చిత్తశుద్ధి లేని పోరాటాలు ఎన్ని చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం?
posted on Dec 4, 2014 7:24AM
తెలుగుదేశం పార్టీ అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, కానీ తను మాత్రం అధికారం కోసం అటువంటి అబద్దాలు చెప్పకపోవడంతో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఎన్నికలలో ఓడిపోయామని వై.యస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటినుండీ ఆయన ఇదే అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ధర్నాలు కూడా చేశారు, రేపు కూడా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతుల రుణాలమాఫీ కోసమే చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితో ఈ ధర్నాలు చేస్తున్నారా? అని ప్రశ్నించుకొంటే కాదనే అర్ధమవుతోంది. అనేక కేసులలో నిందితుడుగా ఉన్న తనను ప్రజలు ఎందుకు తిరస్కరించారో గ్రహించకుండా, తన ఓటమి నుండి ఎటువంటి పాటాలు నేర్చుకోకుండా, ఓదార్పు యాత్రల పేరుతో ఏవిధంగా తన పార్టీని బలోపేతం చేసుకొన్నారో అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయ రుణాలమాఫీ కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెపుతూ తన పార్టీని కాపాడుకొంటూ బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారనే సంగతి ప్రజలు గ్రహించలేరని వైకాపా భావించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదని వాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం రుణాల మాఫీకి చేస్తున్న కసరత్తును చూస్తూ కూడా ధర్నాలు చేయాలనుకోవడం గమనిస్తే ఈ వ్యవహారంలో ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతూనే ఉంది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని పాలించాలనే తన చిరకాల కోరిక నెరవేరకుండా చంద్రబాబు అడ్డుపడ్డారనే దుగ్ధ ఆయన మాటలలో స్పష్టంగా కనబడుతోంది. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయామని ఆయన పదేపదే చెప్పుకోవడమే అందుకు ఉదాహరణ. తనకు అధికారం దక్కకుండా చేసినందుకు చంద్రబాబుపై పగతో రగిలిపోతున్నందునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (చంద్రబాబు నాయుడు) మెడలు వంచుతానని భింకాలు పలుకుతున్నారని కూడా అర్ధమవుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఆయన, తెలంగాణా ప్రభుత్వం, పోలవరం, నీళ్ళు, విద్యుత్, ఉద్యోగాలు, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్స్ మెంట్, ఇంటర్ మీడియేట్ పరీక్షల నిర్వహణ వంటి అనేక అంశాలలో ఆంద్ర రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తుంటే ఏమాత్రం స్పందించక పోవడం గమనిస్తే, వైకాపా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పోరాటాలలో నిజాయితీ ఏపాటిదో అర్ధమవుతూనే ఉంది. పొరుగు రాష్ట్రం తన ప్రజలపై, ప్రభుత్వంపై ఇంత దాష్టికం చేస్తుంటే దానితో పోరాడే బదులు, దాని తరపునే వకల్తా పుచ్చుకొని ప్రజలెన్నుకొన్న ఆంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని జగన్మోహన్ రెడ్డి ప్రతిజ్ఞలు చేయడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన చేపడుతున్న ధర్నాలకు, దీక్షలకు ప్రజా స్పందన కొరవడుతోంది.
రుణాల మాఫీ, రాజధాని భూసేకరణ, హుడ్ హుడ్ తుఫాను, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు కావేవీ విమర్శలకు, పోరాటాలకు అనర్హం అన్నట్లు ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తూ, వాటి నుండి రాజకీయ లబ్ది పొందేందుకు ఆరాటపడుతూ, ఇదంతా ప్రజల కోసమేనని ప్రజలను మభ్యపెడుతూ, తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు మూర్కులు వారికి ఏమీ అర్ధం చేసుకొనే శక్తి లేదనే చులకన భావం జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనబడుతోంది.
ఆయన ఈవిధంగా చిత్తశుద్ధిలేని పోరాటాలు చేసినందుకే ఎన్నికలలో వైకాపాను ప్రజలు తిరస్కరించారు. అయినప్పటికీ నేటికీ ఆయన తీరు మారలేదని అర్ధమవుతోంది. ఆయన ఏమి చేసి తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారో అవే వైకాపాకు శాపంగా మారుతున్నాయని చెప్పవచ్చును. ఇదంతా చూస్తున్నప్పటికీ పిల్లి మెడలో గంట కట్టే సాహసం చేయలేక వైకాపాలో సీనియర్లు సైతం నిస్సహాయంగా చూస్తుండి పోయిన్నట్లుంది. ఇదంతా చూస్తుంటే వైకాపాకు ప్రధమ శత్రువు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డేనని ఎవరికయినా అనిపించక మానదు.