మేథావుల పార్టీగా వై.కా.పా. చూపేందుకు కసరత్తులు
posted on Jun 25, 2012 10:23AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మేథావుల పార్టీగా చూపేందుకు కసరత్తులు చేస్తున్నారు. అందుకే పార్టీలో కొత్తకొత్త విభాగాలను పుట్టిస్తున్నారు. వీటి సహాయంతో పార్టీకి కొత్తగా సిద్ధాంతాలను సృష్టించి మేథావుల పార్టీగా అనిపించేందుకు బులెటిన్‌లు కూడా అందజేయనున్నారని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఈ బులెటిన్‌లు ఆధారంగానే ఆ నెలలో ఉన్న సమస్యలపై నేతలు, కార్యకర్తలు కార్యాచరణ రూపొందించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సమస్యను ఏ కోణంలో చూడాలో అన్న అంశాన్నీ మేథావుల విభాగం డైరెక్షన్ ఇస్తోంది. దీంతో కమ్యూనిస్టుపార్టీల మూలసిద్ధాంతాలను ఎలా ప్రచారం చేస్తుందో అదే తరహాలోకి వై.కా.పా. చేరుతోంది. అంటే తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేకుండా బులెటిన్‌లను రూపొందిస్తారు. ఈ బులెటిన్‌లు చదవటమే వారికి శిక్షణ. ప్రధానంగా ఈ మేథావుల వింగ్‌లో కీలకంగా ప్రొఫెసర్ల విభాగం ఉంటుంది. దీనిలో కొత్తసభ్యులకు వై.కా.పా.నేత సోమయాజులు స్వాగతం పలికి సభ్యత్వం ఇచ్చారు. సమాజంలో వస్తున్న సామాజిక ఆర్థిక మార్పులపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి నివేదికలను ముఖ్యనేతలకు అందిస్తామని ఈ విభాగం సభ్యులు ప్రకటించారు. వీరి నివేదికలను సాక్షిపత్రికల్లో వ్యాసంగా ప్రచురించటం, బులెటిన్‌లు రూపొందించటం కోసం కూడా ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే ధర్నాలు, ఆందోళనాకార్యక్రమాలు రూపొందించవచ్చు.
అలానే కీలకమైన అంశాలపై పార్టీ ఎలా స్పందిస్తుందో గమనించి నేతలు తమ ప్రసంగాలను దానికి అనుగుణంగా చేయవచ్చు. ఏమైనా మేథావుల పార్టీగా వై.కా.పా. త్వరలో జనం ముందు నిలబడేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో తమ పార్టీ ఎలా వ్యవహరించాలనే విషయం త్వరలో వై.కా.పా. ప్రొఫెసర్ల విభాగం బయటపెడుతుంది. ఈ విభాగం తొలినివేదిక ఎలా ఉంటుందన్న అంశంపై మాత్రం అన్ని పార్టీలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.