పాపం రోజా!
posted on Sep 2, 2015 7:55PM
.jpg)
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మొదటి రెండు రోజులు తెదేపాతో హోరాహోరీగా పోరాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వర్ధనతి కావడంతో సభకు రాలేదు. జగన్ లేని ఆ లోటుని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా, జ్యోతుల నెహ్రు తీర్చే ప్రయత్నం చేసినప్పటికీ అధికార పార్టీ సభ్యుల ముందు గట్టిగా నిలబడలేకపోయారు.
పరిటాల రవి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, సభలో ఉన్న మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఆనాడు రోజా మాపార్టీలో ఉన్నప్పుడు నా భర్త మరణానికి వై.యస్సారే కారకుడని ఆరోపించేవారు. కానీ తరువాత ఆ వైయస్సార్ కొడుకు జగన్ పార్టీలోనే చేరి ఇప్పుడు నన్ను, నా కొడుకును హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ నిందించడం విచిత్రంగా ఉంది,” అని జవాబిచ్చినప్పుడు రోజా పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చును.
మళ్ళీ రిషితేశ్వరి ఆత్మహత్య గురించి ప్రస్తావించి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆమె తల్లితండ్రులను పిలిపించుకొని మాట్లాడిన తరువాత శ్రీమంతుడు ఆడియో రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిపోయారని రోజా ఆరోపించినప్పుడు మంత్రి గంటా ఇచ్చిన జవాబుతో మరోమారు కంగు తిన్నారు.
“రిషితేశ్వరి తల్లి తండ్రులను నా కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడిన మాట వాస్తవం. అలాగే శ్రీమంతుడు సినిమా ఫంక్షన్ కి విమానంలో వెళ్ళడం వాస్తవమే. ఆరోజున ముఖ్యమంత్రితో సమావేశం ఉన్న కారణంగా నేను స్వయంగా రిషితేశ్వరి తల్లి తండ్రుల ఇంటికి వెళ్లి కలవలేనని వారినే పిలిపించుకొని మాట్లాడాను. వారు కూడా అందుకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే కోరారు. శ్రీమంతుడు సినిమా కార్యక్రమానికి నాకు బాగా కావలసినవారు, చాలా ఆప్తులు ఆహ్వానించారు. వారి అభ్యర్ధనను కాదనలేకనే నేను హైదరాబాద్ వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్ళలేదు. ఒక సాదాసీదా సినిమా కార్యక్రామంలో పాల్గొనడానికి మాత్రమే వెళ్లాను. ఆ కార్యక్రమానికి వైకాపాకి చెందిన కొందరు నేతలు కూడా హాజరయ్యారు. అందులో తప్పేమీ లేదనే అనుకొంటున్నాను. విజయవాడలో ఉన్న నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి విమానంలో వెళ్ళడం కూడా తప్పని నేను భావించడం లేదు,” అని మంత్రి గంట జవాబిచ్చారు.