రాజకీయ పార్టీల వైరానికి ప్రజా సమస్యల కలరింగ్?

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలన్నీ ప్రజల కోసమేనని చెప్పుకోవచ్చుగాక, కానీ అవన్నీతన పార్టీని బలోపేతం చేసుకోవడానికి, పార్టీ శ్రేణులను చైతన్యవంతంగా ఉంచడానికి, తన పార్టీ ఎప్పటిలాగే చాలా బలంగా ఉందని నిరూపించుకొనే ప్రయత్నంలో బలప్రదర్శన చేయడానికి, అధికారంలో ఉన్న తన రాజకీయ ప్రత్యర్ధి తెదేపాను ఇరుకున బెట్టేందుకేనని అందరికీ తెలుసు. ఆయన ఓదార్పు యాత్రలు చేసినా, సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసినా, ఇటువంటి ధర్నాలు దీక్షలు ఏవి చేసినా వాటన్నిటి పరమార్ధం, అంతిమ లక్ష్యం ఇవే తప్ప బయటకు చెపుతున్న కారణాలు మాత్రం కాదని అందరికీ తెలుసు. అయితే ఇటువంటి పోరాటాలకు జనాలు స్వచ్చందంగానో లేక ఆయా పార్టీలు జనసమీకరణ చేయడం వల్లనో భారీగా హాజరవడం కనిపిస్తోంది గనుక తము చేస్తున్న ఆ పోరాటాలకు ప్రజామోదం కూడా ఉందని రాజకీయ పార్టీలు భ్రమించడమే కాకుండా ప్రజలను కూడా భ్రమింపజేయాలని ప్రయత్నిస్తుంటాయి. కానీ తాము చేస్తున్న ఈ పోరాటాలకు నిజంగా జానామోదం ఉందా లేదా అనేది ఇప్పుడు ఏ రాజకీయపార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ కార్యక్రమంలో జనాలు బాగా ఉన్నారా లేరా? దానికి మీడియా కవరేజి బాగా వచ్చిందా లేదా అని మాత్రమే చూసుకొంటున్నారు.

 

ప్రజలు కూడా ఈ రాజకీయ వికారాలను చాలా అసహ్యించుకొంటున్నారనే సంగతి రాజకీయ నేతలకి తెలియదనుకోలేము. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలకంటే తాత్కాలిక ప్రయోజనాలే మిన్న అని భావించే నేతలు, తాత్కాలికంగా ప్రజలను ఆకట్టుకొని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ బలపడేందుకు ఇటువంటి అంశాలను అందిపుచ్చుకొని అధికార పార్టీపై పోరాటాలు చేయడం చాలా సహజమని ప్రజలు భావిస్తున్నారని, రాజకీయ పార్టీలు భ్రమలో ఉన్నందునే తమ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరంతో చేస్తున్న ఈ పోరాటాలకు ప్రజా సమస్యల కోసం చేస్తున్న పోరాటాలుగా కలరింగ్ ఇవ్వగలుగుతున్నారు.

 

అయితే ప్రజలు కూడా వారి ఈ రాజకీయ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారు. అందుకే తమకు అవకాశం వచ్చినప్పుడు వారికి కొర్రు కాల్చి వాతలు పెడుతున్నట్లు గుణపాటం చెపుతున్నారు. . ప్రజలలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తున్న ఈ కాలంలో కూడా రాజకీయ పార్టీల, వాటి నేతల ఆలోచనా తీరులో ఎటువంటి మార్పు కనబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.