RELATED EVENTS
RELATED NEWS
EVENTS
టాంటెక్స్ “నెల నెలా తెలుగు వెన్నెల’’ నాటకరంగ సాహిత్యపు హోరు ...

సాహిత్య వేదిక అధిపతి శ్రీ మల్లవరపు అనంత్ అధ్యక్షతన మార్చి 20వ తేదీన లూయిస్విల్ లోని కోకిల ఇండియన్ రెస్టారెంట్ లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) వారి సాహిత్య వేదిక వారు “నెల నెలా తెలుగు వెన్నెల’’ సాహిత్య సదస్సు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారి పరశు తన్మయి “భజేహం’’ ప్రార్థన గీతంతో ప్రారంభించి సుమతీ శతక పద్యాలు “ఎప్పుడు సంపద కలిగిన, కూరిమి గల దినములలో’’ ఆలపించి సభికులను మంత్రముగ్ధులను చేసింది. డల్లాస్ లో మార్చి 19వ తేదీన జరిగిన 26వ టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సు వివరాలను ఆ సదస్సులో పాల్గొన్న శ్రీ మద్దుకూరి చంద్రహాస్ సభికులతో పంచుకున్నారు.

ఈ సభాముఖంగా ఇటీవలే స్వర్గస్థులైన ప్రముఖ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారికి నివాళులు అర్పించారు. స్వీయ/సాహితీ వ్యాసంగంలో భాగంగా కార్యవర్గ సభ్యులు శ్రీ జువ్వాడి రమణ గారు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం మీద పద్యం యొక్క ఆధిపత్యాన్ని ప్రస్తావిస్తూ పద్యం గొప్పతనాన్ని, ఛందస్సు వల్ల కలిగే ఉపయోగాల్ని సభకు విచ్చేసిన వారికి వివరించారు. తనకు ఇష్టమైన తిక్కన సోమయాజిగారు రచించిన “ఎవ్వనిచే జనించి జగము’’ అనే పద్యాన్ని పాడి ఆహుతులను ఆకట్టుకున్నారు. శ్రీమతి తడిమెట్ల కల్యాణి గారు “మనసు పలికే మనోహరం’’ అనే స్వీయ కవిత ద్వారా నిష్కల్మషమైన అమ్మ మనసుకు ఏం కావాలో అడిగిన తీరు అందరి మనసులను కదిలించింది. ఈ సభలో పాల్గొన్న మరో ప్రముఖ ప్రవాస కవి శ్రీ కన్నెగంటి చంద్రగారు రచించిన “వాన వెలసిన సాయంత్రం’’ అనే కవితను నసీం షేక్ ఆలపించారు. 

తేనేటి విందు విరామం తరువాత శ్రీ మద్దుకూరి చంద్రహాస్ ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ బండారు ఉమామేశ్వరరావు గారిని సభకు పరిచయం చేస్తూ ... “వరంగల్లు వాస్తవ్యులైన శ్రీ ఉమామహేశ్వరరావు గారు వృత్తిరీత్యా డాక్టర్ అయినా, ఆయన రచించిన, ప్రచురించిన “కవి హృదయం’’. “యువతకు పట్టాభిషేకం’’ 11 నృత్య రూపకాలు, వాటిలో మూడు నాట్య శైలులను మేళవించి రచించిన “త్రిధర’’ నృత్యరూపకం గురించి, ఆయన నటించిన నాటకం “గొప్పవారి గోత్రాలు’’ గురించి సభికులకు వివరించారు.

ఉమామహేశ్వరరావు గురించి డల్లాస్ నివాసి శ్రీ శ్యామ్ థామస్ గారు మరిన్ని విశేషాలను వారితో పంచుకున్నారు. తరువాత సభికులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ ఉమామహేశ్వరరావు గారు “తెలుగు సాహిత్యం- నాటకరంగం’’ అనే అంశం మీద ప్రసంగిస్తూ పురాణాలలోని పద్యాల నుంచి నేటి గద్యాల వరకూ తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి పెనుమార్పులు, వాటి వలన నాటకరంగం మీద పడిన ప్రభావం గురించి వివరించారు. పద్య నాటకాలు “గయోపాఖ్యానం’’, “హరిశ్చంద్రుడు’’. “రామరావణ యుద్ధం’’ భరతముని రచించిన మొట్టమొదటి పౌరాణిక నాటకం “క్షీరసాగరం’’ గురించి, జాయప సేనాని రచించిన నృత్యరత్నావళలు గురించి కూడా ప్రస్తావించారు. జాయప సేనాని నృత్యరత్నావళి అనంతరమే రామప్ప దేవాలయాన్ని నిర్మించారన్న ఊహే సభికులకు ఆసక్తి కలిగించింది. శృతిమించిన రాగాలాపన, పద్యాలాపన, నాటక ప్రదర్శనలో సాంకేతిక నైపుణ్యం లేకపోవడం క్రమేపీ పౌరాణిక నాటకాలను నిరాదరణకు గురిచేశాయని, ఈ ప్రక్రియలో భాగంగా వచ్చిన గురజాడ వారి “కన్యాశుల్కం’’, “మాలపల్లి’’, “రక్త కన్నీరు’’ సమాజంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయని, కనిపించే దానికంటే చిన్నదిగా చూపించే టెలివిజన్, పెద్దదిగా చూపించే సినిమాలతో ఉన్నది ఉన్నట్టు చూపించే నాటకరంగం పోటీ పడలేకపోతుంది’’ అని చెప్పారు. 

ఈ సభాముఖంగా ఆయన తన మనోవేదనను వ్యక్తం చేస్తూ “ప్రస్తుతం ఆంధ్రదేశంలో వున్న 86 నాటక పరిషత్తులు నాటకరంగ పునర్వైభవానికి కృషి చేయాలని, అలాగే కళాకారులను చిన్నచూపుకు గురిచేయడం సరికాదని’’ పిలుపునిచ్చారు. “వసంత వర్షం’’ అనే పద్యాన్ని తాను డల్లాస్ లో రచించిన కవితను చదివి తన ప్రసంగాన్ని ముగించారు.

అటు పిమ్మట ఉమామహేశ్వరరావు గారిని టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్.ఎమ్.ఎస్.రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేష్ మండువ దుశ్శాలువతో సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు నసీం షేక్, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాడి, అనంత్ మల్లవరపు, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి ఉమామహేశ్వరరావు గారిని జ్ఞాపికతో సత్కరించారు.

అనంతరం మల్లవరపు అనంత్ ప్రసంగిస్తూ ... సభకు విచ్చేసిన వారికి, ఆతిథ్యం ఇచ్చిన ఇండియన్ రెస్టారెంట్ వారికి తమ ధన్యవాదములు తెలిపి సభను ముగించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;