షర్మిల అరెస్టుపై ఎందుకు స్పందించలేదు.. జగన్ ను నిలదీసిన మోడీ.. నీళ్లు నమిలిన ఏపీ సీఎం

ప్రజా సమస్యలపైనా, ప్రభుత్వ విధానాలపైనా విపక్షాలు విమర్శలు గుప్పించడం, ఆందోళనలు చేయడం సహజమే. ప్రభుత్వం నిర్బంధ కాండ ప్రయోగిస్తే.. రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ముక్త కంఠంతో ఖండిస్తారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరే వేరు. ఆయన తనకు రాజకీయ లబ్ధి ఉంటుందని భావిస్తేనే పెదవి విప్పుతారు. లేదంటే.. తన పర భేదం లేదు ఆయనకు ఎవరెలా పోతే మాకేం.. అన్నట్లుగానే వ్యవహరిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో తన సొంత చెల్లి షర్మిలను అక్కడి తెరాస సర్కార్ అత్యంత అమానవీయంగా వాహనంలో ఉండగానే టోవింగ్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లిన సంఘటనను రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించారు. తెలంగాణలో వైఎస్సార్ టీపీ ని స్థాపించి.. అక్కడి ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలుపెరుగని పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా షర్మిల తెలంగాణలో పాదయాత్ర పూర్తి చేశారు. తన పోరాటంలో షర్మిల తెరాస సర్కార్ ను, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శలతో చెడుగుడు ఆడుకున్నారు. అలా అని మిగిలిన పార్టీలను కూడా స్పేర్ చేయలేదు. బీజేపీపైనా, కాంగ్రెస్ పైనా కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయినా కూడా ఆమెను అరెస్టు చేయడాన్ని, ఆమె కారులో ఉండగానే టోయింగ్ చేసి పీఎస్ కు తరలించడాన్ని బీజేపీ, కాంగ్రెస్ కండించాయి. ఆ రాష్ట్ర గవర్నర్ తమిళి సై స్పందించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ షర్మలకు మద్దతు లభించింది. సానుభూతి వ్యక్తమైంది. అయితే పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, షర్మిలకు తోడబుట్టిన అన్న జగన్ మాత్రం పెదవి విప్పి మాట్లాడలేదు. పన్నెత్తి ఆమె అరెస్టును ఖండించలేదు.  

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వాహనంపై వరంగల్‌ జిల్లా నర్సంపేటలో గత ఆదివారం రాళ్ల దాడి జరిగింది. ఆమె క్యారవాన్‌ను దగ్ధం చేశారు.  పోలీసులు ఆమెను బలవంతంగా హైదరాబాద్‌లోని నివాసానికి తరలించారు. ఈ ఘటనలను నిరసిస్తూ మరుసటి రోజు షర్మిల ప్రగతి భవన్‌ ముట్టడికి  పాక్షికంగా ధ్వంసమైన తనకారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలు దేరారు. అయితే మార్గమధ్యంలో  అడ్డుకున్నారు. ఆమె కారులో కూర్చుని ఉండగానే కారును క్రేన్‌తో పీఎస్ కు తరలించారు.  షర్మిలను పరామర్శించేందుకు వెళ్తున్న తల్లి విజయలక్ష్మిని కూడా పోలీసులు నిలువరించి గృహనిర్బంధం చేశారు.  ఈ ఘటనలను రాజకీయాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించినా   సొంత చెల్లెలు షర్మిలపై తెలంగాణలో జరిగిన ఈ దాడిపై, అప్రజాస్వామికంగా అరెస్టు చేయడంపై ఏపీ  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్పందించలేదు, ఖండించలేదు.  

అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఊరుకోలేదు. సోమవారం (డిసెంబర్5) జి-20 సదస్సు సన్నాహకాలపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన ఏపీ సీఎం జగన్ ను మోడీ నిలదీశారు. షర్మిలను అరెస్టు చేసిన తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఆ విషయంపై మీరెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిలను అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన వారం రోజుల తరువాత హస్తినలో జగన్ ను ప్రధాని మోడీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
  మీ చెల్లెలు షర్మిల కారులో ఉండగానే క్రేన్‌తో లాక్కెళ్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారటకదా! ఇంత జరిగినా మీరెందుకు స్పందించలేదు? అని జగన్ ను ప్రశ్నించారు.  ప్రధాని నుంచి ఇలాంటి ప్రశ్నను ఊహించని జగన్ సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వారు. కష్టపడి ముఖానికి నవ్వు పులుముకుని మౌనంగా మిగిలిపోయారు.