RELATED EVENTS
RELATED NEWS
EVENTS
పాతికేళ్ళ ప్రస్థానం: శోభాయమానంగా ముగిసిన టాంటెక్స్ రజతోత్సవ వేడుకలు

 

జులై 09, 2011, డాల్లస్/ఫోర్ట్‌వర్త్ 1986 లో అధికారికంగా డాల్లస్ నగరం, టెక్సాస్ రాష్ట్రంలో స్థాపించబడిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కు 25 వసంతాలు నిండాయి. ఈ సంధర్భంగా గత రెండు రోజులుగా సంస్థ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో రజతోత్సవ వేడుకలు సంస్థ అధ్యక్షుడు శ్రీ. ఎన్ ఎం ఎస్ రెడ్డి పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. రజతోత్సవ సాంస్కృతిక అధినేత శ్రీ. సుబ్రమణ్యం జొన్నలగడ్డ నాయకత్వంలో విభిన్నరీతిలో వినూత్నంగా వినోదాల పంట తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు.

 

తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణ ముఖ్యోద్దేశ్యంగా స్థాపించబడిన టాంటెక్స్ చరిత్రలో ఎన్నో మలుపులు తిరిగి నేడు అమెరికాలో ఒక ఉత్తమ తెలుగు సంస్థ గా పేరు తెచ్చుకొని ఉత్తర టెక్సాస్ ప్రాంతీయ వాసులకు అండగా ఉంది. తరాల అంతరాలను మాపే సంగీత తరంగిణి అయిన రేడియో"గానసుధ", వనితలకోసం వనితల చేత నిర్వహించబడే "వనితావేదిక", నెలనెలా తెలుగు వెన్నెల కురిపించే సాహిత్యవేదిక, యువతను ప్రోత్సహించే "స్ఫూర్తి", భారతావని నుండి ప్రవాసంలో పర్యటిస్తున్న పెద్దల కాలక్షేపం కోసం ఏర్పాటు చేయబడ్డ "మైత్రి", రోజురోజుకీ ఆసక్తి పెరుగుతున్న నాటి నేటి క్రీడలు ఇలా విభిన్న కార్యక్రమాలతో వినూత్నంగా ఎన్నోసేవలు అందిస్తూ ఉత్తర టెక్సస్ ప్రాంతీయ వాసులకు అండగా నిలచిన టాంటెక్స్ కు ఇరవై ఐదు సంవత్సరాలు.

టాంటెక్స్ కార్యదర్శి శ్రీ విజయమోహన్ కాకర్ల శుక్రవారం రాత్రి దాతలకు, పోషకదాతలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రజతోత్సవ విందు కార్యక్రమానికి స్వాగతం పలికారు. రజతోత్సవ విందు సమన్యయ కర్త శ్రీ ప్రసాద్ రెడ్డి మల్లు ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ తమ ఆనందాన్ని సభికులతో పంచుకొన్నారు. ఆధ్యక్షుడు శ్రీ ఎన్ ఎమ్ ఎస్ రెడ్డి తమ ప్రసంగంలో "మన సంస్థ చరిత్రలో ఇది ఒక మైలు రాయి. మీ అందరి సహకారంతో భారీగా విరాళాలు సేకరించి ఈరోజు రజతోత్సవకార్యక్రమాలు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు మా కార్యవర్గం, అంతర్భాగ సమితి మరియు పాలక మండలి తరపున నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియ జేస్తున్నాను". పార్లమెంటు సభ్యుడు శ్రీ. ఎం వేణుగోపాల్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సుబ్రమణ్యం జొన్నలగడ్డ అధికారికంగా సాంస్కృతిక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఓడిస్సీ, కూచిపూడి మరియు సినీ నృత్యాలతో పాటు రామచారి శిష్యబృందం పాడిన పాటలతో, స్ఫూర్తి బృందం వేసిన నాటిక, ఉదయభాను ఆడించిన ఆటలతో శుక్రవారం కార్యక్రం ముగిసింది. టాంటెక్స్ ఉపాధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ వందన సమర్పణ చేసారు.

శ్రీ సుబ్రమణ్యం జొన్నలగడ్ద శనివారం కార్యక్రమానికి స్వాగతం పలికారు. విచ్చేసిన అతిథులతో జ్యోతి ప్రజ్వళన అనంతరం టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి మరియు రజతోత్సవ ఙ్ఞాపిక సంపాదకుడు డా. నరసింహారెడ్డి ఊరిమిండి ఙ్ఞాపికను తమ సభ్యబృందం మరియు అతిథుల మధ్య ఆవిష్కరించారు. "సంస్కృతి - సాహిత్యం - సఖ్యత" ఇతివృత్తమైన రజతోత్సవ ఙ్ఞాపికకు "తెలుగు సంగమం" అనే నామకరణం వెనుక ఉన్న సారాంశాన్ని డా. ఊరిమిండి సభతో పంచుకొన్నారు. స్థానికంగా ఉండే ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం, కూచిపూడి, చలనచిత్ర మిశ్రమ, జానపద నృత్యాలు, నాటికలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తి కరంగా చేసిన బాలబాలికల చలనచిత్ర మిశ్రమ నృత్య విన్యాసాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పాల్గొన్న పదిమంది చుట్టూ తిరుగుతూ ప్రదర్శించిన "జడ కోలాటం" ప్రేక్షకులందరినీ విశేషంగా ఆకట్టుకొంది.

 సుయోధన పాత్రలో డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తనదైన శైలి లో ప్రేక్షకులను ఆకట్టు కోవడమే కాకుండా అలనాటి నందమూరి పాత్రను ను గుర్తు చేసారు. డా. సంధ్య రెడ్డి గవ్వ నేతృత్వంలో నిర్వహించిన టాంటెక్స్ మాజీ అధ్యక్షుల పరిచయం వినూత్న రీతిలో జరిగింది. ఒక్కో మాజీ అధ్యక్షుడు ఆ సంవత్సరానికి సంబందించిన పాటకు నాట్యం చేస్తూ వేదిక మీదకు ప్రవేశించారు. ఈ కార్యక్రమం అందరినీ అలరించింది.

 

కళాతపస్వి డా.విశ్వనాథ్ కు మహాయశస్వి మరియు పద్మశ్రీ శొభానాయుడి కి "నృత్య సామ్రాఙ్ఞి", మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కె.ఎం.భాను కు "ప్రవాస కళాబంధు"బిరుదులతో ఘనంగా సత్కరించారు.క్యాన్సర్ ఆసుపత్రి కోసం విరాళాలు సేకరించి ప్రజలలో అవగాహన పెంచుతున్న యువరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ కు "విశిష్ఠ సేవా పురస్కారం"తో గౌరవించారు.ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ. నన్నపనేని రాజకుమారి, మరియు శ్రీ. వాకాటి నారయణరెడ్డి టాంటెక్స్ ప్రజలను తమ ప్రసంగాలలో ప్రవాసంలో తెలుగు భాషాసంస్కృతుల పట్ల అభిరుచి పెంచుకున్న తెలుగువారిని అభినందించారు. శ్రీ మురళి మోహన్ నాయకత్వంలో నిర్వహించిన "రాజరాజ నరేంద్రుడు" తెలుగు భాషా పరిరక్షణ కోసం ఒక చక్కని సందేశాన్ని అందించింది. శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, శ్రీ వందేమాతరం శ్రీనివాస్, శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, శ్రీమతి కల్యాణి రాజ ఇందులో పాల్గొన్న ప్రముఖులు. శ్రీ ఎవి‌ఎస్ బృందం అనేక హాస్య సన్నివేసాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

 దీపు, కౌసల్య, రామాచారి, ప్రణవి, వందేమాతరం శ్రీనివాస్, రఘుకుంచె సంయుక్తంగా నిర్వహించిన గాన కచ్చేరి సమయాభావం వలన త్వరలో ముగిసినప్పటికీ పాడిన కొద్ది పాటలు ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్నాయి. కార్యక్రమానికి నంది పురస్కార గ్రహీత ఉదయభాను, శ్రీమతి రాజేశ్వరి చల్లా, శ్రీ విజయభాస్కర్ రాయవరం, శ్రీమతి జ్యోతి వనం, డా. కస్తూరి ఇనగంటి, శ్రీ విజయ చంద్రహస్ మద్దుకూరి, శ్రీ నసీమ్ షేక్ , శ్రీమతి పద్మశ్రీ తోట వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

చివరగా ఉత్తరాధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న దాతలకు, పోషక దాతలకు, విచ్చేసిన అతిథులకు, కళాకారులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి, ప్రేక్షకులకు, కార్యకర్తలకు, బ్లాక్ అకాడమీ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో ఎంతో చారిత్రాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమాలకు తెరపడింది.

 

TeluguOne For Your Business
About TeluguOne
;