ARTICLES
నాట్స్ ఛైర్మన్ గా శ్రీనివాస్ గుత్తికొండ

నాట్స్ ఛైర్మన్ గా  శ్రీనివాస్ గుత్తికొండ

ఫ్లోరిడాలోని టెంపా లో నాట్స్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

 


 

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కు కొత్త నాయకత్వం వచ్చింది. నాట్స్ ఆరంభం నుంచి సేవలు అందిస్తున్న శ్రీనివాస్ గుత్తికొండను నాట్స్ ఛైర్మన్ గా బోర్డు ఎన్నుకుంది. నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకారం ఫ్లోరిడాలోని టెంపా లోని ఎంబసీ హోటల్ లో ఘనంగా జరిగింది. నాట్స్ బోర్డు సభ్యులతో పాటు నాట్స్ నాయకగణమంతా ఈ కార్యక్రమానికి విచ్చేసింది. టెంపా లోనే నాట్స్ కు బీజాలు పడ్డాయని.. ఇప్పుడు అదే టెంపా నుంచి నాట్స్ కు ఛైర్మన్ రావడం ఆనందంగా ఉందని నాట్స్ నాయకులు తెలిపారు. అనంతరం, నాట్స్ బోర్డు సెక్రటరీ గా అరుణ గంటి, బోర్డు వైస్ చైర్మన్ గా శ్రీధర్ అప్పసాని లను బోర్డు నియమించింది.


జ్యోతి ప్రజ్వలన, గణేష్ ప్రార్ధన, అమెరికా జాతీయ గీతాలాపన అనంతరం, నాట్స్ డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు. ఇదే సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ నాట్స్ టెంపా నూతన చాప్టర్ ను కూడా ఇక్కడే ప్రారంభించడం జరిగింది. ఈ కొత్త చాప్టర్ కు శ్రీనివాస్ మల్లాది చాప్టర్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. శ్రీనివాస్ మల్లాది తన కార్యవర్గ సభ్యులను వేదికపై పిలిచి అందరికి పరిచయం చేశారు. అందరూ  భాషే రమ్యం సేవే గమ్యం అనే నాట్స్ నినాదాన్నినిలబెట్టి సమాజ సేవకు పునరంకితమవుతామని ప్రతిన బూనారు.

 

నాట్స్ హెల్ఫ్ లైన్ ప్రారంభదశలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గుత్తికొండ బోర్డు ఛైర్మన్ గా రావడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు వక్తలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. నాట్స్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని నాట్స్ బోర్డు ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు.నాట్స్ తాజా మాజీ ఛైర్మన్ శ్యామ్ మద్దాళి తమ పదవి కాలంలో చేపట్టిన సేవాకార్యక్రమాలను వివరించారు. కొత్తగా నాట్స్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గుత్తికొండను అభినందించారు. నాట్స్ సేవా పథాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో శ్రీనివాస్ గుత్తికొండ కీలక పాత్రపోషిస్తారనే ఆశాభావాన్ని నాట్స్ బోర్డు మాజీ ఛైర్మన్ మధు కొర్రపాటి వ్యక్తం చేశారు. టెంపాలో నాట్స్ ఆరంభం నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డు సభ్యులతో , చాప్టర్ కోఆర్డినేటర్లు, జోనల్ వైస్ ప్రెసిడెంట్లు తో పాటు టెంపాలో ఉండే తెలుగు ప్రముఖులు, నాట్స్ వాలంటీర్లు విచ్చేశారు.

 

నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ మాట్లాడుతూ సామ్ మద్దాళి కు కృతజ్ఞతలు తెలియచేస్తూ, నూతన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియ చేశారు. ఇద్దరూ కలిసి, ఇతర బోర్డు సభ్యుల సహకారంతో నాట్స్ సేవా కార్యక్రామాలను  విస్తరింపచేయాటానికి కృషి సల్పుతానని తెలియచేసారు.


టాంప బే  లోని ఎంబసి హోటల్ లో 500 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు, ప్రముఖ డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు విశేషంగా హాజరయ్యారు. బావార్చి వారి విందు భోజనం అందరి మన్ననలను పొందింది.

 



అనంతరం హారిక, రఘురాం ల సంగీత విభావరి అలరించింది.  ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చి దిద్దిన శ్రీనివాస్ గుత్తికొండను మరియు టెంపా చాప్టర్ మొత్తం కార్యవర్గ సభ్యులను వాలంటీరులను ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తారు.

TeluguOne For Your Business
About TeluguOne
;