గాలి ఆస్తులపై సీజర్ వారెంట్
posted on Sep 9, 2011 2:30PM
హై
దరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి ఆస్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టులో గురువారం సీజర్ వారెంట్ దాఖలు చేసింది. గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన కార్లు, బంగారం సహా 53 వస్తువుల స్వాధీనానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టులో సీజర్ వారెంట్ దాఖలు చేసింది. కాగా గాలి కస్టడీకి సిబిఐ పెట్టిన పిటిషన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో సిబిఐ తరఫు న్యాయవాది భోజన విరామం సమయానికి తన వాదనలు పూర్తి చేశారు. మధ్యాహ్నం గాలి జనార్ధన్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభం అవుతాయి. కస్టడీ పిటిషన్‌పై సిబిఐ తరఫు న్యాయవాది వాదిస్తూ నిందితులను కస్టడీకి తీసుకోని విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానానికి చెప్పారు. 2007 నుండి 2010 మార్చి వరకు కేటాయించిన స్థలంలో తవ్వకాలు జరపలేదన్నారు. మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు చేశాక ఓఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పదవిని సృష్టించారన్నారు. 2010 తర్వాత కూడా తవ్వకాలు జరిపినట్లు ఉపగ్రహ చిత్రాల ఆధారాలు ఉన్నాయన్నారు. కేటాయించిన స్థలం కాకుండా స్థలాన్ని అతిక్రమించి కర్నాటకలో అక్రమ తవ్వకాలు జరిపారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 23 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించారని ఆరోపించారు. చైనా, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు అక్రమంగా తరలించారన్నారు. గాలి అక్రమాలన్నింటికీ ఆధారాలున్నాయన్నారు.