అభివృద్ధికి అడ్డుపడుతూ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షాలు
posted on Sep 24, 2015 11:27AM
రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునాది నుండి నిర్మించుకోవలసివస్తోంది. అంతకంటే వేరేమార్గం లేదు కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేప్పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా రాజధాని నిర్మాణం, దానికోసమే ప్రత్యేకంగా విజయవాడ వద్ద కొత్తగా 800 మెగావాట్స్ సామర్ధ్యంగల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, గన్నవరం విమానాశ్రయ విస్తరణ, భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటు, బందరులో కొత్తగా పోర్టు నిర్మాణం, విజయవాడ, విశాఖ నగరాలలో మెట్రో రైల్ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, అనంతపురంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చిత్తూరులో పారిశ్రామిక సంస్థలు ఇలాగా చాలా పెద్ద లిస్టే ఉంది. గత ఐదారు దశాబ్దాల కాలంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఒకేసారి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేప్పట్టబడలేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి మంత్రం జపిస్తూ ఒకేబాటలో సాగిపోతున్నందునే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి.
కానీ రాష్ట్ర ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, అధికారం కోసం పరితపించిపోతున్న వైకాపా రెండూ కూడా ఒకవైపు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా రావాలని అందుకోసం పోరాడాలని ప్రజలను, విద్యార్ధులను రెచ్చగొడుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే మెల్లగా తేరుకొని ముందుకి అడుగులు వేస్తున్నప్పుడు కాంగ్రెస్, వైకాపాలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రంలో బందులు, ధర్నాలు, ర్యాలీలు అంటూ అరాచక పరిస్థితులు సృష్టిస్తే, ప్రత్యేక హోదా వస్తుందో లేదో తెలియదు కానీ వారు చేస్తున్న ఈ నిర్వాకానికి ప్రత్యేక హోదా వచ్చినా కూడా కోలుకోలేనంతగా రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది.
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిపక్ష నేతలు నిజంగా అంత పరితపించిపోతున్నట్లయితే ఈవిధంగా అభివృద్ధి నిరోధకులుగా నిలబడేబదులు, వారు కూడా తమకున్న పరపతిని ఉపయోగించి రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలి. ఆ బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే అని చేతులు దులుపుకోకుండా రాష్ట్రాభివృద్ధి కోసం తమవంతు సహాయ సహకారాలు కూడా అందిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ అటువంటి బాధ్యత తీసుకోదలచుకోకపోయినా పరువాలేదు, కానీ మిగిలిన ఈ మూడున్నరేళ్ళ కొద్దిపాటి సమయంలో రాష్ట్రంలో మొదలయిన ఈ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకుండా ఉంటే అంతే చాలు. ప్రజలు చాలా సంతోషిస్తారు.
వచ్చే ఎన్నికల నాటికి దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు ఏవిధంగా ఉంటాయో ఎవరికీ తెలియదు. కనుక దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలన్నట్లు వీలయినంత వేగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు అడుగడుగునా అడ్డుపడకుండా ఉంటే చాలు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందితే ప్రజలు మళ్ళీ తెదేపా వైపే మొగ్గు చూపుతారనే భయంతో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడినట్లయితే అందుకు మళ్ళీ అవే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని గుర్తుంచుకోవాలి.
ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోనందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేశారు. రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాల చితికిపోయిన రాష్ట్రాన్ని వీలయినంత త్వరగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకొంటున్నారు. దాని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నప్పుడు, ప్రతిపక్షాలు అడ్డుపడినట్లయితే వచ్చే ఎన్నికలలో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపించి ప్రభుత్వాన్ని విమర్శించవచ్చును. కానీ ఏదో ఒక సాకుతో అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డుపడటం సరయినది కాదు.