ఒంటెత్తు షర్మిల .. ఏపీ కాంగ్రెస్ విలవిల!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తన స్వంత ఎజెండా కారణంగా రాష్ట్రంలో  పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. షర్మిల ఒంటెత్తు పోకడలతో సీనియర్లకు వీసమెత్తు విలువ ఇవ్వకుండా జగన్ వ్యతిరేకతే  పార్టీ సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి.  షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాకుండా ఒక స్వతంత్ర వ్యక్తిగా తన ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని పార్టీ సీనియర్లు సైతం అంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు తిలోదకాలిచ్చి జగన్ ను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అదే తన బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, దీని వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదని సీనియర్లు అంటున్నారు.  

అంతే కాకుండా షర్మిల తీరు పార్టీ సినియర్లను పార్టీ కార్యక్రమాలకు దూరం చేస్తున్నదనీ, ఇసుమంతైనా ఖాతరు చేయకుండా ఆమె తమను అవమానిస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాలం చెల్లిన కబుర్లు అంటూ సీనియర్ల సలహాలను ఆమె తీసి పారేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారకుడైన కేవీపీ ఆమె ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రతి సమావేశంలోనూ ఆమె వెన్నంటి ఉండి మార్గదర్శనం చేసేవారనీ, అయితే ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  

షర్మిల వైఖరికి విసిగి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటున్నారు.  జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చేశారనీ, ఆయన పార్టీని దారుణంగా ఓడించి జగన్ పట్ల తమ అభిప్రాయమేమిటో చెప్పేశారనీ, అయినా ఇప్పటికీ షర్మిల జగన్ పై విమర్శలకే పార్టీని, పార్టీ కార్యక్రమాలను పరిమితం చేయడం విడ్డూరంగా ఉందనీ అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలిన కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి క్షేత్ర స్థాయి నుంచీ పని చేయాల్సి ఉంటుందనీ, అయితే షర్మిల తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉందన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఆమె పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొత్తలో కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించిన జోష్ ఇప్పుడు లేశమాత్రమైనా కనిపించకపోవడానికి ఆమె వ్యవహారశైలే కారణమంటున్నారు. ఇప్పటికైనా షర్మిత తన తీరు మార్చుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నారు.