అప్పుడు తండ్రి... ఇప్పుడు కొడుకు.. ముంచుతాడా..?
posted on Oct 25, 2017 4:59PM
సీబీఐ కోర్టులో తనకు ప్రతికూలంగా తీర్పు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఈనాడు అధినేత రామోజీరావును కలిసిన సంగతి తెలిసిందే. ఇది ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిగా గా మారిన సంగతి కూడా తెలిసిందే. రామోజీరావును కలిసిన జగన్ 40 నిమిషాల పాటు జగన్ ఆయనతో చర్చించారు. ఇంతకీ వీరిద్దరూ ఎందుకు భేటీ అయ్యారు.. అంత సేపు వీరు చర్చించుకున్నారు అని అందరిలో ఒకటే టెన్షన్. అయితే పాదయాత్రకు సంబంధించి కవరేజీతోపాటు… పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ కోరినట్లు విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం. అయితే ఇక్కడ అందరి ఆసక్తికరంగా ఎదురుచూసే విషయం ఏంటంటే... జగన్ ప్రతిపాదనకు రామోజీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..?లేదా..? అని. ఎందుకంటే గతంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ వల్ల రామోజీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఎవరూ మర్చిపోలేనివే. వైఎస్ఆర్ పాదయాత్ర చేసినప్పుడు ఈనాడు ఆయనకు విశేషమైన కవరేజ్ ఇచ్చింది. మెయిన్ పేజీలో పెద్ద పెద్ద ఫొటోలు వేస్తూ కావాల్సినంత కవరేజ్ ఇచ్చింది. దీనివల్ల వైఎస్ఆర్ కు మంచి లాభమే కలిగింది. ఓ రకంగా పాదయాత్ర జనాల్లోకి బాగానే ఎక్కింది. ఇక ఆతరువాత ఎన్నికల్లో గెలవడం.. సీఎం పదవి దక్కడం అన్నీ జరిగిపోయాయి.
ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఆతరువాత ఏమైందో తెలియదు కానీ.. రామోజీకి.. వైఎస్ఆర్ కు బేధాభిప్రాయాలు వచ్చాయి. దాంతో రామోజీ పలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.. మార్గదర్శిపై పలు కేసులు వేయించారు. ఫిలిం సిటీలో కూడా పలు కూల్చివేతలు చేయించారు. దీనిని ఎదుర్కోవడానికి రామోజీ వైఎస్ అండ్ జగన్ చేసిన లక్ష కోట్ల అవినీతిని బయటకి తెచ్చారు. దాంతో ఈనాడు వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలిచింది. అయితే ఈ మధ్య జగన్, రామోజీని భేటీ అవతుండటంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి. జగన్, రామోజీని కలవడం ఇది రెండోసారి. మొదటిసారి.. 2015 సెప్టెంబరు 24న రామోజీ ఫిలింసిటీకి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అప్పుడు తాను ప్రత్యేక హోదా కోసం గుంటూరులో చేపట్టనున్న దీక్ష నేపథ్యంలో కలిశారని.. దానిని కవరేజ్ చేయాలని జగన్ అడిగారని అన్నారు. అయితే అప్పుడు రామోజీ లైవ్ కవరేజ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా తాను పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో దానికి కవరేజ్ ఇవ్వాలని... రామోజీని కోరినట్టు తెలుస్తోంది. అయితే జగన్ కు సహకరిస్తే మళ్లీ తప్పు చేసినట్టే అని ఆయనకు కొంతమంది సలహా ఇస్తున్నారట. ఐతే దీనిపై రామోజీరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? గతంలో ఆయన చేసిన తప్పు మళ్లీ చేస్తారా..? వీటికి సమాధానం దొరకాలంటే వెయిట్ చేయాల్సిందే.