ఈ ఓదార్పు యాత్రలు ఇంకెన్నేళ్ళు చేస్తారో...ఏమి సాధిస్తారో?

 

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయి ఆరేళ్ళయింది. కానీ నేటికీ ఆయన పేరుతో తెలంగాణాలో వైకాపా ఓదార్పు యాత్రలు కొనసాగిస్తోంది. సాధారణంగా మనిషి చనిపోయిన వెంటనే ఎవరయినా వెళ్లి ఓదార్చి వస్తుంటారు. కానీ ఈవిధంగా ఆరేళ్ళ తరువాత షర్మిల వెళ్లి ఓదార్చడం చాలా విడ్డూరంగా ఉంది. మరణించిన వారి కుటుంబ సభ్యులే ఆ బాధ నుండి బయటపడి తమ నిత్యజీవిత కార్యక్రమాలలో కొనసాగిపోతుంటే వారికి చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసి మరీ ఓదార్చడం కేవలం వైకాపాకే సాధ్యం. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఇంతవరకు స్వయంగా తెలంగాణా జిల్లాలలో అడుగుపెట్టలేదు. ఆయన తరపున పార్టీలో ఏ పదవిలో లేని షర్మిల తెలంగాణాలో ఓదార్పు యాత్రలు నిర్వహిస్తున్నారు.

 

తెలంగాణాలో ప్రస్తుతం తను చేస్తున్న ఓదార్పు యాత్రలు వ్యక్తిగతమయినవే తప్ప రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్నవి కావని షర్మిల చెపుతుంటారు. కానీ ఆమె ఓదార్పు యాత్రలకి వైకాపా రూట్ మ్యాప్, షెడ్యూల్, ప్రచారం చేసి ఆమె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలకి పిలుపునిస్తుంటుంది. మరి దాని అర్ధం ఏమిటో ఆమే చెప్పాలి. బాధలో ఉన్న ఒక కుటుంబాన్ని ఓదార్చడానికి బయలుదేరుతున్నప్పుడు అదేదో ఘనకార్యం చేయడానికి బయలుదేరుతున్నట్లు ఇంతగా ప్రచారం చేసుకొనవసరం లేదు. ఇంత ఆర్భాటంగా బయలుదేరనవసరం లేదు. చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చడానికి బయలుదేరుతూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలిరావాలని కోరడం చాలా పెద్ద తప్పు.

 

ఆమె ఏఏ నియోజక వర్గాలలో ఎన్ని వందల కి.మీ. పర్యటించి ఎన్ని కుటుంబాలను కలిసి ఓదార్చారో మీడియాలో గొప్పగా గణాంకాలు ప్రకటించుకోవలసిన అవసరం అంతకంటే లేదు. కానీ వైకాపా చేసుకొంటోంది. అంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఆపని చేస్తోందని స్పష్టం అవుతోంది. కానీ ఆ విషయంలో కూడా దానికి ఎటువంటి స్పష్టత ఉన్నట్లు లేదు. అసలు తెలంగాణా రాష్ట్రంలో ఆ పార్టీ ఏమి సాధిద్దామనుకొంటోంది...ఆ పార్టీ భవిష్య ప్రణాళికలు ఏమిటి...తమ రాజకీయ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోంది? అనే విషయాల గురించి కనీసం ఆ పార్టీ నేతలకయినా తెలుసో తెలియదో అనుమానమే. ఎందుకంటే ఒకవేళ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోదలిస్తే, రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పార్టీలలాగే వైకాపా కూడా చాలా చురుకుగా ప్రజా సమస్యలపై పోరాడాలి. కానీ కనీసం తన ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అదే ఆంధ్రాలో వైకాపా నిత్యం ఏదో ఒక సమస్య, అంశం తీసుకొని ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, బందులు చేస్తూ అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో వైకాపా వ్యవహరిస్తున్న తీరులో కనిపిస్తున్న ఈ తేడాను గమనించినట్లయితే, తెలంగాణాపై ఆ పార్టీకి పెద్దగా ఆసక్తి లేదని స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు ఇంత శ్రమపడి ఈ ఓదార్పు యాత్రలు చేయడం దేనికో వారికే తెలియాలి.

 

అక్టోబర్ మూడు నుండి ఆరు వరకు మూడు రోజుల పాటు అదిలాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది మండలాలలో 10కుటుంబాలను ఓదార్చుతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ తెలిపారు. ఈ మూడు రోజుల యాత్రలో షర్మిల మొత్తం 1100 కి.మీ. పర్యటింస్తారని తెలిపారు. పార్టీ నాయకులూ, కార్యకర్తలు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు అందరూ ఆమెకి స్వాగతం పలికేందుకు తరలిరాలని ఆయన పిలుపునిచ్చారు!!!