అమరావతిలో మళ్లీ దొంగలు పడ్డారు.. ఇంకెన్ని రోజులీ ఘోరాలు! 

ఆంధ్రప్రదేశ్ లో దొంగలు పడ్డారు... ఇది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ కాదు.. సామాన్య జనాల నుంచి కూడా అదే అభిప్రాయం వస్తోంది. ఏపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలే ప్రజలు ఇలా అనుకోవడానికి కారణమవుతున్నాయి. ఓ వైపు ఏపీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు అందినకాడిచి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శాండ్, మైనింగ్, లిక్కర్... ఇలా ఏది వదలిపెట్టకుండా.. అన్నింట్లోనూ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే రోడ్లను కూడా దొంగిలించే వరకు.. అవును మీరు వింటున్నది నిజమే. అమరావతిలో రాత్రికి రాత్రే రోడ్లు మాయమవుతున్నాయి. 

అమరావతిలో రోడ్ల తవ్వకం యథేచ్చగా కొనసాగుతోంది. రోడ్లను తవ్వేసి కంకర, ఇసుకను ఎత్తుకెళ్తున్నారు. పది రోజుల క్రితం ఉద్దండరాయునిపాలెంలో రోడ్డును తవ్వేసి కంకరను తరలించిన ఘటనను మర్చిపోకముందే.. తాజాగా మోదుగులింగాయపాలెంలో రోడ్డును తవ్వేశారు. గ్రామానికి ఉత్తరంగా ఉన్న సీడ్ యాక్సెస్ పక్కన ఉన్న రోడ్డును తవ్వేసిన గుర్తు తెలియని వ్యక్తులు కంకరను తరలించారు. నాలుగు అడుగుల లోతు, 200 మీటర్ల పొడవున రోడ్డును తవ్వేసిన దుండగులు దాదాపు 100 టిప్పర్ల కంకరను తరలించి ఉంటారని భావిస్తున్నారు. పెద్దగా జనసంచారం ఉండని ఈ ప్రాంతంలో టిప్పర్లు, జేసీబీలు తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

రోడ్డును తవ్వేసిన విషయం తెలిసిన వెంటనే అమరావతి దళిత జేఏసీ నాయకులు, వెలగపూడి రైతులు రోడ్డు తవ్వేసిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే రోడ్ల తవ్వకాలు జరుగుతున్నాయని  ఆరోపించారు. రోడ్లను ధ్వంసం చేస్తూ రాజధాని అమరావతి నామరూపాల్లేకుండా చేస్తున్నారని దళిత జేఏసీ నేతలు మండిపడ్డారు. రోడ్ల తవ్వకం, నిర్మాణ సామగ్రి చోరీపై న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  

అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవాల్సిన అమరావతి ప్రాంతం.. జగన్ రెడ్డి పాలనలో శిథిలమైన భవనంలా మారింది. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికే అమరావతిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లంతా మెటీరియల్ ను రోడ్డు మీదే వేసుకుంటారు కాబట్టి అదే పని చేశారు. ఇసుక, కంకర, స్టీల్ అన్నీ సైట్ల పక్కనే ఉన్నాయి. సడెన్ గా జగన్ ఆ నిర్మాణాలకు పేమెంట్స్ నిలిపేశారు.. మళ్లీ చేస్తారో చేయరో చెప్పలేదు. దీంతో లేబర్ అంతా వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు కూడా వేరే పనులు చూసుకున్నారు. 

పాలకుడే అమరావతి నాశనం కోరుకుంటుండటంతో ఇక దొంగలకు పని ఈజీగా మారిపోయిందని అంటున్నారు. అందుకే రాత్రికి రాత్రే రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. ఏకంగా వేసిన రోడ్డును తవ్వి మరీ కంకర ఎత్తుకుపోతున్నారు. దొంగలు పడి ఎత్తుకుపోతుంటే... ఆ దొంగలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేవలం అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులను ఆపటానికో, కొట్టడానికో.. అరెస్టు చేయడానికో తప్ప.. వేరే ఏ పని మీద అడుగు పెట్టరు. వైసీపీ వారు చేసే అక్రమాలపై ఫిర్యాదులు వస్తే అసలే పట్టించుకోరు.  అమరావతిలో రోడ్డు తవ్వి కంకర ఎత్తుకుపోయారంటే.. ఎత్తుకుపోయినా ఎవరూ పట్టించుకోలేదదంటే..ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి..