గాలి కేసులో కీలక సమాచారం రాబట్టిన సిబిఐ

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణ సాగుతోందని సిబిఐ వర్గాలు చెప్పాయి. జగన్ కేసులో మరిన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామని సిబిఐ వర్గాలు చెప్పాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఇనుప ఖనిజం ట్రాన్స్‌పోర్టర్ కీలకమైన సమాచారాన్ని సిబిఐకి ఇచ్చినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఇంటి విలువను ఇంకా అంచనా వేయలేదని, త్వరలోనే నివేదిక వస్తుందని సిబిఐ ప్రకటించింది. టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఆస్తుల కేసులో సిబిఐ పురోగతి సాధించింది. రెండు రోజుల్లో సిబిఐ విచారణను ప్రారంభించనుంది. ఇందుకు సిబిఐ ప్రత్యేక బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో విచారణ 90 శాతం పూర్తయిందని, డిసెంబర్ 3వ తేదీలోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో కొత్తగా ఇతర ముద్దాయిలను చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డిని సిబిఐ విచారించే అవకాశం ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఐఎఎస్ అధికారి భాను సాక్ష్యాన్ని రికార్డు చేసినట్లు సిబిఐ చెప్పింది.  ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయని, మైనింగ్ వ్యాపారులు శశికుమార్, కొండా రెడ్డి నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పాయి. కాప్టివ్ మైన్స్‌ను గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారని చెప్పాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డిని, జగన్‍‌ను మళ్లీ ప్రశ్నించాల్సిన అవసరం లేదని అన్నాయి. గాలి పిఎ అలీఖాన్ పరారీలో ఉన్నాడని, అతను దొరికితే గాలి జనార్దన్ రెడ్డి గుట్టు రట్టవుతుందని అన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో డాక్యమెంట్ ఎక్పిప్‌మెంట్ చాలా ఉందని చెప్పాయి. బళ్లారి నుంచి ఓబుళాపురం వరకు ముడి ఇనుము రవాణా అయినట్లు తేలిందని వెల్లడించాయి. వైయస్ జగన్, ఎమ్మార్ కేసుల్లో సిబిఐ సోదా పత్రాలు తమకు ఇప్పించాలని ఆదాయం పన్ను శాఖ దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పును కోర్టు సోమవారం ఎల్లుండికి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu