పోలవరంపై ఏపీ, తెలంగాణా కాంగ్రెస్ నేతల ద్వంద వైఖరి

 

రాష్ట్ర విభజన అంశాలపై కాంగ్రెస్ పార్టీ తన ద్వంద వైఖరిని మళ్ళీ మరొక్కమారు తనే స్వయంగా బయటపెట్టుకోబోతోంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాంగ్రే పార్టీయే. ఆ ప్రాజెక్టు క్రింద ముంపుకి గురయ్యే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంధ్రాలో కలపాలని నిర్ణయించింది కూడా ఆ పార్టీయే. ప్రత్యేక హోదాలాగ పోలవరం గురించి పార్లమెంటులో ఏదో నోటిమాటగా చెప్పకుండా దానిని రాష్ట్ర విభజన బిల్లులో కూడా చేర్చి పార్లమెంటు చేత ఆమోదింపజేసింది కూడా ఆ పార్టీయే. కానీ ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ నేతలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ తోనే నిర్మించినట్లయితే దానివలన అక్కడ నివసిస్తున్న నివసిస్తున్న గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కనుక పోలవరం నిర్మాణం, దాని పర్యవసానాల గురించి తెలంగాణా శాసనసభలో చర్చించేందుకు తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఈ విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్రప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ముంపు గ్రామాలలో గిరిజనుల తరపున నిలబడి పోరాటాలు చేయాలని నిర్ణయించారు.

 

గతేడాది మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన వెంటంటే ఖమ్మం జిల్లాలో ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తెరాస నిరసించినప్పుడు ఖమ్మం జిల్లాతో సహా తెలంగాణా కాంగ్రెస్ నేతలు అందరూ మౌనం వహించారు. ఎందుకంటే తమ పార్టీయే ఆ ప్రతిపాదనని విభజన బిల్లులో చేర్చించి కనుక. కానీ ఏడాదిన్నర తరువాత ఇప్పుడు అకస్మాత్తుగా ముంపు ప్రాంతాలలో గిరిజనులపై ప్రేమ పుట్టుకు వచ్చింది.

 

ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేసిన ఘనత తమదేనని కానీ తెదేపా ప్రభుత్వం పోలవరాన్ని పక్కనబెట్టేసి పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెడుతోందని విమర్శిస్తున్నారు. తమ యూపీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా మోడీ ప్రభుత్వం దానికి తగినన్ని నిధులు విడుదల చేయడం లేదని విమర్శిస్తున్నారు. అంటే పోలవరం పనులను వేగవంతం చేసి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని వారు కోరుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హయంలోనే పోలవరం ప్రాజెక్టు (ఇందిరా సాగర్) పనులు మొదలయ్యాయి. అప్పటి నుండి కాంగ్రెస్ తో సహా అన్ని ప్రభుత్వాలు దానిపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి కూడా. కానీ దశాబ్దాల తరబడి సాగుతున్నా ఇంతవరకు ఆ ప్రాజెక్టు పూర్తి కానేలేదు. అది కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించే ప్రాజెక్టుగా మారిందే తప్ప దాని నుండి నీటి చుక్క బయటకు రాలేదు.

 

దాని గురించి కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఇన్నేళ్ళలో ఈవిధంగా మాట్లాడలేదు. ఇంత శ్రద్ద కనబరచలేదు. కానీ కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారేసరికి ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ నేతలకి ఇప్పుడు హటాత్తుగా పోలవరం గుర్తుకు వచ్చేసింది. ఆంధ్రా కాంగ్రెస్ నేతలు పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుంటే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటాలకి సిద్దం అవుతున్నారు. ఆంధ్రాలో ప్రజలకు దగ్గరవడానికి కాంగ్రెస్ నేతలు పోలవరం గురించి మాట్లాడుతుంటే, తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు కూడా దానిని వ్యతిరేకించడం ద్వారా తెలంగాణా ప్రజలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

 

ఈవిధంగా ఒకే అంశంపై రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఇంత ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వారు ఆడుతున్న ఈ కపట నాటకాలను ప్రజలు తెలుసుకోలేరనే ఉద్దేశ్యంతోనే బహుశః ఈ విధంగా ప్రవర్తిస్తున్నరేమో? రాష్ట్ర విభజన సమయంలో ఇలాగే కపట నాటకాలు ఆడినందుకే రెండు రాష్ట్రాలలో ప్రజలు ఆ పార్టీని ఎన్నికలలో తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన పద్దతులను అంత త్వరగా మార్చుకోవడం లేదు.