీద ఆటు ఇటూ తిప్పుతుంటారు. నన్ను చూడు నా నగలు చూడు, నా దర్పం చూడు అన్నట్టుగా మనల్ని తమ ఆభరణాలతో ఆకట్టుకోవాలని చూస్తారు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రేమికులు మహాత్య? ఇతని బుద్ధికి డబ్బు అత్యంత ప్రధన్యమైనదని అర్ధం చేసుకోవాలి. ఆ విషయాన్నీ దాచుకోవటానికి కూడా పెద్దగా  ప్రయత్నించడు. చాలా సూటి ప్రేమికుడితను. ఇదిగో నేను డబ్బుల్ని ప్రేమిస్తాను. నా డబ్బు డాబూ ఇదీ! మరి నీ మాటేమిటి? అనే ధోరణి ప్రియురాలి వద్ద కూడా ఉంటుంది. ఏమంత ఎమోషనల్ గా ఉండడితను. మరో డబ్బున్న అమ్మాయి కనిపిస్తే చాలా కాజువల్ గా అంతకు మునుపటి ప్రియురాల్ని వదిలేసి ఆమె వైపు మొగ్గగలడు. ఇతడికి డబ్బు జబ్బుగా చెప్పుకోవచ్చు. ఆడపిల్లకు కూడా అదే రకమైన జబ్బుంటే ఆమె అతనివైపు మొగ్గవచ్చు. అతడి నుంచి ఆమెకు డబ్బు లభించవచ్చేమో గాని ప్రేమ విషయం మాత్రం సందేహమే! పైకి ప్రేమ కనిపించినా కూడా అది డబ్బుతో ముడివేసుకొని ఉండే ప్రేమే అవుతుంది.....      

విలక్షణ కథారచయిత త్రిపుర

విలక్షణ కథారచయిత త్రిపుర   - డా. ఎ. రవీంద్రబాబు.       త్రిపుర కథలు చదవాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. ఎందుకంటే... అవి మనకు తెలియని మనలోని చీకటి కోణాల్ని ఆవిష్కరిస్తాయి. జీవితాన్ని వ్యాఖ్యానిస్తాయి, నిర్వచిస్తాయి. మన మనసును పొరలు పొరలుగా విప్పి చూపిస్తాయి. అద్దం ముందు నిలబడి మనల్ని మనం చూసుకున్నట్లు ఉంటాయి.     త్రిపుర అసలు పేరు రాయసం వెంకటత్రిపురాంతకేశ్వరరావు. ఒకప్పటి గంజాం జిల్లాలోని పురుషోత్తమపురంలో 1928, అక్టోబరు 2 న జన్మించారు. ఎం.ఎ. ఇంగ్లీషు చదివారు. వివిధ రాష్ట్రాలలో టీచర్ గా, ప్రొఫెసర్ గా పనిచేశారు. కొంతకాలం జిడ్డు కృష్ణమూర్తిగారి శిష్యరికం చేశారు. పాశ్చాత్య సాహిత్యాలను, తత్త్వ శాస్త్రాలను అవపోసన పట్టారు.     1963 ఆధ్రప్రభలో వీరి తొలికథ ప్రచురితమైంది. 1963-73 మధ్య కాలంలో 13 కథలు, 1990-91 మధ్య 2 కథలు రాశారు. అంటే త్రిపుర రాసింది కేవలం 15 కథలే అన్నమాట. అయితేనేం... తనకంటూ తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. చెప్పలేనంతమంది సాహిత్య అభిమానుల్ని సంపాదించుకున్నారు. 1980-88 మధ్య త్రిపుర 'కాఫ్కా కవితలు', 1990లో 'బాధలు - సందర్భాలు' వీరి రచనలుగా వెలుగులోకి వచ్చాయి. 'సెగ్మెంట్స్' పేరుతో వీరు రాసిన ఆంగ్ల కవితలను ప్రముఖ కవి వేగుంట మోహనప్రసాద్ తెలుగులోకి అనువాదం చేశారు.      రాశిలో తక్కువైనా వాసిలో త్రిపుర రచనలు అసమాన్యమైనవి. అనితర సాధ్యమైన మనిషి ఆంతరంగిక లోతుల్ని చూపుతాయి. అవి మనల్ని ట్రాన్స్పరెంట్ చీకటిలా, సర్రియలిస్ట్ చిత్రాల్లా వెంటాడుతాయి, వేటాడుతాయి.       'పాము' కథలో శేషాచలపతి తనకు తానే రోజుకో పేరుపెట్టుకొని బతికేస్తుంటాడు. అందుకు కారణాల్ని చెప్తూ... 'బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. క్షణానికీ క్షణానికీ క్రియకీ క్రియకి సంబంధం లేకుండా బ్రతకడం' అంటాడు త్రిపుర. ఆ పాత్ర స్వభావాన్ని కచ్చితంగా నిర్దేశించిన బాల్యానికి ఇవి మూలాలుగా పాఠకుడు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 'భగవంతం రాడు' కథలో ప్రధాన పాత్ర ఎదురు చూసే భగవంతం రాకుండానే కథ పూర్తవుతుంది. కానీ త్రిపుర వర్ణనలు, ప్రతీకలు, లోతైన భావాలను మనకు అందిస్తాయి.  'బలిసిన ఊరకుక్కలాంటి బస్సు, రూపం పొందిన న్యూమోనియా లాంటి యిల్లు, గోడల మీద సర్రియలిస్ట్ మచ్చలు... గాజు పెంకులు రుద్దిన మొహం...' లాంటివి ఎన్నో మన ఆలోచనలకు పదును పెడతాయి. మరో కథలో 'నారాయణరావు' జీవితాన్ని తర్కించుకుని, అనుబంధాలు, ఆప్యాయతలు అందక చివరికి 'ఎగిరి, నవ్వి, వెనక్కుతిరిగి కెరటాల హోరులో కలిసిపోతాడు'.       వీరి కథల్లో సన్నివేశాలు, మాటలు,... దారానికున్న పూసల్లా కాకుండా, విసిరేసిన నక్షత్రాల్లా ఉంటాయి. ప్రపంచ తాత్విక రచనల్ని, సర్రియలిజాన్ని, జేమ్స్ జాయిస్, బెకెట్, కాఫ్కా, జెన్ బుద్ధిజాన్ని మనకు పరిచయం చేస్తాయి.        ఎంతో జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకున్న తిర్పుర 'నేను రైటర్ని అవాలని ఎప్పుడూ అనుకోలేదు. .... కథ మొదలు పెట్టిన దగ్గర నుంచీ అంతమయ్యే దాకా చచ్చాను. ఆ కథనీ చంపాను. ఆ చచ్చిన కథతో నేను చాలాకాలం జీవించాను. అవి అలాగే ఉన్నాయి. నేను ఇలాగే ఉన్నాను.' అంటారు. పాలగుమ్మ పద్మరాజు లాంటి కథా రచయిత త్రిపుర కథలకు ముందు మాట రాస్తూ... 'ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది. అంతకన్నా మెచ్చుకోలు ఏముంటుంది. ఒక కథకుడు మరో కథకుణ్ణి గురించి చెప్పేటప్పుడు అంటారు.'     అస్పష్టమైన తపనని, అలజడిని, బాధల్ని, విషాధాన్ని భుజాన వేసుకున్నారు త్రిపుర. మీ కథలు ఎందుకు సంపూర్ణంగా ఉండవు అంటే... 'అవును ఇన్ కంప్లీట్ అంటే నా కిష్టం. జీవితంలోనూ, కవిత్వం లోనూ కొంత అర్థంగాని తత్త్వం ఉంది' అంటారు.       ఇలా సున్నితమైన మనసు చైతన్యాన్ని, డిజార్డర్ జీవితాల అలజడిని, అంతంకాని కాంక్షల్ని, చీకటి ఛాయా చిత్రాల్లా అక్షరాల్లో మనకిచ్చిన త్రిపుర 2013, మే 24న మృతి చెందారు. ఆయన రచనల్లోని రహస్యాల్ని విప్పే పనిని మనమీద ఉంచారు.

ఇంకెన్నాళ్ళు

ఇంకెన్నాళ్ళు - ఇల్లిందల పద్మా శ్రీనివాస్ ఇది ఒక నిర్భయ కథ కాదు. ప్రతి  ఆబాల కథ  అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద ఒంటరిగా నడిచినపుడు మనకు స్వతంత్ర్యం వస్తుంది అని  గాంధీ గారు అన్నారు. కాని ఇప్పుడు ఆడది అర్ధరాత్రి కాదు పగలే రోడ్డు మీద నడవ లేని పరిస్థితి.అదీ ఒంటరిగా కాదు అన్నాతమ్ముడు, నాన్న, భర్త వల్ల మధ్య కుడా ఆడపిల్ల కి సెక్యురిటీ లేదు. ఎందుకంటే ఉద్యోగం చేసే ఆడదానికి ఆఫీసు లో ఒత్తిడి స్కూల్ కి వెళ్ళే చిన్న పాప కూడా ఇంటికి ఎలా వస్తుందో అని భయపడే రోజులు వచ్చాయి. ఒక గృహిణికి ఇంట్లో అత్తగారి వల్ల గండం ఏం ఆ అత్తగారు కుడా ఒక నాటి కోడలు అని ఎందుకు గుర్తు రాదు, ముందుగ తను కూడా ఒక ఆడది అని ఎందుకు తెలుసుకోదు. ఏం అత్తా పాత్ర వస్తే కోడల్ని హించించాలా. ఎన్నాళ్ళు ఆడదాని మీద ఈ అఘాయిత్యాలు... ప్రతి రోజు ప్రతి నిముషం ఆడది భయపడుతూ బతకాలా, ఎందుకు మగవాడితో సమానంగా ఆడపిల్ల ఉండలేకపోతుంది. వాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఆడదాని పాత్ర చాలా ఉంది. తల్లిగా, భార్యగా, అక్కగా చెల్లిగా ఆమె పాత్ర చాలా ఉంది.కాని మగవాడి దృష్టిలో  ఆడది ఒక అట వస్తువు కాకూడదు. మనం  రోజు చూస్తున్నాం, రోజు పేపర్లో చదువుతున్నాం. ఎన్నో ఘోరాలు ఆడపిల్ల మీద జరుగుతున్నాయి. ఇంట్లో మనవాళ్ళు అనుకునే వల్ల వల్ల కూడా ఆడపిల్లకి ప్రాణ భయం.. కాదు కాదు  మాన భయం. ఆడపిల్ల ప్రేమించక పోతే చంపేస్తారా ఏం ఆ ఆడపిల్లని హించించే ముందు వాళ్ళకు వాళ్ళ తల్లి భార్య చెల్లి గుర్తుకు రారా.మగవాళ్ళు మృగళ్ళలా నగరం అనే  అడవిలో తిరుగుతుంటే  ఆడపిల్లకి స్వేచ్చ ఎక్కడ వుంటుంది. అలంటి మృగళ్ళకు సమాధులు కట్టాలి వాళ్ళు మన మీద ఆకలి చూపులు విసిరే లోపే మనమే పులి పంజా విప్పి బుద్ది చెప్పాలి. హైటెక్ రోజుల్లో కూడా ఆడది హైటెక్ సిటీలో  మోసపోయింది. ప్రతి ఆడపిల్ల మీద ఇలా  అత్యాచారాలు జరుగుతుంటే ఎన్నాళ్ళు సహిస్తాం. ఇంకా ఆ రోజులి రాకూడదు ఆడది మరో నిర్భయ కాకుకడదు ఆడది అంటే ఆదిశక్తి అని నిరుపిద్దాం. ఈ క్షణం నుంచి మన స్వేచ్చా జీవితానికి తెరతిద్దాం