'జల'దీక్ష కాదు 'జలగ'దీక్ష.. మంచినీళ్లు కూడా ముట్టుకోని జగన్

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో జలదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ చేసే జలదీక్షపై ఆనం వివేకానంద రెడ్డి విమర్శల బాణాలు సంధించారు. జగన్ చేస్తున్నది 'జల'దీక్ష కాదని అది 'జలగ' దీక్ష అని ఎద్దేవ చేశారు. ఒక్కనాడైనా వ్యవసాయం చేయని వైకాపా అధినేత జగన్ కు రైతు సమస్యలు ఎలా తెలుస్తాయని.. ప్రాజెక్టుల నుంచి తన ఫ్యాక్టరీలకు నీటిని తీసుకు వెళుతున్న జగన్, ధర్నాల పేరు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. అంతేకాదు వరుస ఎమ్మెల్యేల ఫిరాయింపులతో వైసీపీ పార్టీ మరో ఆరు నెలల్లో ఖాళీ అయిపోతుందని.. ప్రతి పక్ష హోదా కూడా కోల్పోతుందని.. ప్రజలు కన్నీరు పెడుతున్నారు అని చెప్పే జగన్ కు.. ఆఖరికి తానే కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.

 

కాగా తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందన్న నేపథ్యంలో జగన్ నిన్నటి నుండి దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం నుంచి జగన్ దీక్షలో ఉండగా, రాత్రి ఒకసారి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మాత్రమే వేదికను దిగిన ఆయన, రెండు మూడు నిమిషాల్లోనే తిరిగి వేదికపైకి వచ్చారు. ఆపై పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. గత రాత్రి రెండు గంటల వరకూ ఆయన అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు. ఆపై కాసేపు విశ్రమించారు. మళ్లీ ఈరోజు యధావిధిగా దీక్షలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జగన్ చేసే దీక్షకు ప్రజల నుండి మద్దతు బాగానే లభిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ జలదీక్ష వేదిక వద్దకు వస్తున్న ప్రజలు, రైతులు, వైకాపా అభిమానుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోందని తెలుస్తోంది.