పిఠాపురం వర్మపై వైసీపీ సోషల్ మీడియా పోస్టులు.. ఉన్న కాస్త పరువూ పోతోందంటూ

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తాను పిఠాపురం సీటు త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం పని చేసిన వర్మ.. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచీ ఆయనను అంతా పిఠాపురం వర్మ అనడం మొదలైంది. పవన్ కల్యాణ్ కూడా తన విజయం వెనుక పిఠాపురం వర్మ ఉన్నారంటూ ఎక్ నాలెడ్జ్ చేశారు. అయితే  ఆ తరువాత పరిణామాలు వర్మకు, జనసేనకు మధ్యగ్యాప్ వచ్చేందుకు కారణమయ్యాయి. ఇటీవల జనసేన ఆవిర్భావం సందర్భంగా మెగా బ్రదర్, ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన నాగబాబు చేసిన ఖర్మ వ్యాఖ్యలు ఈ దూరాన్ని మరింత పెంచాయి. అయితే పిఠాపురం వర్మ మాత్రం తాను చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో, వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో పిఠాపురం వర్మ మాత్రం సంయమనాన్నే పాటిస్తున్నారు.  

అయితే వర్మ విషయంలో వైసీపీ మాత్రం నానా హంగామా చేస్తున్నది. వర్మకు తామే శ్రేయోభిలాషులం అన్నట్లుగా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నది. ఆయన నోటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా రాకపోయినా... వర్మ వైసీపీ గూటికి చేరనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. వచ్చే ఎన్నికలలో  అంటే 2029లో పవన్ కల్యాణ్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ పోటీ చేస్తారంటూ వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నది.  ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు గట్టి పట్టు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయనను అభిమానించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గతంలో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మది.  ఆ తర్వాత తెలుగుదేశంలో  చేరిన వర్మ… పార్టీకి,  పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పినంతనే… వర్మ పోటీ నుంచి తప్పుకోవడంతో పాటుగా జనసేనానికి మద్దతుగా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి ఆయన విజయంలో  కీలక పాత్ర పోషించారు. 

అయితే…పవన్ కోసం తన సీటును త్యాగం చేస్తే,..ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని వర్మకు ఇచ్చిన హామీని చంద్రబాబు అనివార్య కారణాల వల్ల నిలబెట్టుకోలేదు.  దీంతో  వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనీ, ఆయన త్వరలో వైసీపీ గూటికి చేరతారనీ ఆ పార్టీ  సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నది. 2029 ఎన్నికలలో పిఠాపురం వర్మ వైసీపీ అభ్యర్థిగా పవన్ కు ప్రత్యర్థిగా నిలబడతారంటూ ఊదరగొట్టేస్తోంది. అయితే  ఈ ప్రచారంపై వర్మ నుంచి స్పందన లేదు. ఆయన తెలుగుదేశం పట్ల తన విధేయతను పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తన అనుచరులను సముదాయిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టి పని చేసుకుపోతున్నారు. జనసేనతో తనకు విభేదాలు లేవని చాటుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. అనవసర, అసత్య ప్రచారాలతో వైసీపీ ఉన్న కాస్త పరువునూ పోగొట్టుకుంటోందంటూ పరిశీలకులు విశ్లేషి స్తున్నారు.