పరారీలో మాజీ మంత్రి కాకాణి?
posted on Mar 31, 2025 10:33AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారా? అక్రమ మైనింగ్ కేసులో నోటీసులు అందజేయడానికి ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన ఇల్లు తాళం వేసి ఉండటం కనిపించింది. దీంతో ఆయనకు పోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. పోనీ ఆయన పీఏకైనా సమాచారం ఇద్దామని భావించిన పోలీసులకు పీఏ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అని రావడంతో చేసేదేం లేక కాకాణి నివాసానికి నోటీసులు అందించి వెనుదిరిగారు.
దీంతో మాజీ మంత్రి కాకాణి పరారీలో ఉన్నారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఉగాది పర్వదినం రోజున అంటే ఆదివారం (మార్చి 30)న కాకాణి నివాసానికి పోలీసులు వెళ్లారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై కేసు నమోదు కావడంతో పోలీసువిచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసులను అందించడానికి ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం స్వాగతం పలికింది. ఆయన ఫోను, ఆయన పీఏ ఫోను కూడా స్విచ్ఛాఫ్ అయ్యి ఉన్నాయి. దీంతో కాకాణి నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆ నోటీసుల మేరకు అక్రమ మైనింగ్ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు కాకాణి హాజరుకావాల్సి ఉంది. మరి నోటీసులు తీసుకునేందుకే వెనుకాడిన కాకాణి.. సోమవారం విచారణకు హాజరవుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవలే కాకాణి గంభీరంగా కేసులకు భయపడేది లేదంటూ ప్రకటనలు గుప్పించారు. ఇప్పుడు ఆయన నోటీసులు అందుకోవడానికే వెనకాడి అజ్ణాతంలోకి వెళ్లిపోవడంతో నెటిజనులు ఆయనపై సెటైర్లు గుప్పిస్తున్నారు. కేసులకు కాకాణి భయపడరు.. కానీ నోటీసులు అందుకోవడానికి మాత్రం వణికి పోతారు. పరారైపోతారు అంటూ ఎగతాళి చేస్తున్నారు. కాకాణి సోమవారం (మార్చి 31) విచారణకు గైర్హాజరైతే.. ఆయన పరారీలో ఉన్నట్లు భావించి గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.
ఇంతకీ కాకాణిపై కేసు ఏమిటంటే.. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని మైన్స్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాలో క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి రుస్తుం మైన్స్ లీజు గడువు ముగిసి పోయిన తరువాత సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ పెద్దఎత్తున అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారన్న ఆరోపణలున్నాయి. మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తాజాగా ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ4గా చేర్చడంతో పాటు మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ తరఫున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డిని ఏ1గా, వైసీపీ నేత వాకాటి శివారెడ్డినిఏ2గా, మరో నాయకుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డిని ఏ3గా పోలీసులు పేర్కొన్నారు.
తాజాగా ఇదే కేసులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఇద్దరు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఈ కేసులో ఏ1 నుంచి ఏ4 వరకూ అందరినీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాకాణి పరారీ అయ్యారని అంటున్నారు.