మైసూర లాంగ్ జంప్ పై అంతుచిక్కని అంతర్యం!
posted on May 26, 2012 1:38PM
తెలుగుదేశం పార్టీలో నిన్నటి వరకూ రాజ్యసభ సభ్యునిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా వున్న మైసూరా రెడ్డి ఒక్కసారిగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లాంగ్ జంప్ చేయడం వెనుక అంతర్యం ఏమిటనే అంశంపై రాష్ట్రంలో చర్చజరుగుతుంది. మైసూరారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇరువురూ ఒకే జిల్లాకు చెందిన వారు కావడమే కాకుండా ప్రారంభం నుంచి ఇరువురు మధ్య రాజకీయవైరం వుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే సమయంలో వైఎస్ పై తీవ్ర ఆరోపణలు చేసారు. తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా వై ఎస్ రాజశేఖరరెడ్డి అవినీతిపై, జగన్ దోపిడీ విలువ ఎంతో లెక్కలు కట్టి పుస్తకాల రూపంలో ప్రచురించడంతోపాటు ఢిల్లీ స్థాయిలో రాష్ట్రపతి వంటి ప్రముఖులకు సమర్పించారు. అటువంటి బద్ధశత్రువైన మైసూరాను జగన్ తన పార్టీలోకి ఏవిధంగా ఆహ్వానించాడు.. ఎటువంటి ఆశను చూపించాడు అనేది అంతుపట్టకుండా వుంది. ఆర్థిక, కుటుంబం సమస్యల నేపధ్యంలో మైసూరా జగన్ కు లొంగిపోయినట్టు కడప వాసులు చెప్పుకొంటున్నారు. మొత్తంగా ఈ సంఘటన ద్వారా రాజకీయాలలో శాత్వత శత్రువులు..... శాశ్వత మిత్రులు వుండరనే లోకోక్తిని మరోసారి రుజువు చేశారు.