RELATED ARTICLES
ARTICLES
చరిత్ర పుటల్లోకి ఎక్కనున్న మంచుతుఫాను జోనస్

 

 చరిత్ర పుటల్లోకి ఎక్కనున్న మంచుతుఫాను జోనస్

ఇరవై ఏళ్ళ క్రితం ’96 సంవత్సరంలో బ్లిజర్డ్, మంచుతుఫాను వచ్చి ౩౦ ఇంచులకి పైగా స్నో పడి రికార్డ్ నెలకొల్పింది.  కార్లన్నీ కంటికి కనిపించకుండా స్నోలో కూరుకుపోయాయి.  ఇంటిముందర తలుపుల దగ్గర గోడల్లాగ స్నో పడడంతో తలుపులు తీయడం కూడా కష్టం అయ్యింది కొన్ని చోట్ల.  ఈ సారి చలి కాలం వింతగా మొదలయ్యింది.  డిసెంబర్ నెలలో చలి వణికించాల్సింది కానీ చలి ఎక్కువ లేకుండా టెంపరేచర్స్ కూడా స్ప్రింగ్ సీజన్ లోలా వుండింది.  ఎప్పుడూ పెద్ద పెద్ద వింటర్ జాకెట్స్ వేసుకోవాల్సి వచ్చేది కానీ ఈ సారి మాత్రం ఒకోసారి స్వెట్టర్స్ కూడా లేకుండా తిరగగలిగారు.  క్రిస్మస్ రోజు ఎండ వచ్చి అస్సలు చలి లేకుండా గడిచిపోయింది.  చాలా మంది క్రిస్మస్ కి స్నో పడి వైట్ క్రిస్మస్ వుంటే, వింటర్ వండర్ లాండ్ లా వుండి సంతోషాన్నివ్వాలని కోరుకుంటారు.  కానీ ఒకోసారి ఒకోలాంటి వాతావరణం వుంటుంది అని సంతోషంగా క్రిస్మస్ జరుపుకున్నారు. వాతావరణం కొంచెం వేడిగా వుండి రోజు మంచి ఎండ రావడంతో ప్రకృతి కూడా తికమక పడిపోయి స్ప్రింగ్ లో పైకి రావాల్సిన హయసింత్ పూల, టూలిప్ బల్బ్స్ (గడ్డలు) పైకి వచ్చేయడం మొదలుపెట్టాయి.  స్నో పడకపోవడం, చలి లేకపోవడం వల్ల కొంత మందికి డ్రైవింగ్ కి ప్రాబ్లెమ్ వుండదని సంతోషపడ్డారు, కొంత మంది చలికాలం, చలికాలంలా కాక కాలం కాని కాలంలా వుండి ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అని బాధ పడినవారున్నారు.

 క్రొత్త సంవత్సరం వచ్చే సమయానికి విపరీతమైన చలి మొదలైంది. చెప్పా పెట్టకుండా ఎక్కడినుండి వచ్చిందో బ్లిజర్డ్, వింటర్ స్టార్మ్ జోనస్ వస్తుందని జనవరి 18 నుండి చెప్పడం మొదలు పెట్టారు అన్ని న్యూస్ ల్లో, వెదర్ చానెల్స్ లో.  రెండ్రోజులు అయ్యాక తెలియసాగింది అందరికీ అది ఎంత పెద్ద మంచు తుఫానవుతుందో!  ఇక అందరూ సూపర్ మార్కెట్స్ లో, స్నో షవల్స్, స్నో క్లీన్ చేయడానికి కావాల్సిన సరంజామాతో పాటు మూడు రోజులు ఇంట్లోనే వుండాలి కాబట్టి తిండికి ఇబ్బంది కాకుండా రిఫ్రిజేటర్ నింపేసుకున్నారు.  కరెంట్ పోతే త్వరగా రాకపోతే అంత తిండి పాడయిపోతుంది.  కరెంట్ పోతే కావాల్సిన టార్చిలైట్స్, వాటికి కావాల్సిన బ్యాటరీస్, బ్యాటరీస్ తో కొంచెం సేపు వెలిగే లైట్లు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.  శుక్రవారం సాయంత్రం స్నో స్టార్మ్ మొదలయ్యేవరకు షాపింగ్ లు చేస్తూనే వున్నారు జనాలు.  ఎమర్జెన్సీ మందులు, ఫస్ట్ ఏయిడ్ కిట్స్ అన్ని అందుబాటులో వుంచుకోవడానికి ఆఖరి నిముషం వరకు తిరుగుతూనే వున్నారు.  బోర్ కొట్టకుండా, క్యాబిన్ ఫీవర్ అంటారు ఎక్కువ రోజులు బయటకు రాకుండా ఇంట్లో వుండాల్సి వస్తే సినిమా డివిడీలు కొనడం, రెంట్ కి దొరికితే రెంట్ కి తీసుకోవడం, లైబ్రరీలనుండి కూడా తెచ్చుకుంటారు. 

శుక్రవారం చెప్పిన సమయానికి మొదలయ్యిపోయింది. స్నో తుఫానులో బయట తిరిగితే ఎన్నో యాక్సిడెంట్స్ జరిగే అవకాశం వుంటుంది. దాదాపు 10 రాష్ట్రాల్లో స్నో ఎమెర్జెన్సీ విధించారు యాక్సిడెంట్లను ఆపడానికి, ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి.  ఇళ్ళల్లో వుంటే అందరూ సురక్షితంగా వుంటారని.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని యాక్సిడెంట్లను ఆపలేకపోయారు. చాలా సిటీలను మూసేసారు. 


మధ్య రాత్రి సమయంలో గ్లాస్ డోర్ లోనుండి చూస్తే స్నో విపరీతంగా పడుతూ, అప్పటికే లాన్స్ ల్లో గడ్డి కప్పడిపోయింది, ఈదురు గాలులతో స్నో చెల్లా చెదురుగా పడటం మొదలుపెట్టింది.  మామూలుగా స్నో పడితే చూడటానికి చాలా అందంగా వుంటుంది కానీ హోరున వీచే గాలితో అది భయంకరంగా అనిపించింది.  గ్లాస్ డోర్ తీసి చూస్తే హోరుమనే చల్లటి గాలి మొహం మీద కొట్టి అది తుఫాను గాలి అని తెలియజేసింది.  శనివారం మొత్తం పడుతూనే వుంది.  టెంపరేచర్స్ కూడా చాలా తక్కువగా వుండడంతో ఇంట్లో హీటర్స్ వున్నా, కంఫర్టర్స్ కప్పుకున్నా చలి వణికిస్తూనే వుంది. 

స్నో పడటం మొదలు కాక ముందే రోడ్లపైన ఉప్పు, బ్రైన్ సొల్యుషన్(brine solution) వేస్తుంటారు స్నో రోడ్లకి గట్టిగా అతుక్కు పోకుండా. బ్రైన్ సొల్యుషన్ డీ ఐసింగ్ కి అంటే ఐస్ అయిన స్నోని కరిగించడానికి పనికి వస్తుంది.  స్నో పడకముందు, స్నో పడింతర్వాత కొన్ని రసాయనాలతో రోడ్లని ట్రీట్ చేసి వుంచితే స్నో తీయడంలో, స్నో ప్లవర్స్ కి (Snow Plowers) కి తేలిక అవుతుంది.

హైవేస్ మీద, మేన్ రోడ్ల పై స్నో పడక ముందు నుండే ఉప్పు, రసాయనాలు వేయడం మొదలు పెట్టి, స్నో పడటం మొదలు పెట్టగానే స్నో ప్లవ్ ట్రక్స్(snow plough trucks)  తీసుకువచ్చి స్నోని తీసి పక్కకి గుట్టలుగా పేర్చి పెట్టడం మొదలుపెడతారు.  ఒకో రాష్ట్రం వారు ఒకో రకం రసాయనాలు కానీ, ఒకోసారి అన్నీ రాష్ట్రాల వారు ఒకే రకం రసాయనాలు వాడే అవకాశం కూడా వుంది. వాటి వల్ల లాభాలు, నష్టాలు వుంటాయి.  1)రాక్ సాల్ట్ - రాళ్ళ ఉప్పు(Sodium Chloride)ని సామాన్యంగా చాలామంది వాడతారు.  ఇళ్ళల్లో కూడా డ్రైవేస్ లో, ఇంటిముందర మెట్లపై వేస్తే రాళ్ళ ఉప్పు వేస్తే స్నో కరిగి జారకుండా వుంటుందని ముందు జాగ్రత్తగా తెచ్చి పెట్టుకుంటారు.  2) సాండ్ - ఇసక, రాళ్ళ ఉప్పు పనిచేయని చోట్ల ఈ ఇసకని వాడతారు.  ఇది ముఖ్యంగా చాలా తక్కువ టెంపరేచర్లు వున్న చోట బాగా పని చేస్తుంది.  కానీ స్నోని, ఐస్ ని కరిగించదు అంతే కాక డ్రైనేజీలలో ఇరుక్కుని మూసేస్తుంది.   3)  ఫ్రీ మిక్స్ - సోడియం క్లోరైడ్ మరియి కాల్షియం క్లోరైడ్ రసాయనాలను కలిపి చేస్తారు.  ఇది టెంపరేచర్స్ బాగా తక్కువగా వున్న ప్రదేశాల్లో పని చేస్తుంది. దీని వల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగదు, కానీ ఇది ఖరీదైనది, దీన్ని పొడిగా వున్న ప్రదేశంలోనే స్టోర్ చేసి పెట్టుకోవాలి.   4) ద్రవ రూపంలో వుండే కాల్షియం క్లోరైడ్ - ఇది తేమని ఆకర్షించి వేడిని విడుదల చేస్తుంది. ఇది ఉప్పుతో కలిపి వాడితే ఐస్ ని దాదాపు 8 మార్లు ఎక్కువగా కరిగిస్తుంది. ఇది కూడా టెంపరేచర్స్ చాలా తక్కువగా వున్న ప్రదేశాల్లో బాగా ప్రభావితంగా పని చేస్తుంది.  ఈ రసాయనం కూడా ఖరీదైనది అదీ కాక దీన్ని కరెక్ట్ గా సమయానికి వాడాలి.   5) ద్రవ రూపంలో వుండే మాగ్నీషీయం క్లోరైడ్ - దీన్ని స్నో పడకముందు స్నో మరియు ఐస్ పేవ్ మెంట్లకితుక్కుపోకుండా ముందు జాగ్రత్తగా వాడతారు. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ లేదు, ఖరీధైంది, సమయానికి కరెక్ట్ గా వాడాలి. అంతే కాకుండా స్నో ప్లవర్స్ స్నోని రోడ్ల పై నుండి తీసి డ్రైవ్ వేస్ లో పెడతారు, అందుకని ముందే ఇళ్ళవాళ్ళకి అక్కడ కార్లు పెట్టకుండా ఖాళీగా వుంచాలని చెప్పారు, అలాగే వాళ్ళకి స్నో షవల్ స్నోట్రక్స్ వచ్చి వెళ్ళాక షవల్ చేసి వారి కుడి వైపే వేయాలని చెప్పారు. చలికాలంలో రోడ్ల ట్రీట్మెంట్ మరియు స్నో తొలగించే సూచనలు అన్నీ మాస్ డాట్ వెబ్ సైట్లో తెలియజేసారు.


ఆదివారం వరకు పడాల్సినంత స్నో పడి ఆగిపోయింది.  శుక్రవారం సాయంత్రం నుండి ఇంట్లోనే వున్నవారంతా పిల్లల్లు స్నో చూడాలని, ఆడుకోవాలని ముచ్చట పడుతుంటే చలికి తట్టుకోవడానికి శరీరానికి అన్నీ తగిలించుకుని కాసేపు బయటకు వచ్చి ప్రకృతి ఎటు చూసినా పాలనురగలా వున్న తెల్లటి స్నోని చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. అలాగే రాత్రి టెంపరేచర్స్ చాలా తగ్గిపోయి కరుగుతున్న స్నో కాస్తా ఐస్ అయ్యి ఆకులు రాలి ఖాళీగా వున్న చెట్లపై నుండి ఐస్ వేళ్ళాడుతూ ఐసికల్స్, ఐస్ తోరణాల్లా కనిపిస్తూ పాటల్లో వినిపించే వింటర్ వండర్ లాండ్ అంటే ఇలాగే వుంటుందేమో అనిపిస్తుంది.  స్నో లో మునిగిపోయిన కార్లు, మొదటిసారి స్నో చూస్తున్న చిన్నారులను స్నోలో కూర్చోబెట్టి ఫోటోలు తీసుకున్నారు తల్లితండ్రులు.   కొంతమంది స్నో షవల్స్ తీసుకుని మునిగిపోయిన కార్లని బయటికి తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి కొంతమంది పూర్తి చేయగలిగితే మరి కొంతమంది ఆ చలిలో షవల్ చేయడం కష్టమనిపించి మళ్ళీ తర్వాత తీసుకోవచ్చులే అని లోపలికి వెళ్ళి వేడి వేడి కాఫీ తాగడం, పిల్లలకి హాట్ చాక్లెట్ కలిపి ఇచ్చి మళ్ళీ వెచ్చగా అవ్వడానికి ప్రయత్నించారు. 

అపార్ట్మెంట్స్ లో వుండే వారికి, ఇళ్ళ కాంప్ల్ క్స్ ల్లో మ్యానెజ్ మెంట్స్ వారు కొన్నిచోట్ల వెంటనే స్నో క్లియర్ చేయడానికి స్నో ట్రక్స్ ని పిలిపిస్తారు, కొన్ని చోట్ల స్నో పడడం పూర్తిగా ఆగిపోయి ఎంతమందిని పిలిపించాలో చూసుకుని పిలిపిస్తారు.  హైవేస్, మేన్ రోడ్ల పైన త్వర త్వరగా తీసేస్తూ వుంటారు కాబట్టి బయట బాగానే వుంటుంది స్నో ఆగిపోగానే. కొంచెం లోపలికి వుండే రోడ్లు, వెనక రోడ్లు మెల్లిగా క్లియర్ చేస్తారు.  చిన్నగా వున్న రోడ్ల పై కార్లు, స్కూల్ బస్ లు పోవడానికి ఇబ్బందిగా వుంటుంది.  చాలా చోట్ల ఈదురు గాలికి చెట్లు పడిపోయి, కరెంట్ తీగలు తెగిపోయి కొంతమందికి వారు భయపడినట్టుగానే కరెంట్ పోయి ఇబ్బందుల పాలయ్యారు.  రోడ్లు క్లియర్ చేస్తుండగా రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా తయారవుతుంది ఈ స్నో.  కొంచెం టెంపరేచర్స్ పెరిగి, వర్షం పడ్డా ఈ గుట్టలు కరిగి తీర ప్రాంతాల్లో సముద్రంలోకి పోయి, ఈదురు గాలికి అలలు వేగం పెరిగి వరదలు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.  శనివారం స్నో పడుతుండగా గంటకి 30-50 మైళ్ళ వేగంతో వీచే గాలులతో, అంతే వేగంగా కురుస్తున్న స్నోతో కళ్ళకి ఏమి కనపడకుండా అయిపోయింది.

ఈ వింటర్ స్టార్మ్ జోనస్ దాదాపు 45 మంది ప్రాణాలను బలి గొన్నది.  షవల్ చేసేపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ముఖ్యంగా హై బీ.పీ వున్నవారు, గుండె జబ్బులున్నవారు అస్సలు షవల్ చేయకూడదని చెబుతూనే వున్నారు.  కొంతమంది ఈ సూచనలని పట్టించుకోకుండా తెల్లవారు ఝామునే లేచి ఎవ్వరూ లేనప్పుడు షవల్ చేసేస్తే ఒక పని అయిపోతుందని అనుకున్న వారు షవల్ చేస్తుండగా సడన్ గా హార్ట్ అటాక్ లు వచ్చి ప్రాణాలు కోల్పోయారు.  తెల్లవారుఝామున చలి ఎక్కువగా వుంటుంది అదీ కాక హార్ట్ జబ్బులున్న వారికి హార్ట్ అటాక్ లు ఆ సమయంలోనే ఎక్కువ వచ్చే అవకాశం వుంటుందని చెబుతూనే వున్నారు వైధ్య నిపుణులు.  కొంతమంది శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గరే వున్న గ్రోసరీస్ షాప్ లకి వెళ్ళి, లేదా ఇంటికి చేరడం లేటయిన వారు కొంతమంది వృద్దులు నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళుతుండగా స్నో తుఫాను ఎక్కువయి అందులో కూరుకు పోయి ప్రాణాలు కోల్పోయినవారు కూడా వున్నారు.  న్యూజెర్సీ లో ఆదివారం తల్లీ కూతుళ్ళు స్నోలో వాక్ చేస్తుండగా కొంచెం దూరంలో స్నో జాకెట్ కనిపిస్తే ఎవరో పడేసుకున్నట్టున్నారని అక్కడికి వెళ్ళి తీయడానికి ప్రయత్నిస్తే అది చాలా బరువుగా అనిపించింది.  ఇంకాస్త స్నో తొలగించి చూస్తే అది కేవలం జాకెట్ కాదని ఒక వృద్దురాలి శవం అని తేలింది. వారు ముందు షాక్ కి లోనయ్యారు వెంటనే పోలీసులకి ఫోన్ చేసారు.  ఇలాంటి సంఘటనలు మనసుని కలచి వేస్తాయి.


శుక్రవారం ఆఫీసుల నుండి కొంచెం లేట్ గా బయల్దేరిన వారి కార్లు స్నో లో స్కిడ్ కావడం, స్నో లో కారు టైర్స్ ఇరుక్కుపోయి కదలమని మొరాయిస్తుంటే వర్జీనియాలో అక్కడే రోడ్డు దగ్గర వున్న ఒకతను వారందరికీ కార్లను స్నో నుండి బయటకు లాగి కొద్ది దూరం తోసి సాయం చేస్తే ఆ కార్లు ముందుకు సాగి వాళ్ళు ఇళ్ళకు చేరుకోగలిగారు.  సాయం తీసుకున్న వారికి తెలియని సంగతేమిటంటే ఆ సాయం చేసిన వ్యక్తికి ఇల్లు, వాకిలి, తనకంటూ నా వారు ఎవ్వరూ లేరని అక్కడే ఎక్కడ పడుకోవడానికి స్థలం దొరికితే అక్కడే పడుకుంటుంటాడని.  ఒక టీ.వి చానల్ వారు ఇది చూసి అతన్ని మెచ్చుకుంటే," ఇందులో నా గొప్పతనం ఏముంది? వారికి సాయం అవసరం అయ్యింది నేను చేయగలను కాబట్టి చేయగలిగాను. నాకు రోజు ఎంతోమంది సాయం చేస్తుంటారు. అలాగే ఇదీ," అని అన్నాడు.  ఆ టీ.వి చానెల్ వారు అతనికి వేడి కాఫీ, తిండి ఇప్పించి వింటర్ షల్తర్ దగ్గర దిగబెట్టారు.  ఇలాగే ఎంతోమంది ఒకరికొకరు సాయం చేసుకున్నారు. 

ఎన్నో వేల విమానాలను రద్దు చేసారు, ప్రయాణికులు చాలా ఇబ్బందుల పాలయ్యారు. బస్ లు, ట్రయిన్స్ అన్ని ఆగిపోయాయి.  సోమవారం కొన్ని ట్రయిన్స్ నడిపారు కానీ ప్రయాణికుల దగ్గర డబ్బు తీసుకోలేదు, ఫ్రీ సర్వీస్ చేసారు.  ఆర్ధైకంగా ఈ వింటర్ స్నో స్టార్మ్ జోనస్ ఎంత నష్టం కలిగించిందనుకుంటున్నారు?  ఆర్ధికవేత్తల ప్రకారం మూడు రోజుల్లో 500 మిలియన్ల డాలర్ల నుండి 1 బిలియన్ డాలర్ల వరకు నష్టం కలిగి వుంటుందని అంచనా వేసారు.  ఇంత హంగామా చేసిన స్నో తుఫాను జోనస్ ప్రభావం చాలా రోజుల వరకు వుంటుంది.  ఎన్నో రికార్డ్ లను పగలగొట్టింది, ’96 లో వచ్చిన బ్లిజర్డ్ 30 ఇంచుల కన్నా ఎక్కువ స్నో పడి రికార్డ్ స్థాపించింది, బ్లిజర్డ్ జోనస్ ఆ రికార్డ్ ని పడకొడుతూ పశ్చిమ వర్జీనియాలోని గ్లెన్ గారి ప్రదేశంలో 40 ఇంచులు పడింది.  న్యూయార్క్ లో 30. 5 ఇంచులు, ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్ట్ లో 22.4 ఇంచులని చూపించినా, ఫిలడెల్ఫియా సబర్బన్ ఏరియాల్లో 30 ఇంచుల వరకు పడింది. మధ్య అట్లాంటిక్ రాష్ట్రాలు, వాషింగ్టన్ డి.సి ని ముంచేసింది వింటర్ స్టార్మ్ జోనస్. తూర్పు కోస్తా అమెరికా మొత్తం స్నోలో మునిగిపోయింది. న్యూయార్క్ లో ఏం జరిగినా ప్రయాణికులు తిరుగుతూనే వుంటారు కానీ న్యూయార్క్ సిటీ మొత్తం ప్రజల ప్రయాణాలకు ఫుల్ స్టాప్ పెట్టించింది జోనస్.  చాలా స్నో పడడంతో ఇళ్ళ పైన ఆ స్నో బరువుతో కూలే అవకాశాలు ఎక్కువ చేసింది జోనస్.    ఈ వారం టెంపరేచర్స్ కొంచెం పెరిగి ఎండ కూడా రావడంతో స్నో కరిగి ఇళ్ళ పై వున్న బరువుని కాస్త తగ్గించే అవకాశం వుంది. 

ఇంత అల్లకల్లోలం చేసినా ప్రజలు మెల్లి మెల్లిగా మామూలు జీవితం గడపడానికి అలవాటు పడుతున్నారు.  అనుకోకుండా వచ్చిన రెండ్రోజుల సెలవులు పిల్లలకి, పెద్దలకి తమ కుటుంబాలతో సమయం గడపడానికి, స్నోలో, స్లెడ్డింగ్ చేసుకోవడానికి, స్నో మాన్ లను కట్టుకోవటం, ఇగ్లూ హౌజ్ లను కట్టి వాటిలో ఆడుకున్నారు.  మొత్తానికి మెకానికల్ జీవితం గడిపేస్తున్న జనాలకు కొంచెం ఆటవిడుపు కలిగించింది, ఆనందాన్ని కలిగించింది. కొంత మంది యువతీ యువకులు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో అని స్విమ్ సూట్స్ వేసుకుని అంత చలిలో బయటకు వచ్చి స్నోలో దూకి ఈతలు కొట్టారు, చిన్నపిల్లలు కూడా ప్రయత్నించారు కానీ చలికి తట్టుకోలేక త్వరగా స్నోలోనుండి బయటకు వచ్చేసి ఇంట్లోకి పారిపోయారు. జోనస్ కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది.   ఈ జోనస్ స్టార్మ్ ప్రపంచం దృష్టిని తన వైపుకి తిప్పుకుని రోజు టీ.వీల్లో, రేడియోల్లో, న్యూస్ పేపర్లల్లో బాగానే కవరేజిని సంపాదించింది.   ఏది ఏమైనా వింటర్ స్టార్మ్ జోనస్ ని అంత త్వరగా మర్చిపోలేము. 

-కనకదుర్గ-

TeluguOne For Your Business
About TeluguOne
;