వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి.. రెండో భార్య, కొడుకు సాక్షులు!
posted on Nov 28, 2023 12:25PM
ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వివాహం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం (నవంబర్ 27) వివాహం చేసుకున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాత అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నారు. కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ వివాహం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఆయనకు ఇది మూడవ వివాహం కావడం.. ముందు ఇద్దరు భార్యలకు ముగ్గురు పిల్లలు ఉండడం. అంతేకాదు, ఎమ్మెల్సీ చేసుకున్న ఈ మూడవ వివాహానికి రెండో భార్య, కుమారుడు సాక్షులుగా సంతకాలు చేయడం మరో విశేషం. ఇన్ని ట్విస్టులు ఉండడం వలనే ఈ పెళ్లిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశంలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో కైకలూరు జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో తెలుగుదేశం నుండి కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచిన జయమంగళ వెంకటరమణ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. దీంతో ఆ ఎన్నికల అనంతరం వైసీపీ గూటికి చేరిపోయారు. వైసీపీ ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుండి ఆయనే కైకలూరు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎమ్మెల్సీ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. వారికి ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత సునీత అనే మహిళను వెంకటరమణ వివాహం చేసుకోగా.. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటరమణ కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రెండో భార్యతో మనస్పర్థలు రాగా.. కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. దీంతో రెండో భార్య సునీత అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణపై కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో 2019లో మచిలీపట్నం కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
కాగా ఇప్పుడు ఎమ్మెల్సీగా వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కాగా. వెంకట రమణ రెండో భార్య సునీత, ఆమె కుమారుడి సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. రెండో భార్య సునీత ఈ వివాహానికి సాక్షి సంతకం పెట్టడం గమనార్హం. ఇక, వధువు సుజాతకు ఇది రెండో వివాహం కాగా ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త నుండి విడిపోగా ఇప్పుడు ఎమ్మెల్సీని వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించనున్నారు. కాగా, వీరి పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణ మూడవ పెళ్లిపై ఇంతగా చర్చకు కారణం సొంత పార్టీ నేతలే కావడం గమనార్హం. గతంలో వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేసే సమయంలో ఆయన మూడు వివాహాల అంశాన్ని సందర్భం ఉన్నా లేకున్నా లేవనెత్తేవారు. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ, చివరాఖరికి ముఖ్యమంత్రి తో సహా అందరూ ఇదే అంశంపై దారుణంమైన విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే అమ్మ ఒడి నిధులు విడుదల చేస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అభం శుభం తెలియని చిన్నారుల ముందే పవన్ కళ్యాణ్ వివాహాలపై మాట్లాడారు. ఈ అంశంపై అప్పట్లోనే రాజకీయ వర్గాలు విస్తుపోయాయి. అప్పటి నుండి సీఎం జగన్ సందర్భం వచ్చినా, రాకున్నా ప్రతిసారీ పవన్ పై ఇవే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక మంత్రులు అంబటి లాంటి వాళ్ళైతే సోషల్ మీడియాలో కూడా దారుణ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ మూడవ పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు వైసీపీ నేతలను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతల విమర్శలే ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకటరమణ పాలిట శాపంగా మారాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.