చింతా దీక్షితులు
posted on Apr 11, 2014
చింతా దీక్షితులు
తెలుగు కథాసాహిత్యంలో తొలితరం కథకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. తెలుగు కథ నడకలు నేర్చుకుని సరైన మార్గంలో ప్రయాణించడానికి అనువైన బాటను నిర్మించిన వారిలో మఖ్యుడు. భాషలో, నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కథకుడు దీక్షితులు. ముఖ్యంగా బాలసాహిత్యాన్ని తెలుగులో సృష్టించిన వారిలో ఆద్యుడు. చింతా దీక్షితులు లేనిదే తెలుగు కథాప్రస్థానం పూర్తికానట్లే అనిచెప్పాలి.
చింతాదీక్షితులు 1891 నంబరు 1న తూర్పుగోదావరి జిల్లాలోని దంగేడు గ్రామంలో జన్మించారు. వీరిది సాంప్రదాయమైన కుటుంబం. రాజమహేంద్రవరం (రాజమండ్రి) లో బి.ఎ. చదివారు. తర్వాత సైదాపేటలో ఎల్.టి చేశారు. ఉపాధ్యయునిగా, పాఠశాలల తనిఖీ అధికారిగా ఉద్యోగం చేశారు. కథలతో పాటు నాటకాలు, గేయాలు రచించారు. అపూర్వమైన బాలసాహిత్యాన్ని సేకరించారు. సొంతగా సృష్టించారు.
సుమారు 100కు పైగా వీరు కథలు రచించారు. 1964లోనే 'చింతాదీక్షితులు' కథలు పేర 22 కథలు, 1996లో 'చింతాదీక్షితులు సాహిత్యం' పేరుతో మరో తొమ్మది కథలతో పాటు వారి రచనా వ్యాసంగం మొత్తం ప్రచురింపబడింది. అందుకే గురజాడ, శ్రీపాద తర్వాత తెలుగు కథాసాహిత్యానికి బీజాలు వేసిన వ్యక్తి దీక్షితులు. తొలిరోజుల్లో భీమశంకరరావుతో కలిసి కవిత్వం చెప్పారు. జంటకవులుగా వీరిద్దరూ బాగా ప్రసిద్ధి పొందారు. 1912లో వీరు 'చిత్రరేఖ' అనే అపరాధ పరిశోధన (డిటెక్టివ్) నవల రాశారు. 'హరిణదంపతులు', 'కవికన్య' గేయాలను 1923లో ప్రచురించారు. ఇక బాలసాహిత్యం విషయానికి వస్తే చింతా దీక్షితులు- స్వయంగా ప్రచారంలో ఉన్న జానపద గేయాలను సేకరించారు. స్వయంగా కొన్ని రచించారు. ఆ రోజుల్లో 'ఆంధ్ర సచిత్రవారపత్రిక'లో కొన్నిటిని ప్రకటించారు. 1931 నుంచి 'బాలానందం' పేరిట 'భారతి' మాస పత్రికలో బాలగేయాలు రాశారు. వీటిలోని 'సూరి, సీతి, వెంకి' పాత్రలు పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా అలరించాయి. 'బంగారు పిలక' గేయ కథలకు అప్పట్లో ఆంధ్ర ప్రభుత్వం బహుమతి లభించింది. అదేవిధంగా 1949లో వీరి 'లక్కపిడతలు' కు భారత ప్రభుత్వం బాలసాహిత్యంలో ప్రథమ బహుమతి ప్రకటించింది.
సంచార జాతుల మీద అంటే ఆదిమ జాతుల మీద మొట్టమొదటి తెలుగు కథ రాసిన ఘనత మాత్రం చింతా దీక్షితులు గారిదే... లంబాడీల జీవితాల్ని వివరిస్తుంది 'సుగాలీ కుటుంబం' కథ. 'చెంచురాణి' కథ కూడా ఈ కోవకు చెందిందే... 'అభిప్రాయభేదం' కథ ఆర్థికంగా సమాజంలో ఉన్నవారికి లేనివారికి మధ్య ఉన్న ఆంతర్యాలను ఎత్తి చూపుతుంది.
వీరి కథలు ప్రకృతిలోని ప్రతి అందాన్ని పట్టి చూపిస్తాయి. మనసుల్ని ఆర్ద్రతతో నింపుతాయి. సమాజంలోని వివిధ జాతుల జీవన విధానాల్ని పరిచయం చేస్తాయి. గ్రామీణుల బాధల్ని, నిరాడంబరతని చూపిస్తాయి. వీరికి పలు భాషలు వచ్చినా ఆ సాహిత్యాల ప్రభావం వీరి కథలపై కనపడదు. కథను నడిపించడంలో, వాక్యాలు కూర్చడంలో, సొగసుగా చెప్పడంలో చింతాదీక్షితులు సిద్ధహస్తులు. సంఘటనాత్మక కథలే కాదు, వర్ణనలు, సంభాషణాత్మకమైన కథలు కూడా వీరు రాశారు. వీరి కథలు ప్రకృతితో పాటు, ప్రణయం, హాస్యం, తాత్త్విక దృష్టి, పిల్లలను అలరించేవిగా మనకు కనపడతాయి. వీరు పూర్తిగా వ్యవహారిక భాషలో కథలు రాసినా అక్కడక్కడా గ్రాంథిక వాసనలు వస్తాయి. ( ముళ్లు - కంటకాలు, ఆశ్చర్యం - విస్మయం).