జగన్ పార్టీ మరో పి.ఆర్.పి. అవుతుందా?
posted on Apr 20, 2012 10:33AM
జగన్ ప్రారంభించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా తయారవుతుందా? అని అనుమానం వస్తోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆ తర్వాత 2009 ఎన్నికలు జరిగే సమయంలో పి.ఆర్.పి. ప్రధాన కార్యదర్శిగా వున్న అల్లు అరవింద్ ఒక సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో వున్న 294 స్థానాలలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న రెండు స్థానాలు మినహా మిగిలిన 292 స్థానాలు ప్రజారాజ్య, పార్టీవేనని ప్రకటించారు.
చివరకు చిరంజీవి స్వయంగా పాలకొల్లులో ఓడిపోవడంతో పాటు కేవలం 18 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం నాడు అల్లు అరవింద్ ప్రకటించినట్టుగానే నేడు జగన్ మరో అడుగు ముందుకు వేసి తమ పార్టీ ఏకంగా 2014 ఎన్నికల్లో 294 స్థానాలు గెలుపొందుతుందని ప్రకటించారు. 294 స్థానాలు తమపార్తీనే గెలుస్తుందని ప్రకటించడాన్ని ప్రజలు అతిశయోక్తిగా భావించడమే కాకుండా జగన్ ధోరణి చూస్తుంటే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కూడా పి.ఆర్.పి. బాటలో పయనిస్తుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విశ్లేషణల మాట ఎలా ఉన్నా ఒకప్పుడు వై.ఎస్. కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న కె.వి.పి. రామచంద్రరావు ఇటీవల ఢిల్లీలో తనకు అత్యంత సన్నిహితులతో మాట్లాడుతూ జగన్ ఏనాటికైనా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పరు. కె.వి.పి. అంచనాలు నిజమైతే ఏదో ఒకనాడు పి.ఆర్.పి. లాగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనమైనా ఆశ్చర్యపోనక్కరలేదు.