జగన్ కు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఓ కీలక కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేశారు.అంతేకాదు ఆ కార్యక్రమం అమలు తీరునే ప్రశ్నించేలా అధికార పార్టీ ఎమ్మెల్యే కామెంట్ చేయడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోందని. సదరు ఎమ్మెల్యే తీరుపై సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. తాము ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కార్యక్రమాన్ని డ్యామేజీ చేశారని ఆయన మండిపడ్డారట. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిశ చట్టాన్ని అట్టహాసంగా ప్రకటించింది. సీఎం జగన్ ఎంతో పట్టుదలతో ఏపీలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం తీసుకొచ్చారు.మహిళల రక్షణ కోసం గొప్ప కార్యక్రమం చేపట్టామని సీఎం జగన్ ప్రకటించుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వం ‘దిశ’ చట్టం గురించి చెబుతున్నారు.  ఈ చట్టం యాప్ వినియోగంపై అధికారులు వివిధ రూపాల్లో ప్రచారం కల్పిస్తున్నారు. అయితే దిశ చట్టం వచ్చాకా కూడా ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు జరగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీపంలోనే వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర సంచలనం రేపింది.

నెలలు గడుస్తున్నా ఈ గ్యాంగ్ రేప్ ఘటన నిందుతులు ఇంకా దొరకలేదు. దీంతో దిశ చట్టంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  అసలు అమలు కాని చట్టం గురించి ప్రచారం ఏంటని  ఆరోపిస్తున్నాయి. దీంతో యాప్ పై మరోసారి జనాలకు అవగాహన కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగానే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పోలీసులు దిశ యాప్ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ చట్టంపై సాక్ష్యాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే కీలక వ్యాఖ్యలు చేశారు. దిశ' అంటే ఏంటి నాకు తెలియదని చెప్పారు. 

శ్రీకాకుళం జిల్లా రాజాంలో దిశ యాప్ పై పోలీస్ శాఖ శనివారం అవగాహన సదస్సు నిర్వహించింది. 'దిశ' డీఎస్పీ వాసుదేవ్.. చట్టంతోపాటు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జోగులు మాట్లాడారు. తనకు అసలు దిశ చట్టం గురించి తెలియదన్నారు. దీంతో అక్కడున్న వారు అంతా షాక్ అయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి.. అందులోనూ అసెంబ్లీలో సీఎం జగన్ ఈ 'దిశ' చట్టంను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నప్పుడు మద్దతుగా ఆమోదించిన వ్యక్తికి చట్టం గురించి తెలియకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేకే అవగాహన లేకపోతే.. జనాలకు ఎలా ఉంటుందని, ఆ యాప్ ను ఎలా వినియోగిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.