ఉమ్మడి కడప జిల్లాలో ఫ్యాన్ కు ఉక్కపోత.. ఒక్కటొక్కటిగా చేజారుతున్న మునిసిపాలిటీలు!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రతిష్ట మసకబారింది. ఆ పార్టీకి గట్టి పట్టున్న రాయలసీమలో సైతం ఇటీవలి ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అయితే కొద్దిగా దెబ్బతిన్నా కడప జిల్లాలో మాత్రం ఏదో పరువు దక్కింది అనిపించుకోగలిగింది.  జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పట్టు నిలుపుకున్నా.. ఆయన సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం గత పదేళ్లుగా ప్రతినిథ్యం వహిస్తూ వస్తున్న కమలాపరంలో పట్టు కోల్పోయారు. ఘోర పరాజయం పాలయ్యారు.  

అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కడప జిల్లాలో వైసీపీ ప్రభ వేగంగా మసక బారిపోతోంది. జిల్లాలోని మునిసిపాలిటీలు ఒకదాని వెంట ఒకటిగా వైసీపీ చేజారుతున్నాయి.  కడప, ప్రొద్దుటూరు, రాజంపేట.. ఇలా అన్ని మునిసిపాలిటీల్లోనూ అదే పరిస్థితి కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. క్యాడర్ సంగతి సరే సరి వారెప్పుడో పార్టీకి దూరం అయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా జగన్ మేనమాప పదేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన కమలాపురం మునిసిపాలిటీ కూడా చేజారిపోతోంది. ఇలా జిల్లాలో ఒక్కటంటే ఒక్క మునిసిపాలిటీ కూడా వైసీపీకి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది.

చివరాఖరికి కడప కార్పొరేషన్ లోనూ అదే పరిస్థితి. అంతేందుకు పులివెందుల మునిసిపల్ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం తలుపుతడుతున్న పరిస్థితి. అయితే తెలుగుదేశం నుంచి వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనీ, అందుకే పులివెందులలో ప్రస్తుతానికి వైసీపీ సేఫ్ గా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు తాజాగా కమలాపురం మునిసిపల్ చైర్మన్  మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి చేరికతో కమలాపురం మునిసిపాలిటీలో వైసీపీ మైనారిటీ అయిపోయింది. గతంలోనే పలువురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజా చేరికలతో కమలాపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం మెజారిటీ లో ఉంది. దీంతో  కమలాపురం మునిసిపాలిటీ తెలుగుదేశం వశమైనట్లే.