రాష్ట్రంలో బీజేపీ బలడితే తెదేపాకు ఇబ్బందవుతుందా?

 

దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ అందుకోసం అవి ఎటువంటి పద్దతులు అనుసరిస్తున్నాయనేది ఆ పార్టీల తీరును ప్రతిభింబిస్తుంది.

 

ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మూడూ కూడా సభ్యత్వ నమోదు ద్వారా పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస ఇతర పార్టీల యం.యల్యే.లను తమ పార్టీలోకి ఆకర్షించడం ద్వారా ప్రత్యర్ధ పార్టీలను నిర్వీర్యం చేసి తను బలపడాలని భావిస్తోంది. కానీ ఆంధ్రలో అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం మాత్రం అటువంటి ప్రయత్నాలు చేసేందుకు అయిష్టత కనబరుస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఎవరయినా వారంతట వారే వచ్చి చేరాలనుకొన్నవారిని కూడా వారిని పెద్దగా ప్రోత్సహించడం లేదు. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండటమే అందుకు కారణమని చెప్పవచ్చును. ఇటీవల ఆ పార్టీ ఆరంభించిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఊహించిన దానికంటే చాలా మంచి స్పందన రావడమే అందుకు చక్కటి నిదర్శనం.

 

తెదేపాకు మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆరంభించింది. దానితో బాటే కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. వారు కూడా తమ పార్టీ రాజకీయ భవిష్యత్ అంధకారంగా కనిపిస్తున్న కారణంగా కావచ్చు లేదా మరే ఇతర కారణాల వల్లనయితేనేమి బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. అయితే తమ ఈ ప్రయత్నాలు తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికే తప్ప తెదేపాకు ఇబ్బందికలిగించడానికో లేకపోతే ఆ పార్టీని బలహీన పరిచేందుకో కాదని బీజేపీ సభ్యుడు మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులను తమ పార్టీలో చేరేందుకు అనుమతించబోమని ఆయన స్పష్టం చేసారు. రెండు పార్టీల మధ్య ఈ మైత్రి ఇక ముందు కూడా ఇదేవిధంగా చక్కగా కొనసాగుతుందని, ఈ విషయంలో ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకొనవసరం లేదని ఆయన స్పష్టం చేసారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినప్పుడు, ఆయన వంటి బలమయిన నాయకుడు పార్టీకి అవసరమని భావించినందునే ఆయనను పార్టీలోకి తీసుకొన్నామని ఆయన అన్నారు.

 

ఈనెల 20,21 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్, వైకాపా నేతలు బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో మంత్రి కామినేని చేసిన ఈ వ్యాఖ్యలు అందుకు రంగం సిద్దం చేస్తున్నట్లున్నాయి.

 

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు బలంగా ఉండటం చాలా మంచి విషయమే. తెదేపా, బీజేపీల మధ్య చక్కటి సయోధ్య ఉన్నంత కాలం బీజేపీ బలపడితే తెదేపాకు, తెదేపా బలపడితే బీజేపీకి మంచిదే. మోడీ, అమిత్ షాల నేతృత్వంలో బీజేపీని ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అదే సమయంలో వారిరువురూ మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా. ఎన్డీయే ప్రభుత్వంలో మిత్ర పక్షాలన్నిటికీ కీలకమయిన కేంద్రమంత్రి పదవులు ఇవ్వడం, అదేవిధంగా మహారాష్ట్రాలో తనతో విభేదించిన శివసేన పార్టీని కూడా తిరిగి ప్రభుత్వంలో భాగస్వామిని చేసుకోవడం అందుకు మంచి ఉదాహారణలుగా చెప్పుకోవచ్చును.

 

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలపడగలిగినట్లయితే, తెదేపాను మరికొన్ని అదనపు సీట్లు కోరవచ్చును. లేదా రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. అందువలన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నప్పటికీ దాని వలన, అందరూ ఊహిస్తున్నట్లుగా అధికార తెదేపాకు ఎటువంటి నష్టమూ ఉండబోదు.