టీడీపీ టికెట్ కోసం కర్చీప్ వేస్తున్న సీనియర్లు

తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు చొక్కా మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఫిరాయింపులు మరింత జోరుగా సాగుతూ ఉంటాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి అందుకు కొంత భిన్నంగా కనిపిస్తోంది. నిజానికి, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు  ఇంకా ఏడాదిన్నర సమయం వుంది. అయినా  ఎన్నికల వేడి  రాజుకుంది. పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగి పెరిగి పీక్ కు చేరుతోంది. మరో వంక అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు బుసలు కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో, పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పక్క దారులు చూస్తున్నారు. 

మరో వంక పార్టీ అద్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, తమ వైఫల్యాలు, చేతకాని తనాన్ని, ఎమ్మెల్యేల మీదకు నెట్టి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి పరీక్షలో నెగ్గితేనే మళ్ళీ టికెట్ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ గు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితులలో, కీడెంచి మేలేంచడం మంచిదని, కొందరు కీలక నేతలు ముందుగానే పక్క పార్టీల్లో కర్చీఫ్  వేస్తున్నారు. నియోజక వర్గంలో పరిస్థితిని బేరీజు వేసుకుని  వైసీపీని వదలవలసి వస్తే  ఏ పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్  నిలబడుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. సహచరులతో మంతనాలు సాగిస్తున్నారు. ఏపీలో వైసీపీకి ఏకైక ప్రత్యాన్మాయం టీడీపీ. సో .. సహజంగానే, ముందు జాగ్రత్తగా  వైసేపీ సీనియర్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రెడీ  అవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా, వైసీపీ ‘ముఖ్య’ నేతలు కూడా టికట్ హామీతో టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అదలా ఉంటే, నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు  మాజీమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి పార్టీ  నియోజక వర్గం ‘మార్పు’ గురించి వస్తున్న వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నానని  తాను పోటీచేసే విషయం చెప్పాల్సింది తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముందుగానే ఏదేదో ఊహించుకొని ఇక్కడే పోటీచేస్తాను.. అక్కడ పోటీచేస్తానంటూ చెప్పడం కూడా సరికాదన్నారు. ప్రస్తుతం వెంకటగిరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు ఆ అర్హత ఉందన్నారు.అయితే, ఆయన  ప్రస్తుతానికి వైసీపీలోనే ఉన్నా నని చెప్పడం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి మళ్ళీ పోటీ చేసే ‘అర్హత’ ఉందని నొక్కి చెప్పడం వెనక రాజకీయ మర్మం ఏమిటనే చర్చ జరుగుతోంది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి, ఈ వ్యాఖ్యల ద్వారా సున్నితంగానే అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి  ఒక హెచ్చరిక చేశారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. 

అంతే కాదు, మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఆనం  ఫాను పార్టీలో చాలా కాలంగా ఉక్కపోతకు గురవుతున్నారు, అసంతృప్తితో రగిలిపోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఒకటి రెండు సందర్భాలలో ఆనం తమ అసంతృప్తిని బయట పెట్టినా  సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, అయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. 

మరోవంక ఆత్మకూరు ఉపఎన్నిక సమయంలో, ఆనం కుమార్తె, కైవల్యా రెడ్డి టీడీపీలో చేరారు. నిజానికి అప్పటి నుంచి ఆనం టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఆలాగే,  ఆయన ఈసారి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారామ్ కూడా జోరుగా సాగుతోంది. అయితే, ఆయన అనుచరులు చెపుతున్నట్లుగా వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపోవడం కాకుండా, తన సీనియారిటీని గుర్తించక పోవడమే కాకుండా, జిల్లా రాజకీయాల్లో తమ కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు సాగిస్తున ‘ప్రత్యర్ధుల’ ను దెబ్బతీసే వ్యూహంతో ఆనం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఆయన తాజాగా,మీడియాలో వస్తున్నట్లుగా తనకు వేరే ఆలోచన ఉంటే.. ఆ మాట తన నోటినుంచి రాబోయే ముందు కాగితం పక్కనపెట్టి చెబుతానన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై అప్పటివరకు ఎవరికీ ఏ అనుమానం అక్కర్లేదని చెప్పారు.అలాగే  తనకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేందుకే టికెట్ ఇచ్చారని, ఈ ఐదు సంవత్సరాల చివరి రోజు వరకు వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు.

అదలా ఉంటే, ఆనం రామనారాయణ రెడ్డి తాజా వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లోనే  కాదు, రాష్ట్ర రాజకీయాల్లోను వేడిని రాజేస్తున్నాయి. నిజానికి, వైసీపీలో ఒక్క ఆనం మాత్రమే కాదు  ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్న కొందరు మంత్రులతో సహా  సీనియర్ నాయకులు, ముఖ్యంగా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు  ఆనం కంటే ఎక్కువగా అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. అయితే, ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర సమయం ఉన్నందున తొందర పడకుండా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా జెండా ఎగరేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.అందుకే, రాజకీయ విశ్లేషకులు,‘అవును,వైసీపీలో అగ్గి రాజుకుంటోంది.. భగ్గుమనే రోజు దగ్గరలోనే వుందని  అంటున్నారు .