విశాఖ జూపార్క్ లో ఎలుగుబంటి దాడి... ఒకరు మృతి

ఎలుగుబంటి దాడిలో విశాఖ జూపార్క్ కీపర్ బానవరపు నగేశ్ (23) మృతి చెందడం కలకలం రేపింది. పార్క్ పరిసరాల్లో శుభ్రం చేస్తున్న యువకుడిపై నిన్న ఉదయం ఎలుగుబంటి ఒక్కసారిగా దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన నగేశ్‌ను జూ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడిచేస్తుండడాన్ని చూసి సందర్శకులు హడలిపోయారు. ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన నగేశ్‌ది విజయనగరం జిల్లాలోని గజపతినగరం. విశాఖ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రెండేళ్లుగా విశాఖ జూలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నగేశ్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించినట్టు జూ క్యురేటర్ నందిని సలేరియా తెలిపారు. నగేశ్‌పై దాడిచేసిన ఎలుగుబంటి ‘జిహ్వాన్’ను మిజోరం నుంచి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. బోనులో ఉండాల్సిన ఎలుగుబంటి బయటకు ఎలా వచ్చిందన్నది అంతుబట్టడం లేదు. బోను తలుపులు ఎవరైనా తీశారా? లేదంటే, సరిగా వేయకపోవడంతో వాటంతట అవే తెరుచుకున్నాయా? అన్నదానిపై జూ అధికారులు  ఆరా తీస్తున్నారు.ఎప్పటిలాగే పార్కు పరిసరాలు శుభ్రం చేసేందుకు ఎలుగు బంటి ఉంచిన ప్రదేశానికి నగేష్     వెళ్లాడు. ఆ తర్వాత అతను ఎవరికీ కనిపించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి వెతికే సరికి తీవ్ర గాయాలై కనిపించాడు. తలమీద, ఎడమ చెయ్యిపైన బలమైన గాయాలయ్యాయి.  ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు క్యూరేటర్ చెప్పారు. ఎలుగు బోనులో ఉందనుకుని తన పని తాను చేసుకుంటుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. జూ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఎలుగు బంటిని బోనులో బంధించారు.సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.