సీఎం సభలో జగన్ వర్గం ఎమ్మెల్యే జగన్ కు గట్టి షాక్

అనంతపురం : వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన వర్గం శాసనసభ్యుడు ఒకరు గట్టి షాక్ ఇచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి గురువారం జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగ సభకు హాజరయ్యారు. బహిరంగ సభకు గుర్నాథ్ రెడ్డియే అధ్యక్షత వహించడం విశేషం. సభలో ప్రసంగించిన గుర్నాథ్ రెడ్డి జై వైయస్సార్, జై కాంగ్రెసు అని తన పూర్తి చేయడం మరో విశేషం. అయితే ఇదే సభ వేదికపై మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కనిపించలేదు. ఆయన సభకు గైర్హాజరయ్యారు. కాగా గత కొంతకాలంగా గుర్నాథ్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వైయస్సార్ పేరు సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ఉందన్న కారణంతో రాజీనామా చేసిన 26 మంది ఎమ్మెల్యేలలో గుర్నాథ్ రెడ్డి కూడా ఒకరు. అయితే కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు, జగన్‌కు ఢిల్లీలో ఓదార్పు లభించక పోవడం మరోవైపు సిబిఐ జగన్ ఆస్తులపై దర్యాఫ్తు వేగవంతం చేయడం తదితర పరిణామాల దృష్ట్యా గుర్నాథ్ రెడ్డి జగన్‌కు మద్దతు పలకడంపై వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.

కాగా,  మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. మీడియా 20 శాతం చెడును చూసి...80 శాతం మంచిని విస్మరిస్తోందన్నారు. మీడియా న్యూస్ను కాకుండా వ్యూస్ను ఇస్తోందని, ఒక్కో మీడియాకు ఒక్కో ఉద్ధేశం ఉందన్నారు. కెమెరాలు, టీవీలు, మీడియాని నమ్మి ప్రజలు మోసపోవద్దని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మీడియా సరైన సమాచారం ఇవ్వకుంటే వారి విశ్వసనీయత తగ్గుతుందన్నారు. 15 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాతే ప్రజల వద్దకు ఓటు అడిగేందుకు వెళతానని సీఎం అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu