ఎవరిని చూసుకొని ఈ కాన్ఫిడెన్స్..!

 

రేవంత్ రెడ్డి వివాదం రోజు రోజుకి ముదురుతుంది తప్పా.. తగ్గడంలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయో అప్పటినుండి రచ్చ మొదలైంది. దానికి తోడు రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు చూసినా కూడా ఎవరికైనా.. నిజంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతాడని అనుకున్నారు. దీంతో టీడీపీ నేతలు రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పార్టీ నుండి రేవంత్ ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌ పదవుల నుంచి రేవంత్‌ రెడ్డిని తక్షణమే తొలగించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాగే రేవంత్ కు రమణ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించవద్దని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలకు రేవంత్ ను ఆహ్వానించ వద్దని నేతలకు సూచించారు. రేవంత్ పై పార్టీ చీఫ్ చంద్రబాబు నిర్ణయం తీసుకునేంత వరకూ తన ఆదేశాలు అమలులో ఉంటాయని వుంటాయని అన్నారు.

 

ఇదిలా ఉండగా మరోపక్క రేవంత్ రెడ్డి మాత్రం చేయాల్సిన రచ్చ చేసుకొని.. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీఎల్పీ సమావేశం నిర్వహించాలని ప్రకటన చేశాడు. రమణ ఆదేశాలను పట్టించుకోకుండా మరీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. అంతేకాదు ఈ అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ సమావేశానికి రావాలని ప్రజా ప్రతినిధులను కూడా  ఆహ్వానించారు. అంతేకాదు తనను సస్పెండ్ చేయాలని కోరుతూ ఎల్ రమణ స్వయంగా చంద్రబాబుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ ను తానేనని, తన సమావేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు రేవంత్. అంతేకాదు తన వెంట నడిచే వాళ్లు తనతోనే ఉంటారన్న నమ్మకం ఉందని చెప్పారు. మరి రేవంత్ వెంట నడిచే వారు ఎవరో చూడాలి.