బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు తెలుగుదేశం పార్టీయే పోటీ?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్పేసే లేదంటూ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ బీరాలు పలికింది. అయితే ఆ పార్టీ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలన్న ఆశలకు తెలుగుదేశం పార్టీయే గండి కొట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఖమ్మంలో నిర్వహించిన సభకు అశేష జనం  హాజరై ఆ సభను దిగ్విజయం చేశారు.

అప్పటి వరకూ విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం నామమాత్రమన్న భావన సర్వత్రా ఉండేది. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం పార్టీపై ప్రజలలో విశ్వాసం చెక్కు చెదరలేదనీ, క్యాడర్ ఇన్ టాక్ట్ గా తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉందని చెబుతూ వచ్చారు. కేవలం క్యాడర్ కు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం వల్లే తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి అంతంత మాత్రమేనన్న భావన ప్రజలలో నెలకొందని తెలుగుదేశం నాయకత్వం నమ్మింది. 2023 డిసెంబర్ లో చంద్రబాబు నాయుడు ఖమ్మం వేదికగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనసందోహాన్ని చూసి తెలంగాణలే మేమేం తోపులం అని అప్పటి వరకూ భావిస్తూ వచ్చిన బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఒక్క సారి ఉలిక్కిపడింది. సరే ఆ తరువాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. అయితే నాడు ఖమ్మం సభతో తెలంగాణలో తెలుగుదేశం బలం ఏమిటన్నది అందరికీ తెలిసి వచ్చింది. 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకువస్తానని ప్రకటించారు. అందుకోసం కార్యాచరణ సైతం సిద్ధం చేశారు. తరచూ హైదరాబాద్ వచ్చి రాష్ట్ర పార్టీ పరిస్థితిపై చర్చిస్తాననీ, సమీక్షిస్తాననీ, నెలకొసారి అయినా రాష్ట్రంలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు.  దీంతో వివిధ కారణాలతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని వీడి వేర్వేరు పార్టీలలో సర్దుకున్న వారిలో పలువురు నేతలు సొంత గూటికి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. వీరిలో అత్యధికులు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నవారే కావడం  గమనార్హం. వీరిలో మొదటిగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయిన తీగల కృష్ణారెడ్డి ఆ భేటీ అనంతరం తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడమే కా కుండా రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి చంద్రబాబు మార్గదర్శకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంచలన ప్రకటన చేశారు. తీగలే కాకుండా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా ఉన్నారు. తన మనవరాలి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికే ఆయనను కలిసినట్లు చెప్పినా.. మల్లారెడ్డి కూడా త్వరలో తెలుగుదేశం గూటికి చేరుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షపదవికి ఆయన కూడా రేసులో ఉండే అవకాశం ఉందంటున్నారు. వీరే కాకుండా నందిగం కృష్ణారావు వంటి వారు కూడా బీఆర్ఎస్ ను వీడి సైకిలెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.  

ఈ సందర్భంగా పరిశీలకులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదని, తెలంగాణ ఉద్యమ వేడి, తెలంగాణ సాధించుకున్న సంబరాల మధ్య జరిగిన 2014 ఎన్నికలలో కేడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 20పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు కూడా తెలంగాణ సంతుల్య అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిందేనన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో ఉందని చెబుతున్నారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి అంతా  ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే  జరిగిందని గుర్తు చేస్తున్నారు.  హైటెక్ సిటీ,సైబరాబాద్ వంటివి చంద్రబాబు పాలనలోనే వచ్చాయని చెబుతున్నారు.   

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పటి టీడీపీ నాయకుడే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్, బాబు మంత్రివర్గాలలో పనిచేసారు. ఈనాటి తెలంగాణ నాయకుల్లో అత్యధికులు ఒకప్పటి టీడీపీ నుంచివచ్చినవారే. వారి మాతృసంస్థ టీడీపీ నే.

తెలంగాణను పీడిస్తున్న పటేల్,పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఎన్టీఆర్ తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందారు. ఇక చంద్రబాబు వచ్చిన తరువాత ఐటీ పరిశ్రమ అభివృద్ధి జరిగి మధ్యతరగతి ప్రజలను ఉన్నత స్థాయికి ఎదిగారు. సైబరాబాద్ నిర్మాణంతో నగరం విస్తరణలో పాటు సాంకేతిక పెరిగింది. పర్యాటక ప్రాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉపాధి ఇచ్చే కామధేనువుగా మారింది. ఆ విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదు. అందుకే జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు తెలంగాణలో చంద్రబాబుకు మద్దతుగా వెల్లువెత్తిన ఆందోళనలు రాష్ట్రంలో తెలుగుదేశంకు ఉన్న మద్దతును, బలాన్ని చాటాయి. ఇప్పుడు చంద్రబాబే స్వయంగా తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో పలువురు నేతలు సైకిలెక్కేయడానికి సిద్ధపడ్డారు. ముందు ముందు మరింత మంది తెలంగాణ నేతలు హోం కమింగ్ అంటూ ప్రస్తుతం వారు ఉన్న పార్టీలను వదిలి తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమని తీగల కృష్ణారెడ్డి మాటలను బట్టి అవగతమౌతోంది.  తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రానున్న రోజులలో మారనున్నాయని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గట్టి పోటీ ఇచ్చేది తెలుగుదేశం పార్టీయేనని అంటున్నారు. 

ఇది కూడా చదవండి.. తెలంగాణలో తెలుగుదేశం.. అదే ఆదరణ.. అదే ప్రభంజనం