అక్రమ డబ్బుతోనే జగన్ పార్టీ: జెసి
posted on Sep 8, 2011 4:26PM
హైదరాబాద్: వైయ
స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాపం పండింది కాబట్టే అక్రమాలు బయట పడుతున్నాయని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ అక్రమాలతో భారీగా డబ్బులు కూడబెట్టారన్నారు. అవినీతితో కూడబెట్టిన డబ్బును తన కొడుక్కు ఇచ్చి వైయస్ వెళ్లిపోయారన్నారు. వైయస్ పథకాల పేరుతో ఎన్నో తప్పులు చేశారన్నారు. అక్రమంగా వచ్చిన డబ్బుతోనే జగన్ పార్టీ పెట్టారన్నారు.
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పడం జగన్‌కు కళంకం తెచ్చిందని ఏడుసూత్రాల కమిటీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి వేరుగా అన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు జగన్ సహకరించి తన నిజాయితిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమాలు చేయకుంటే ఢిల్లీ వెళ్లి అందరి గుమ్మాలు తొక్కడం ఎందుకన్నారు.