కాంగ్రెస్ లో కట్టలు తెంచుకుంటున్న క్రమశిక్షణారాహిత్యం!
posted on May 26, 2012 12:20PM
కాంగ్రెస్ పార్టీని ధిక్కరించే వారిపై క్రమశిక్షణ ఉంటుందా? లేక సర్దుకుపోతా? అన్న ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు దారి తీసింది. పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ తన ప్రకటనలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు క్రమశిక్షణ తప్పినా ఊరుకోమూ అని హెచ్చరించారు. కానీ, తెలుగుదేశం పార్టీ తీసుకున్నంత వేగంగా చర్యలు మాత్రం తీసుకోలేదు.
మైసూరారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, ఆయన జగన్ ముందే ఉన్నారని తెలిసిన వెంటనే ఆ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. కానీ, కాంగ్రెస్ గీతదాటితే ఊరుకోమన్న హెచ్చరికలు మాత్రమే చేసింది. జగన్ తో పాటు దిల్ కుష్ భవన్ కు వచ్చిన ఎంపీ సబ్బంహరి, ఎమ్మెల్యే ఆళ్ళనాని విషయంలో కాంగ్రెస్ ఇంకా ఎటువంటి క్రమశిక్షణ ప్రకటించలేదు. మాకు జగనే కావాలని వారిద్దరూ ఖచ్చితంగా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ఏమి చేసినా తామేమీ పట్టించుకోబోమని వారు స్పష్టం చేశారు.
మొదట అనుకున్న 18 మంది ఎమ్మెల్యేలే కాకుండా ఇంకా ఎంతమంది జగన్ చేతిలో ఉన్నారో? అన్న ప్రశ్న కొత్తగా తెర పైకి వచ్చింది. అవిశ్వాసం సమయంలో లెక్కించిన లెక్క తప్పయిందని ఆళ్ళ నాని నిరూపించారు. క్రమశిక్షణాచర్యలకు వెనుకాడబోమన్న బొత్సా వెంటనే ఎందుకు స్పందించి చర్యలు తీసుకోలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా సబ్బం హరి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గ్రూపును తయారు చేశారని విమర్శలూ ఎదుర్కొన్నారు. వీరిద్దరిపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్రమశిక్షణ చర్య తీసుకుంటుందనే విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. అసలు తీసుకుంటారా? లేదా? అన్నది తేల్చుకోవాలన్న కుతూహలమూ ఎక్కువ అవుతోంది.