తెలంగాణాకు మద్దతుగా చంద్రబాబు లేఖ?
posted on Apr 20, 2012 10:38AM
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా తెలుగుదేశంపార్టీ ఉనికి దెబ్బతినకుండా వుండటం కోసం తెలుగుదేశంపార్టీ తెలంగాణా ఫోరమ్ నేతలు ఎత్తుగడ వేస్తున్నారు. ఆ ఎత్తుగడలో భాగంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశంపార్టీకి అభ్యంతరం లేదనే విధంగా పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు నుంచి లేఖను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ విషయంలో ఎటువంటి నిర్ణయం చేయలేని స్థితిలో వుందని అందువల్ల తెలుగుదేశంపార్టీ లేఖ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయదని వారి అభిప్రాయం.
ఇప్పటి వరకు ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటుసభ్యుల ప్రగల్భాలు మినహా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి లేఖ ఇవ్వలేదు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నోటి నుంచి కనీసం తెలంగాణ అనే పదాన్ని వెలువడలేదు. అందువల్ల ఎటువంటి ఇబ్బంది వుండదని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల తెలంగాణ ప్రజలలో నమ్మకం సడలిందని, ప్రస్తుతం గత్యంతరం లేకనే తెలంగాణ ప్రజలు టి.ఆర్.ఎస్. కు ఓటు వేస్తున్నారని, ఈ స్థితిలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం ద్వారా తెలుగుదేశంపార్టీ తెలంగాణలో అన్యూహ్యమైన ప్రజామద్ధాటు పొందవచ్చునని వీరి నమ్మిక. కోస్తాప్రాంతంలో జగన్ పార్టీ కారణంగా సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ లో చీలిక వస్తుందని దాంతో 2014 ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చునని తెలంగాణా నేతల అభిప్రాయం. ఈ మేరకు పార్టీ అధ్యక్షునికి వివరించి లేఖ పొందాలని వీరు భావిస్తున్నారు.