ఓట్ చోరీ.. రాహుల్ ని గట్టెక్కించలేదెందుకు?

ఒక‌ప్పుడు ఇందిరాగాంధీ, ఆ తరువాత  రాజీవ్ గాంధీ.. భార‌త రాజ‌కీయాల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. వారికి చట్టసభల్లో సంఖ్యాబలానికి ఒక పరిమితి అంటూ ఉండేది కాదు.  ఇప్పుడైతే వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చినా, మూడో సారి బీజేపీకి స్వయంగా వచ్చిన స్థానాలు   240 కాగా.. ఎన్డీయే  భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో ఎలాగోలా  గ‌ట్టెక్కి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌లిగింది. అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అయితే అప్ప‌ట్లో  లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం  400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి  చేయ‌లేదు. ఎవ‌రి  క‌ష్టం  వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేస్తున్న ఆర్భాటాన్నీ, హంగామానూ బిల్డప్ ప్రక్రియగా కొట్టి పారేశారు.  ఏదో ఒక నేరేటివ్ బిల్డ‌ప్ చేయ‌డంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని  తెర‌పైకి తెచ్చారంటున్నారు. రాహుల్ అందిపుచ్చుకున్న ఓట్ చోరీ..  వ్యూహ‌క‌ర్త‌లిచ్చిన స‌ల‌హా  లేదా సూచ‌న  కావ‌చ్చు. అదీ కాదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే స్వయంగా ఈ నినాదాన్ని ఎత్తుకుని ఉండవచ్చు. అయితే ఓటు చోరీ నినాదం ప్రజల్లోకి లోతుగా వెళ్లినట్లనిపించినా.. అది కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఓట్ చోరీ స్లోగ‌న్ తో బీహార్ ఎన్నిక‌ల‌కు వెళ్తే అది బూమ‌రాంగ్ అయ్యింది. రాహుల్ లాంటి ప్ర‌చార‌క్ ఉన్నంత వ‌ర‌కూ బీజేపీ  అధికారంలోకి వ‌స్తూనే ఉంటుంద‌న్న టాక్  అధికార కూటమిలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.  రాహుల్ విషయంలో చెప్పుకోవలసిందంటూ ఏదైనా ఉంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర.  ఆ యాత్ర ద్వారా.. రాహుల్  ఇటు కాంగ్రెస్ ని అటు ఇండి కూట‌మిని  ఈ మాత్ర‌మైనా  నిలబెట్టగలిగారు.  

అలాగ‌ని రాజ‌కీయ ప‌రంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలాంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల  కాంగ్రెస్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు.  కార్య‌క‌ర్త‌లను ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంచాలి.  అందులో భాగంగానే రాహుల్ గాంధీ.. ఈ నినాదం భుజానికి  ఎత్తుకున్నారు. త‌ర‌చూ త‌న వాద‌న‌ల రూపంలో  ఏదో ఒక అంశాన్ని, సమస్యను తెరమీదకు తీసుకువస్తుంటారు. తినగతినగ వేమ తియ్యగుండు అన్నట్లుగా.. నిరంతరం జనంలోకి ఏదో ఒక అంశాన్ని తీసుకువెడుతుంటే.. ఏదో ఒక లీడ్ దొరికి అధికారం ‘చేతి’కి రాకుండా ఉంటుందా అన్నది ఆయన ఆలోచనో, వ్యూహమో అయి ఉంటుందంటున్నారు పరిశీలకులు.  

ఇవాళ్రేపు రాజ‌కీయంగా ఒక నెగిటివిటీని నూరిపోస్తే త‌ప్ప రాణించ‌లేని గ‌డ్డు కాలం న‌డుస్తోంది. అందుకే రాహుల్ ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాల‌ను పార‌దోలాల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంద‌నీ,  వారి ప్ర‌భావం నుంచి దేశాన్ని కాపాడాలని అంటున్నారు కానీ అది ఎలా సాధ్యం అన్న విషయంలో మాత్రం రాహుల్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ క్లారిటీ కానరావడం లేదంటారు పరిశీలకులు. ఓట్ చోరీ నినాదం విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉండటం యాధృచ్ఛికమేనా?  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu