తోటకు మంత్రిపదవి
posted on Jun 25, 2012 10:41AM
రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాదాపు 12వేల మెజార్టీతో గెలుపొందిన తోటకు మంత్రి పదవి ఇస్తే బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గ నేతగా తోటత్రిమూర్తులుకు పేరుంది. ఈ వర్గం శాంతిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకలాంటిదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకనైనా తోటకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలే సిఎం కిరణ్‌కుమర్‌రెడ్డికి సూచిస్తున్నారు. పైగా, గెలిచిన రెండు స్థానాల్లో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌పై విజయం సాధించటం అంటే మాటలు కాదని రాజకీయ ఉద్దండులే అభిప్రాయపడుతున్నారు.
పిల్లి సుబాష్ చంద్రబోస్ రామచంద్రపురం నియోజకవర్గంలో బిసిల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన్ని ఈ నియోజకవర్గంలో ఓడించటమే కష్టం. అటువంటిది తోట త్రిమూర్తులు గెలిచినందుకు నియోజకవర్గంపై పట్టుఉండాలంటే ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఇంకోరకంగా చూస్తే కోనసీమకు మంత్రి పినిపే విశ్వరూప్, మెట్టప్రాంతానికి మంత్రి తోటనర్సింహం మధ్యలో జిల్లాకు కీలకమైన స్థానం రామచంద్రపురం. అందువల్ల ఇక్కడ కూడా మంత్రి పదవి ఇస్తే తూర్పుగోదావరి జిల్లాపై ముగ్గురుమంత్రులూ పట్టున్నవారే అవుతారని సూచనలు వస్తున్నాయి. రాజకీయంగా తూర్పుగోదావరి ఓటరు ఎటుతీర్పు ఇస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు మంత్రిపదవులు ఇవ్వకతప్పదని పలువురు నేతలు పట్టుబడుతున్నారు. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఎక్సయిజ్‌శాఖను కోరుకుంటున్నారు. కానీ, ఈ నియోజకవర్గం మొదలుకుని జిల్లాలో వెనుకబడిన తరగతులపై పట్టుకోసం, తరువాత (2014) ఎన్నికల్లో విజయం కోసం బిసి, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పదవి అయితే బాగుంటుందని మేథావులు సూచిస్తున్నారు.
చిత్రంగా ఈ విషయంపై ఎన్ని సూచనలు వచ్చినా సిఎం కిరణ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే మంత్రి పదవి ఇచ్చినా చిరంజీవి వ్యాఖ్యానాలు దృష్టిలో ఉంచుకుని కీలకశాఖ ఇవ్వకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. తాను సోనియాతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తోటత్రిమూర్తులు అనుచరులకు చిరంజీవి దాదాపు హామీ ఇచ్చారు. చిరంజీవి అక్కడికి వెళ్లేలోపే కిరణ్ తన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తోటను పిలిపించి మరీ మంత్రి పదవి కేటాయించవచ్చని కిరణ్ సన్నిహితులు భావిస్తున్నారు. ఎందుకంటే కిరణ్ సిఫార్సు కన్నా తాను స్వయంగా తీసుకునే నిర్ణయానికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని అందరికీ తెలిసిందే. అందుకే కిరణ్ పిలుపు కోసం రామచంద్రపురం నియోజకవర్గంలో తోట అభిమానులు ఎదురుచూస్తున్నారు.