యథా భర్త.. తథా భార్య ఏపీపై మంత్రి హరీష్ సతీమణి అవమానకర వ్యాఖ్యలు!

అదేంటో ఏపీ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఎన్నికలు పూర్తి కావడం లేదు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఏపీ ప్రస్తావన వచ్చినా.. అప్పుడు మరో రకంగా ప్రభావం కనిపించేది. ఆంధ్రా పాలకుల పేరిట తెలంగాణ పార్టీలు సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసేవారు. కానీ, ఈసారి రాష్ట్రంలో అసమర్దులకు పట్టం కడితే ఎలా ఉంటుందో  చెప్పడానికి తెలంగాణ పాలకులు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకటీ రెండుసార్లు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఎన్నికల సమయం వచ్చాక  ఇటువంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఏపీలో రోడ్ల పరిస్థితిని వివరిస్తూ సీఎం కేసీఆర్ డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ.. సింగిల్ రోడ్డయితే ఆంధ్రా, ఏపీ రోడ్లెక్కితే మంచాన పడుడే, తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చనే వ్యాఖ్యలు చేశారు. అలాగే వెలుగులు ఉంటే తెలంగాణ.. అంధకారం కనిపిస్తే ఆంధ్ర అని కూడా ఏపీలో విద్యుత్ కోతలను ఎగతాళి చేశారు.  పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారని.. తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైందని, ఆంధ్రా వాళ్లే ఇప్పుడు తెలంగాణ వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారని కేసీఆర్ పలుమార్లు సెటైర్లు వేశారు. 

ఇక మంత్రి కేటీఆర్ అయితే.. ఆంధ్రా వాళ్ళు పరిశ్రమలను పొమ్మంటే మేము వారిని ఆహ్వానించామని, పండగకో, శుభకార్యానికో ఏపీకి వెళ్లినా ఉండలేని పరిస్థితి ఉందని మాట్లాడారు. మరో మంత్రి హరీష్ రావు అయితే ఏపీలో పనితనం లేదు కానీ పగతనం ఉందని మనకి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. కాగా, భర్తకు తగ్గ భార్యగా మంత్రి హరీష్ రావు సతీమణి కూడా ఇప్పుడు ఏపీపై సెటైర్లు వేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం అంటూ ఏపీ ప్రజలపై సానుభూతి చూపిస్తూనే జగన్ మోహన్ రెడ్డి పాలనపై సెటైర్లు వేశారు. ఏపీలో పరిస్థితిని పోలుస్తూ తెలంగాణలో అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత గొప్పగా పాలించిందో చెప్పేందుకు ఏపీలో వైసీపీ పాలనను వేలెత్తి చూపించారు.  కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అనే స్థాయికి ఎదిగితే , జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పరిస్థితి దిగాజారిపోయిందని హరీష్ సతీమణి శ్రీనిత వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం(నవంబర్ 28)తో  ముగిసింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి తరపున ఇంటిల్లిపాది అందరూ ప్రజల మధ్యకి వచ్చి ఇంటింటికి తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత కూడా భర్త తరపున ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనిత.. ఏపీకి కనీసం రాజధాని కూడా లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని.. వాళ్లకు కావాల్సినన్ని వనరులు ఉన్నా అక్కడ అభివృద్ది జరగలేదని పేర్కొన్నారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న పంటను.. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న పంటను  బేరీజు వేసుకొని చూడాలని ప్రజలను కోరారు. అన్నీ ఉన్నా అక్కడ అభివృద్ధి లేదంటే.. మనం గొప్పనా? వాళ్లు గొప్పనా? మీరే నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందనే దానికి ఏపీలో పరిస్థితులే నిదర్శనమనేలా ఆమె మాట్లాడారు.

దీంతో సహజంగానే మరోసారి రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏపీలో శ్రీనిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీపై ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, బీఆర్ఎస్ నేతలు ఎంతగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా   వైసీపీ నేతలలో చలనం ఉండడం లేదు. దాన్నే అలుసుగా తీసుకుని జగన్ వైఫల్యాన్ని బీఆర్ఎస్ నేతలు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్క మాట మాట్లాడినా కట్టకట్టుకుని ఎదురుదాడికి దిగే వైసీపీ నేతలు.. పొరుగు రాష్ట్రం నేతలు ఇలా ప్రతిసారి ఎగతాళిగా మాట్లాడినా నోరు మెదపడం లేదు. ఏపీ ప్రజలకు ఇది మరింత ఆగ్రహం తెప్పిస్తున్నది. సీఎం జగన్ ను నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా వారిపై విరుచుకుపడే నేతలు.. పరాయి రాష్ట్రంలో జగన్ పాలనపై హేళన చేస్తున్నా కుక్కిన పెనులాగా కిక్కిరుమనకుండా ఉన్నారంటే వారి వైఫల్యాన్ని వారే  అంగీకరించినట్లు భావించాల్సి వస్తున్నదని   పరిశీలకులు విశ్లేషిసున్నారు.